వంటల సైంటిస్ట్
పన్నెండేళ్ల వయసులో ఈ కుర్రవాడు వంటగదిలోకి ప్రవేశించాడు. అక్కడి పదార్థాలతో కొత్త కొత్త ప్రయోగాలు మొదలుపెట్టాడు. నాలుగేళ్లు తిరిగేలోపు ఆరు లక్షల మంది ఆహారప్రియుల చవులను ఊరించాడు. అతడి పేరు యమన్ అగర్వాల్. హైదరాబాద్‌లో ఉంటున్న యమన్ ఇంత చిన్న వయసులోనే గరిటె ఎందుకు పట్టుకున్నట్లు?
‘‘నేను ల్యాప్‌టాప్‌లో నిరంతరం వంటల కార్యక్రమాలు చూస్తూ గంటలకొద్దీ సమయం గడిపేసేవాడిని. అలా నా కిచెన్ కెరియర్ ప్రారంభమైంది.. ఒక్క వంటల కార్యక్రమాన్ని కూడా మిస్ అవ్వడానికి ఇష్టపడేవాడిని కాదు. రోడ్డు పక్కన ఉన్న స్టాల్ దగ్గర నుంచి సెవెన్ స్టార్ రెస్టారెంట్ వరకూ వాళ్లు ఎలా వండుతున్నారో శ్రద్ధగా టీవీ ప్రోగ్రామ్స్‌ని పరిశీలించేవాడిని. అలా నేను అస్తమానం ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం చూసిన మా చుట్టాలు, ఇంట్లో వాళ్లు ‘‘ఎక్కువసేపు గేమ్స్ అడకు. మంచిది కాదు’’ అని చెప్పేవారు. నేను వంటల్ని చూస్తున్నానని వారికేం తెలుసు. అలా ఎప్పడూ ఇతరుల వంట కార్యక్రమాలు చూస్తూ గడిపేసిన నేను, ఇప్పటికైనా ఒక సొంత వంటకం తయారుచేయాలనుకున్నాను. వెంటనే బటర్ పనీర్ మసాలా (నా మొదటి వంటకం) తయారుచేశాను. నా వంటకం రుచి చూసిన మా వాళ్లు ‘ఇది ఫైవ్ స్టార్ డిష్’ అని నన్ను ప్రశంసించారు. మా బంధువులు కూడా నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ తరవాత కొంత కాలానికి నా శాకాప్రావీణ్యానికి యూ ట్యూబ్‌ని వేదికగా చేసుకున్నాను. అలా నా కెరీర్ ఒక గాడిలో పడింది. అయితే అందరూ చేసినట్టే నేను కూడా చేస్తే ప్రయోజనం లేదనుకున్నాను. అందుకే కేవలం శాకాహార వంటలకు మాత్రమే పరిమితమయ్యాను. సక్సెస్ సాధించాను’’ అంటాడు యమన్ అగర్వాల్. ఇప్పటి వరకు అతడు 150 వరకు తన వంటకాలను యూ ట్యూబ్‌లో ఉంచాడు. కుకింగ్‌షుకింగ్ (ఛిౌౌజుజీజటజిౌౌజుజీజ) చానల్ ద్వారా ఈ వంటకాలను అప్‌లోడ్ చేస్తున్నాడు. యమన్‌కు ఇప్పటికే 20,000 మంది సబ్‌స్క్రైబర్లు, మూడు మిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారు.
ఎవరైనా తమ రెసిపీలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, సక్సెస్ సాధించడానికి కావలసిన వస్తువులు, తయారీ గురించి అడిగితే చాలా ఆసక్తి కరంగా చెప్తాడు యమన్. మీరే చూడండి.
- సంభాషణ: డా. వైజయంతి