ఏ ఉద్యోగమూ తక్కువ కాదు! | Any job is not cheap! | Sakshi
Sakshi News home page

ఏ ఉద్యోగమూ తక్కువ కాదు!

Published Sun, May 25 2014 11:44 PM | Last Updated on Fri, May 25 2018 7:14 PM

ఏ ఉద్యోగమూ తక్కువ కాదు! - Sakshi

ఏ ఉద్యోగమూ తక్కువ కాదు!

 ప్రేరణ
 
ఆన్‌లైన్ కొనుగోళ్ల వెబ్‌సైట్ అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికన్ హాస్యనటుడు జే లెనో, మెక్‌డోనాల్డ్స్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) జాక్ స్కిన్నర్‌ల మధ్య ఉన్న సారూప్యం ఏమిటో తెలుసా? వారు తమ కెరీర్‌ను మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్‌లో ప్రారంభించారు. ప్రారంభంలో వారు అందులో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోసుకున్నారు. మనదేశంలో అలాంటి పరిస్థితిని ఊహించగలమా? ఇక్కడ చాలామందికి చిన్న ఉద్యోగాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. తమ స్థాయికి తగ్గ కొలువులే  కావాలని కోరుకుంటారు. సవాళ్లను ఎదుర్కోవాలంటే భయపడతారు. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని అనుకుంటారు. జెఫ్ బెజోస్, జే లెనో, జాక్ స్కిన్నర్‌ల నుంచి భారత్‌లోని యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
 
 ఎదురుచూపులకు స్వస్తి పలకండి
 నేటి యువత తమకు ‘సరైన’ ఉద్యోగమే రావాలని కోరుకుంటున్నారు. వస్తున్న ఉద్యోగాలు వారికి నచ్చడం లేదు. అవి చాలా తక్కువ స్థాయి జాబ్‌లని, అందులో ఎక్కువ జీతం రాదనేది వారి ఫిర్యాదు. కాబట్టి పెద్ద కొలువు కోసమే ఎదురు చూస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఆశించిన జాబ్ రావాలంటే చాలా కష్టం. నేడు విజయవంతమైన వ్యక్తులెందరో ప్రారంభంలో దిగువ స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ పైకొచ్చినవారే. అలాంటి ఉద్యోగాలే వారి ఉన్నతికి తోడ్పడ్డాయి.  కాబట్టి ఎదురుచూపులకు ఇకనైనా స్వస్తి పలకండి. మీకు వచ్చిన ఏదో ఒక ఉద్యోగంలో వెంటనే చేరిపోండి. బద్ధకాన్ని వదిలి, పని ప్రారంభించండి.
 
 పనిలో నిరాసక్తత వద్దు  
 బర్గర్లు సరఫరా చేసే రెస్టారెంట్‌లో ఎక్కువ కాలం పనిచేయాలంటే ఎవరికైనా విసుగు అనిపిస్తుంది. చాలా ఉద్యోగాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. నేటి యువతీ యువకులు చాలా త్వరగా బోర్ ఫీలవుతుంటారు. వెంటనే మార్పును కోరుకుంటారు. లాంగ్‌టర్మ్‌లో సక్సెస్ సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అప్పగించిన పనిని సమర్థంగా పూర్తిచేయగలగాలి. నిరాసక్తత కలగకుండా చూసుకోవాలి. మెక్ డోనాల్డ్స్‌లో పనిచేసేటప్పుడు జెఫ్ బెజోస్ ప్రతిరోజూ కనీసం 300 కోడిగుడ్లను పగలగొట్టి, బర్గర్లు తయారు చేయాల్సి వచ్చేది. అయినా బెజోస్ ఎక్కడా నిరాశ చెందలేదు. ఇచ్చిన పనిని ఉత్సాహంగా చేసేవాడు. తర్వాత రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది లావాదేవీలను కొనసాగించే అమెజాన్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఈ వెబ్‌సైట్ విజయం వెనుక మెక్‌డొనాల్డ్స్‌లో నేర్చుకున్న పని అనుభవం అతడికి ఎంతగానో ఉపయోగపడింది. చిన్నచిన్న పనులను సైతం సమర్థంగా పూర్తిచేయగల లక్షణం వెలకట్టలేనిది.
 
 కస్టమర్ చెప్పిందే రైట్!

 ఒక సంస్థలో మీరు నిర్వర్తిస్తున్న పాత్ర ఎలాంటిదైనా కావొచ్చు. వినియోగదారులను మెప్పించడమే అన్నింటికంటే ప్రధానం. వినియోగదారులకు సేవ చేసే విషయంలో చాలామందికి అహంభావం అడ్డొస్తూ ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే అహంభావాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. సేల్స్ జాబ్‌లో ఉన్నవారు, ఫాస్టుఫుడ్ ఔట్‌లెట్లలో పనిచేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ మీ మాటే చెల్లుబాటు కావాలనుకుంటే కుదరదు.
 
 విజయం.. ఒక్కరోజులో అసాధ్యం!
 జీవితంలో కోరుకున్న విజయం సాధించాలంటే నిరంతర శ్రమ, బాధ్యతలను భుజానికెత్తుకోవడం, గట్టి పట్టుదల వంటి లక్షణాలు అవసరం. సక్సెస్ వచ్చేవరకూ పట్టువిడవక పనిచేయాలి. ఇన్‌స్టంట్ సక్సెస్ రావాలని కోరుకుంటే నిరాశ తప్పదు. జాక్ స్కిన్నర్ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో కౌంటర్ వెనుక 30 ఏళ్లు పనిచేశాడు. అనంతరం అదే సంస్థకు గ్లోబల్ సీఈఓగా ఎదిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన కనీసం కాలేజీకి కూడా వెళ్లలేదు.
 
 చేతులకు బురద అంటుకోనివ్వండి
 బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలు సైతం చిన్నచిన్న పనులు చేసేందుకు ఏమాత్రం సిగ్గుపడరు. భారత్‌లోని ఓ భారీ రిటైల్ మార్కెట్ చైన్ గ్రూప్ కంపెనీ సీఈఓ తమ స్టోర్లలో ఎలాంటి పనులైనా సంతోషంగా చేస్తుంటారు. ఆటోమొబైల్ కంపెనీల యజమానులు కూడా కార్లను మరమ్మత్తు చేస్తుంటారు. చేతులకు గ్రీజ్ మరకలు అంటుకున్నా తమ పనిలోనే ఆనందం పొందుతుంటారు. మెక్ డొనాల్డ్స్‌లో ఉద్యోగంలో ఉన్నప్పుడు జే లెనో అన్ని రకాల పనులు చేసేవారు. అవసరాన్ని బట్టి స్వయంగా చీపురు చేతబట్టి రెస్టారెంట్‌ను శుభ్రం చేసేవారు. కాబట్టి చేతులకు బురద అంటుకున్నా ఫర్వాలేదు, వెంటనే పనిలోకి దిగండి.
 
 టీమ్ వర్క్‌తో అద్భుతాలే!
 మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరితే.. మీరొక్కరే అన్ని పనులూ చేయలేరు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తారు. యాజమాన్యం ఎలాంటి బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పూర్తి చేయాలి. బృందమంతా కలిసి పనిచేస్తేనే సంస్థ విజయం సాధిస్తుంది. మీరు కెరీర్ ప్రారంభించబోయే ముందు జెఫ్ బెజోస్, జే లెనో, జాక్ స్కిన్నర్‌లను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు చేరబోయే సంస్థ, చేసే ఉద్యోగం, వచ్చే జీతం చాలా తక్కువే కావొచ్చు. కానీ, అక్కడ నేర్చుకునే అనుభవం ఎంతో గొప్పది. భావి జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది.
     -‘కెరీర్స్’ 360 సౌజన్యంతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement