ఉన్నత విద్యా సంస్థల్లో అడుగుపెట్టేందుకు మార్గాలైన జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ముగిశాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక పరీక్షలకు అధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హాజరయ్యారు. వీరు ‘కీ’ల ఆధారంగా తాము సాధించే మార్కులపై ఒక అంచనాకు వచ్చుంటారు! జూన్ 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు, జూన్ 24 జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలకానున్నాయి. విద్యార్థులు ఇక కౌన్సెలింగ్‌పై దృష్టిసారించాలి. ఈ ఏడాది నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అడ్వాన్స్‌డ్ కొంత క్లిష్టంగా వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ పరీక్షపై విశ్లేషణతో పాటు ప్రముఖ ఐఐటీల్లో గత కటాఫ్
ర్యాంకులు, 2015 కటాఫ్స్ వివరాలు...
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ అభ్యర్థుల్లో ర్యాంకులు, మార్కుల అంచనా విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్షలోని ప్రశ్నలు, మార్కుల సంఖ్య తగ్గడంతో పాటు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ తరహా ప్రశ్నలకు నెగెటివ్ మార్కుల శాతం పెంచడమే దీనికా కారణం. గతేడాది వరకు 1/4గా ఉన్న నెగెటివ్ మార్కులు ఈసారి 1/2కి పెంచారు. మొత్తం రెండు పేపర్లలో కలిపి 120 ప్రశ్నలకు నిర్వహించిన పరీక్షలోమొదటి పేపర్‌లో 10 ప్రశ్నలు; రెండో పేపర్‌లో 12 ప్రశ్నలు మొత్తం 22 ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు రెండు చొప్పున నిర్ణయించారు.
ఓ మోస్తరు క్లిష్టతతో ప్రశ్నలు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు కొంత క్లిష్టతతో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇంటర్మీడియెట్, సీబీఎస్‌ఈ స్థాయిలో సిలబస్‌పై అప్లికేషన్, అనలిటికల్, కాన్సెప్ట్యువల్ అవగాహన కలిగిన విద్యార్థులకు పెద్దగా కష్టం కాదు. కానీ, సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని విద్యార్థులు చెబుతున్నారు. పేపర్-1లో ఫిజిక్స్; పేపర్-2లో మ్యాథమెటిక్స్ విభాగంలో క్లిష్టమైన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉండటం మార్కులు, ర్యాంకులపై ప్రభావం చూపనుంది.
పేపర్ల వారీగా క్లిష్టత స్థాయి
పేపర్-1 (మొత్తం మార్కులు 264; మొత్తం ప్రశ్నలు 60)
సబెక్టు క్లిష్టమైనవి మధ్యస్థం సులువైనవి
ఫిజిక్స్ 45 శాతం 36 శాతం 19 శాతం
కెమిస్ట్రీ 36 శాతం 59 శాతం 5 శాతం
మ్యాథ్స్ 34 శాతం 32 శాతం 34 శాతం
పేపర్-2 (మొత్తం మార్కులు 240, ప్రశ్నలు 60)
సబెక్టు క్లిష్టమైనవి మధ్యస్థం సులువైనవి
ఫిజిక్స్ 40 శాతం 50 శాతం 10 శాతం
కెమిస్ట్రీ 20 శాతం 65 శాతం 15 శాతం
మ్యాథ్స్ 55 శాతం 40 శాతం 5 శాతం
ఉమ్మడి కౌన్సెలింగ్
గతేడాది వరకు నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి జేఈఈ మెయిన్ మార్కులు-ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ జరిగింది. అలాగే ఐఐటీలు, ఐటీ-బీహెచ్‌యూ, ఐఎస్‌ఎం ధన్‌బాద్‌లలో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా వేర్వేరుగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్, సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ ఉండేది. ఈసారి ఐఐటీలు, నిట్‌లు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు అన్నిటికీ కలిపి ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీని నియమించారు. ఈ కౌన్సెలింగ్ విధానం అమల్లోకి వస్తే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు రెండు కౌన్సెలింగ్‌ల బాధ తప్పుతుంది.
జేఓఎస్‌ఏఏ ద్వారా కౌన్సెలింగ్
ఈ ఏడాది కొత్తగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ద్వారా నిర్వహించనున్న ఉమ్మడి కౌన్సెలింగ్ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. జూన్ 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు, జూన్ 24 జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడవుతాయి. ఆ తర్వాత జూన్ 25 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వెబ్‌సైట్ (www.joasaa.nic.in) అందుబాటులోకి వస్తుంది.ఈ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం జూన్ 25 నుంచి జూన్ 29 వరకు వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది.జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందని అభ్యర్థులు తమ ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లను మాత్రమే తమ ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సి ఉంటుంది.జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొంది, ర్యాంకులు సాధించిన అభ్యర్థులు అన్ని ఇన్‌స్టిట్యూట్‌లను తమ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రాధాన్యత క్రమంలో పేర్కొనేందుకు అవకాశం ఉంటుంది.
ఉమ్మడి కౌన్సెలింగ్‌తో ప్రయోజనం
ఐఐటీలకు జేఈఈ అడ్వాన్స్‌డ్, ఎన్‌ఐటీలకు జేఈఈ మెయిన్ అర్హత తప్పనిసరి. ఇలాంటి పరిస్థితిలో జాయింట్ సీట్ అలొకేషన్ వల్ల ప్రయోజనమేంటి? అనే ప్రశ్న విద్యార్థుల్లో తలెత్తుతోంది. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనం సమయం ఆదా అవడం; ఇన్‌స్టిట్యూట్ ఎంపిక విషయంలో వెసులుబాటు లభించడం. ఉదాహరణకు రమేశ్ అనే విద్యార్థికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు వేల ర్యాంకు; మెయిన్‌లో మూడు వేల ర్యాంకు వచ్చిందనుకుందాం. అడ్వాన్స్‌డ్ ర్యాంకు పరంగా ఐఐటీలో సీటు లభించడం ఖాయం. కానీ, గతేడాది సరళిని బట్టి చూస్తే ఆ ర్యాంకుకు లభించిన ఐఐటీ క్యాంపస్ పట్ల సదరు విద్యార్థికి ఆసక్తి లేదు. దానికంటే తనకు సమీపంలోని ఎన్‌ఐటీలో చేరడం మంచిదని భావిస్తున్నాడు. అలాంటప్పుడు విద్యార్థి తన ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌లో ఎన్‌ఐటీని తొలి ప్రాథమ్యంగా పేర్కొని సీటు పొందొచ్చు.
ఛాయిస్ ఫిల్లింగ్‌లో అప్రమత్తత
జాయింట్ అపెక్స్ బోర్డ్ సేకరించిన ర్యాంకుల డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గా సీట్ల కేటాయింపు జరిగే విధంగా సాఫ్ట్‌వేర్ రూపకల్పన జరుగుతోంది. కాబట్టి జేఈఈ విద్యార్థులు ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో ప్రాథమ్యాలు ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అంతేకాకుండా ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పేజీలో కనిపించే కోర్సు, ఇన్‌స్టిట్యూట్, కోడ్ వంటి విషయాలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. నాలుగేళ్ల బీటెక్ చదవాలనుకుంటే 4 డ్ఛ్చటట ఠఛ్ఛీట జట్చఛీఠ్చ్ట్ఛ అనే ఆప్షన్‌కు మాత్రమే టిక్ చేయాలి. కొన్ని ఐఐటీల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
‘జాయింట్ అలొకేషన్’ ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ లభ్యత:
జూన్ 25 నుంచి జూన్ 29 వరకు
మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు వెల్లడి: జూలై 1
రెండో రౌండ్ సీట్ల కేటాయింపు వెల్లడి: జూలై 7
మూడో రౌండ్ సీట్ల కేటాయింపు వెల్లడి: జూలై 13
నాలుగో రౌండ్ (కేవలం ఎన్‌ఐటీలు; ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు) సీట్ల కేటాయింపు వెల్లడి: జూలై 17అభ్యర్థులు తమకు సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత నిర్దేశ తేదీల్లో తమ ఆమోదాన్ని ఆన్‌లైన్ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలి. లేదంటే సీటు రద్దవుతుంది.
ఏ ఇన్‌స్టిట్యూట్ అయితే మంచిది?
దేశంలోని 16 ఐఐటీలలో ఎక్కడ సీటు వచ్చినా మంచిదే. అయితే వాటిల్లో ఏ క్యాంపస్ అయితే మరింత మంచిది అని ఆలోచిస్తారు. గతేడాది ఆయా ఐఐటీల్లో ఓపెనింగ్ ర్యాంకులు; క్లోజింగ్ ర్యాంకుల సరళిని పరిశీలిస్తే.. ఐఐటీ ముంబై, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ- చెన్నై, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-ఖరగ్‌పూర్‌లకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. టాప్ ర్యాంకర్లలో అధిక శాతం విద్యార్థుల తొలి ఓటు సీఎస్‌ఈ బ్రాంచ్‌కే. 2015 కటాఫ్ వివరాలు
ఈ ఏడాది ఐఐటీలలో సీట్లు చేజిక్కించుకోవడానికి అవసరమైన కనీస అర్హత మార్కులను జేఈఈ బోర్డు కేటగిరీల వారీగా అధికారికంగా ప్రకటించింది. అగ్రిగేట్ మార్కులతోపాటు ప్రతీ సబ్జెక్టులో సాధించాల్సిన కనీస మార్కుల శాతాన్ని కూడా ప్రకటించింది. 504 మార్కులకు నిర్వహించిన పరీక్షలో కేటగిరీలవారీగా కనీస అర్హత మార్కుల వివరాలు...
కామన్ మెరిట్ లిస్ట్ 177
ఓబీసీ 159
ఎస్సీ 89
ఎస్టీ 89
ఫలితాల లోపే అవగాహన
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆశిస్తున్న విద్యార్థులు ఫలితాల వెల్లడి తేదీలోపే ఇన్‌స్టిట్యూట్‌లు, బ్రాంచ్‌ల ఎంపిక విషయంలో స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడు ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తేలిక అవుతుంది. అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణులకు అన్ని ఇన్‌స్టిట్యూట్‌ల ఛాయిస్ ఫిల్లింగ్ అవకాశం ఉంటుంది. మెయిన్ ఉత్తీర్ణులకు మాత్రం కేవలం ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలకే అవకాశం. మెయిన్ ఉత్తీర్ణులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. గత సంవత్సరాల్లో హోం స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటాలో చివరి ర్యాంకుల వివరాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది.
- అజయ్ ఆంటోని,
జేఈఈ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్.
జేఈఈ.. కౌన్సెలింగ్‌వైపు కదలండిలా...
Published Wed, Jun 3 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM
Advertisement
Advertisement