శివారు తీర్పు.. విలక్షణం
- సరూర్‌నగర్‌లో ఎంఐఎం రికార్డు
- రాజేంద్రనగర్‌లో స్వతంత్రులదే కీలక పాత్ర
- కుత్బుల్లాపూర్‌లో ఖాతా తెరిచిన వైఎస్సార్‌సీపీ
- హయత్‌నగర్‌లోటీడీపీకి చాన్స్
- ఘట్‌కేసర్‌లో కారు జోరు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో శివారు ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. మంగళవారం విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై నగరంలో ఆద్యంతం ఉత్కంఠ నె లకొంది. హోరాహోరీగా జరిగిన స్థానిక పోరులో ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలు తారుమార య్యాయ్యన్న సంకేతాలు వెలువడ్డాయి. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జరిగిన ఈ కౌంటింగ్‌పై అన్ని వర్గాలు ఆసక్తి చూపాయి. స్థానిక పోరులో మొన్నటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శివారు ఓటర్లు షాక్‌నిచ్చారు.
రాజేంద్రనగర్ , సరూర్‌నగర్ మండలాల్లో స్వతంత్రుల మద్దతు లేనిదే మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానాలను హస్తం పార్టీ చేజిక్కించుకునే అవకాశాలు లేని పరిస్థితి నెల కొంది. కుత్బుల్లాపూర్ ఎంపీపీ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మండలంలో అత్యంత కీలకమైన నిజాంపేట్ ఎంపీటీసీ పదవిని వైఎస్సార్‌సీపీ గెలుపొందడం విశేషం. ఇక ఘట్‌కేసర్ మండలంలో టీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శించింది. ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థులను 18 ఎంపీటీసీ స్థానాల్లో గెలిపించడంతో ఎంపీపీ పదవిని గులాబీ దళం గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక తీర్పు నేపథ్యంలో శివార్లలోని పలు మండలాల్లో తాజా పరిస్థితి ఇదీ..
కుత్బుల్లాపూర్: మండలంలో 33 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీడీపీ 17 స్థానాలను గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తరువాత స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఐదు చోట్ల గెలుపొందింది. బీజేపీ 2 స్థానాల్లో నెగ్గింది. స్వతంత్రులు 8 చోట్ల గెలుపొంది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మండలంలో కీలకమైన నిజాంపేట్ ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుపొంది రికార్డు సృష్టించింది.
హయత్‌నగర్: ఈ మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలుండగా.. కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీడీపీ 8, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. ఈ రెండు పార్టీల కూటమి ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఇక స్వతంత్రులు రెండు స్థానాల్లో గెలుపొందారు.
ఘట్‌కేసర్: మండలంలో మొత్తం 46 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీఆర్‌ఎస్ 18 స్థానాల్లో గెలుపొందడంతో కారు జోరు సుస్పష్టమైంది. ఇక్కడ ఎంపీపీ పదవిని గులాబీ పార్టీ చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా టీడీపీ 13 ఎంపీటీసీ స్థానాలతో ద్వితీయస్థానం సాధించింది. కాంగ్రెస్ 9 చోట్ల, బీజేపీ 3 చోట్ల, స్వతంత్రులు మూడు చోట్ల గెలుపొందారు.
రాజేంద్రనగర్: మండలంలో మొత్తం 22 ఎంపీటీసీలకుగాను కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుపొంది పెద్ద పార్టీగా అవతరించినా.. స్వతంత్రులుగా గెలుపొందిన నలుగురు అభ్యర్థుల మద్దతు లేనిదే ఎంపీపీ పోస్టు దక్కించుకోవ డం కష్టసాధ్యమే. ఈ మండలంలో టీడీపీ ఏడు, బీజేపీ ఒక ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకున్నాయి. కా గా మండలంలో భారీ స్థాయిలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. 22 ఎంపీటీసీ స్థానాల్లో 1349 ఓట్లు, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో 1434 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. వీటి కారణంగా అభ్యర్థుల ఫలితాలు తారుమారయ్యాయి.
సరూర్‌నగర్: మండలంలో మొత్తం 49 స్థానాలుండగా.. ఎంఐఎం ఏకంగా 14 ఎంపీటీసీ స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ 12, టీడీపీ 10, బీజేపీ 8, సీపీఐ 2, స్వతంత్రులు మూడు చోట్ల గెలుపొం దారు. స్వతంత్రులు, సీపీఐ మద్దతుతోనే కాం గ్రెస్ ఎంపీపీ పదవిని చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. కాగా సార్వత్రిక ఎన్నికల్లో మహేశ్వరం నియోజకర్గం నుంచి ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే అదే పార్టీ అభ్యర్థి ఎంపీపీ పదవిని దక్కించుకునే అవకాశాలూ కనిపిస్తున్నాయి.