అస్త్ర తంత్ర : మన భద్రత ఎవరి బాధ్యత?
ఆడపిల్లలకు పీడకలల్నే ఎక్కువ మిగిల్చిన సంవత్సరం 2013. కిడ్నాపులు, మానభంగాలు, హత్యలతో సంవత్సరమంతా చేదునే రుచి చూపించింది. ఓ నిర్భయ కథ భయంతో వణికిస్తే... ఓ గుడియా వ్యథ గుండెల్ని మెలిపెట్టింది. ఇంకా ఎన్నో అక్రమాలు... ఎందరివో ఆక్రందనలు. ఆడపిల్లగా పుట్టడం నేరమా, ఆడపిల్ల ఈ దేశంలో బతకడం అంత కష్టమా అన్న ప్రశ్నలతో దిక్కులు పిక్కటిల్లాయే కానీ... ఈ క్షణం వరకూ వాటికి సమాధానం మాత్రం దొరకలేదు. కనీసం ఆ సమాధానం వచ్చే సంవత్సరమైనా దొరకుతుందని ఆశించవచ్చా?
ఏమో... చెప్పలేం. అయినా ఎవరినో ప్రశ్నించి సమాధానం కోసం ఎదురు చూడటం ఎందుకు? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన రక్షణ కోసం మనమేం చేస్తున్నాం అని ప్రశ్నించుకుందాం. మనకోసం మనమేం చేయాలో ఆలోచించుకుందాం. మన భద్రత ఎవరి బాధ్యతా కాదు. మన బాధ్యతే. అందుకే... మన కోసం మనం కొన్ని చేసుకుందాం.
స్నేహాలు మంచివే. కానీ మగ స్నేహాల విషయంలో జాగ్రత్త తప్పదు. అందరూ చెడ్డవాళ్లే ఉంటారని కాదు. మనం మంచివాళ్లనుకునే వారిలో మేకవన్నె పులులు ఉండరని అనుకోలేం. మొన్నటికి మొన్న ఉత్తరాదికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించినవాడే కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. వైజాగ్‌కు చెందిన ఓ అమ్మాయిని స్నేహితుడే పార్టీకి పిలిచి అత్యాచారం చేశాడు. అందుకే... స్నేహం చేసేటప్పుడు కాస్త ఆ మనిషి గురించి తెలుసుకోవడం ఉత్తమం. స్నేహంలో కూడా కొన్ని పరిమితులు పాటించడం క్షేమం.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉందాం. మన వ్యక్తిగత వివరాలను వాటిలో పెట్టడం, ఫొటోలు అప్‌లోడ్ చేయడం, ఫోన్‌నంబర్లు వంటివి షేర్ చేయడం మానేద్దాం. చెడు ఆలోచనలు మనకు లేకపోవచ్చు. వేరేవారికి రావని చెప్పలేం కదా!
ఒంటరితనానికి చెక్ పెడదాం. అంటే... రాత్రిళ్లు ఒంటరిగా ప్రయాణాలు చేయడం, ఒంటరిగా పార్టీలకు వెళ్లడం, ఒంటరిగా షాపింగులు చేయడం... ఏదీ ఒంటరిగా వద్దు. తోడు ఎవరూ లేరనుకుంటే పగలు చేసుకోవాలి తప్ప... రాత్రిపూట రోడ్డుమీదికి వెళ్లడం, రిస్క్‌ను కొని తెచ్చుకోవడమే!
లౌక్యం నేర్చుకుందాం. అర్జంటుగా ఫోన్ చేసుకోవాలి, ఓసారి ఫోన్ ఇవ్వండి అంటారు. ఇచ్చేస్తాం. మన నంబర్ సేవ్ చేసుకుని వేధిస్తారు. ఎవరో కొత్తవాళ్లు ఏదో పనుండి వచ్చినట్టు వస్తారు. ఇంట్లోకి పిలిచి మరీ మాట్లాడతాం. ఆ తర్వాత లేనిపోని కష్టాలు మొదలు. సాయం చేయవద్దని కాదు. ప్రమాదాన్ని ముందే ఊహించి మరీ సాయం చేయడం మంచిది!
మనవంతుగా మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుందాం. కనీసం ఈ కొత్త సంవత్సరం అయినా మన కష్టాలు తీరతాయేమో చూద్దాం. మనం కోరుకుంటోన్న భద్రత మనకు దొరుకుతుందని ఆశిద్దాం!