కరీంనగర్ నుంచే శంఖారావం!
కేసీఆర్ సెంటిమెంట్ మేరకు తొలి సభ
ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ సంసిద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వచ్చే వారాంతంలో అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ని కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనలో మిగతా పార్టీల కంటే టీఆర్‌ఎస్ ఒక అడుగు ముందున్న విషయం తెలిసిందే. అలాగే ప్రచారాన్ని కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
వీలైనంత త్వరగా మిగతా స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 11న స్థానిక సంస్థల రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే కరీంనగర్ సభతో ప్రచారం మొదలుపెట్టాలని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు యోచిస్తున్నారు. ఆ తర్వాత రోజుకు మూడు నుంచి ఐదు చోట్ల కేసీఆర్ ప్రసంగించేలా పర్యటన షెడ్యూల్ ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా కేసీఆర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కాగా ఇతర ప్రాంతాల్లోనూ టీఆర్‌ఎస్ అధినేత ప్రసంగాలను వినిపించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. తెరలను ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రసంగాలున్న త్రీడీ వీడియోలను ప్రదర్శించనున్నారు. నగర శివారులోని పార్టీ నాయకుడి ఫాంహౌజ్‌లో ఈ ప్రసంగాలను రికార్డు చేసినట్టు సమాచారం.
కేసీఆర్‌ను కలసిన నారాయణమూర్తి
సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి శనివారం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని, తాను రూపొందించిన ‘పోరు తెలంగాణ’ సినిమా ప్రివ్యూని చూడాలని మాత్రమే కేసీఆర్‌ని కోరినట్టు చెప్పారు.
కలవలేకపోయిన జయశంకర్ సోదరుడు
కాగా, టీఆర్‌ఎస్ అధినేతను కలిసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు వాసుదేవరాజు విఫలయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా కేసీఆర్ ఆయనకు సమయమివ్వలేదని తెలిసింది. ఉదయం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చిన వాసుదేవరాజు.. ఆ సమయంలో కేసీఆర్ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన దర్శనం కలగకపోవడంతో మళ్లీ పార్టీ కార్యాలయానికి చేరుకుని చాలా సమయం వేచి చూశారు. చివరకు కేసీఆర్ రాడనే విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.