సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉనికి చాటుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతోంది. మిగిలి వున్న కొద్దిపాటి కేడర్‌తో ‘వాపు’ను ‘బలుపు’గా చూపించే ప్రయత్నం చేస్తోంది. గురువారం పటాన్‌చెరులో జరగాల్సిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం వాయిదా పడటం వెనుక ఎన్టీఆర్ ట్రస్టు భవన్ మాస్టర్ మైండ్స్ ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలం తర్వాత ఈ నెల 19వ తేదీన పార్టీ జిల్లా నేతలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు సాధించడం లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని, సీమాంధ్రకు న్యాయం చేయాలని మాత్రమే చెప్పానని చంద్రబాబు తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరిట ప్రకటన విడుదల చేశారు.
సమావేశం రద్దు చేసుకోవాలంటూ బుధవారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు అందాయి. ‘జిల్లా నేతలతో సమావేశం పెడితే పార్టీ డొల్లతనం బయటపడుతుంది. అందుకే ప్రతి జిల్లాలో జరిగే జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఇతర తెలంగాణ జిల్లాల నేతలు కూడా హాజరవుతారు. అప్పుడు మనం బలంగా ఉన్నామని ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది’ అంటూ సమావేశం రద్దు చేయడం వెనుక కారణాలను ట్రస్టు భవన్ వర్గాలు వివరించినట్లు తెలిసింది. ‘సమావేశం పెట్టడం ఎందుకు, రద్దు చేయడం ఎందుకు, వాపును బలుపుగా చూపించి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని మా అధినేత చూస్తున్నారు’ అంటూ టీడీపీ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉనికి కోసం టీడీపీ తంటాలు
Published Thu, Sep 26 2013 11:52 PM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM
Advertisement