సైన్యానికి విశేషాధికారాలు కల్పిస్తున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల చేస్తున్న నిరాహార దీక్ష పదిహేనో ఏట అడుగుపెడుతున్న సమయంలో...జమ్మూ-కశ్మీర్‌లో పక్షంరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మరోసారి కశ్మీరం అట్టుడికింది. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. కారణం పాతదే. కారకులూ పాతవారే. శ్రీనగర్ సమీపంలోని ఛత్తర్‌గామ్‌లో వేగంగా వెళ్తున్న ఒక వాహనంపై ‘అనుమానం వచ్చి’ జవాన్లు కాల్పులు జరిపారు. ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాల య్యారు.
అటు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు...వాటిని అదుపు చేయడానికి లాఠీచార్జిలు అన్నీ మామూలే. వినబడనట్టు నటిస్తే, పట్టించుకోవడం మానేస్తే ఏదైనా దానంతటదే చక్కబడుతుందన్న పాలకుల వైఖరి పదే పదే ఇలాంటి ఘటనలకు తావిస్తున్నది. విధి నిర్వహణలో భాగంగా అనుమానిత వ్యక్తులపై కాల్పులు జరిపిన సందర్భాల్లో ఎవరైనా మరణిస్తే అందుకు బాధ్యులైన జవాన్లపై ముందస్తు అనుమతి లేకుండా ఏ న్యాయస్థానంలోనూ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని సాయుధ దళాల చట్టం చెబుతున్నది. అధికారాలకు ఎన్నో పరిమితులను విధించే చట్టాలే దుర్వినియోగమవుతున్న మన దేశంలో ఇలా తిరుగులేని అధికారాలను కట్టబెట్టే చట్టాలు చివరకు ఎలాంటి విపత్తులు సృష్టిస్తాయో చెప్పవలసిన అవసరం లేదు. 1990నాటినుంచి అమలవుతున్న సాయుధ దళాల చట్టం చేస్తున్నది అదే.
ముంగిట్లోకి ఎన్నికలు వచ్చాయని కావొచ్చు అధికార యంత్రాంగం ఛత్తర్‌గామ్ ఉదంతం జరిగిన వెంటనే కదిలింది. నిష్పాక్షికమైన విచారణ జరిపి బాధ్యులైనవారిని దండిస్తామని రక్షణమంత్రి అరుణ్ జైట్లీ కొన్ని గంటల్లోనే ప్రకటించారు. ‘అసాధారణమైన వేగం’తో కదిలి ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించామని సైన్యం చెప్పింది. ఇంతటితో బాధితులైనవారు సంతృప్తిపడితే సరిపోతుందన్నది వారి ఉద్దేశం కావొచ్చు. కానీ, ఇలాంటి ఉదంతాల విషయంలో రాష్ట్రంలో ఇంతవరకూ సాగిన తంతును గమనించాక ప్రజలెవరికీ ఈ చర్య సంతృప్తిని కలిగించదు. సాయుధ దళాల చట్టం ఎలా దుర్వినియోగమవుతున్నదో అక్కడి వారందరికీ తెలుసు. 51మంది మరణించిన 1993నాటి బిజ్‌బెహరా ఉదంతంలోగానీ, అయిదుగురు మరణించిన 2000 సంవత్సరంనాటి పత్రిబల్ ఘటనలోగానీ, 2010లో ముగ్గుర్ని కాల్చిచంపిన మఛిల్ ఎన్‌కౌంటర్ విషయంలోగానీ కారకులైన జవాన్లపై ఎలాంటి చర్యలూ లేవు. ఈ ఉదంతాలన్నిటి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసు శాఖ ఒక మాట అంటుంది. కేంద్ర హోంశాఖ మరోలా చెబుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ వేరే వాదన చేస్తుంది. వీటి సంగతి అటుంచి సాయుధ దళాల చట్టాన్ని పాతికేళ్లుగా అమలు చేస్తూ కూడా జవాన్లపై ఆరోపణలొచ్చిన సందర్భాల్లో క్రిమినల్ కోర్టుల్లో విచారించాలా లేక సైన్యానికి అంతర్గతంగా ఉండే కోర్టు మార్షల్‌లో విచారించాలా అన్న అంశంపైనే కేంద్రానికి స్పష్టత లేదు.
పత్రిబల్ ఘటనకు బాధ్యులైన జవాన్లను సీబీఐ గుర్తించి నాలుగేళ్ల తర్వాత వారిపై చార్జిషీటు దాఖలుచేస్తే అది కింది కోర్టునుంచి సుప్రీంకోర్టు వరకూ సాగింది. ఈలోగా పన్నెండేళ్లు గడిచిపోయాయి. సుప్రీం కోర్టులోనైనా ఈ చట్టంకింద ఎలాంటి విధివిధానాలు పాటించాలన్న అంశంపై కేంద్రం తేల్చుకోలేకపోయింది. నిందితులు ఎన్‌కౌంటర్ పేరుతో హత్యలకు పాల్పడ్డారని, అలా హత్యలు చేయడం వారి విధి నిర్వహణలో భాగం కాదు గనుక వారి ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి అవసరంలేదని సీబీఐ వాదిస్తే...రక్షణ మంత్రిత్వ శాఖ దానికి వ్యతిరేకమైన వాదన వినిపించింది.
నిందితులను కోర్టు మార్షల్ చేసి విచారించిన పక్షంలో సాధారణ కోర్టుల్లో విచారణ అక్కరలేదని సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం తీర్పునిచ్చాక కోర్టు మార్షల్ విచారణ మొదలైంది. తీరా ఈ ఏడాది మొదట్లో నిందితులంతా నిర్దోషులని కోర్టు మార్షల్ తేల్చింది. చిత్రమేమంటే ఈ ఉదంతాలన్నీ జమ్మూ-కశ్మీర్ అంతటా తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చాయి. లాఠీచార్జిలు, కాల్పులు, కర్ఫ్యూలతో రాష్ట్రం అట్టుడికింది. బాధ్యు లపై చర్య తీసుకుంటామని పాలకులు ఎన్నో విధాల హామీ ఇచ్చాక సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తీరా ఏ ఉదంతంలోనూ ఎవరికీ శిక్షలు పడటం లేదు.
శాంతిభద్రతల పరిరక్షణ కత్తిమీది సాము. దాన్నెవరూ కాదనరు. జమ్మూ-కశ్మీర్ సరిహద్దు రాష్ట్రమైనందువల్ల, ఉగ్రవాదుల చొరబాట్లు చోటుచేసు కోవడంవల్ల అక్కడ విధి నిర్వహణ మరింత కష్టం. కానీ, ఆ సాకుతో సామాన్య ప్రజలపై స్వారీ చే స్తే, అకారణంగా ప్రాణాలు తీస్తూ ఎవరికీ జవాబుదారీ కాద న్నట్టు వ్యవహరిస్తే అది పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. అన్నిటా భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మొన్న దీపావళి రోజున హిందువులు అధికంగా ఉండే జమ్మూలో కాక, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే కశ్మీర్‌లో గడి పారు. వరదల్లో సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోదరసోదరీ మణుల మధ్య దీపావళి వేడుకను జరుపుకోవాలనుకున్నానని ప్రకటించారు. ఈ తరహా చర్యలవల్ల చేకూరే మంచి ఏమైనా ఉంటే ఛత్తర్‌గామ్‌లాంటి ఉదంతాలు దాన్ని పూర్తిగా తుడిచిపెడతాయన్న సంగతిని మోదీ గుర్తించాలి. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ దీన్ని దుశ్శాసనమని నిర్ధారించింది. రద్దుచేయాలని సిఫార్సుచేసింది. ఈ చట్టం అమలును పాక్షికంగా ఉపసంహరించాలని రెండేళ్లక్రితం కేంద్ర కేబినెట్ ఉపసంఘం సూచించింది. అయినా అది యథాతథంగా అమలవుతున్నది. ఉగ్రవాదాన్ని రూపుమాపడం మాట అటుంచి దాన్ని మరింతగా పెంచే ప్రమాద మున్న ఈ చట్టంపై ఎన్డీయే సర్కారు పునరాలోచన చేయాలి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానైనా ఆ రాష్ట్ర ప్రజలకు ఈ చట్టం విషయంలో గట్టి హామీ ఇవ్వాలి.