అన్యురిజమ్స్ బ్రెయిన్‌లో బ్లడ్ వాల్కనో ! | Blood Volcano in Anyurijams Brain | Sakshi
Sakshi News home page

అన్యురిజమ్స్ బ్రెయిన్‌లో బ్లడ్ వాల్కనో !

Published Mon, Oct 7 2013 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

అన్యురిజమ్స్ బ్రెయిన్‌లో బ్లడ్ వాల్కనో ! - Sakshi

అన్యురిజమ్స్ బ్రెయిన్‌లో బ్లడ్ వాల్కనో !

మీరు ఎప్పుడైనా పొడుగ్గా ఉండే బెలూన్‌లు ఊదారా? ఒక్కోసారి ఆ పొడవాటి బెలూన్స్‌లో ఎక్కడైనా కాస్తంత బలహీనమైన చోటు ఉందనుకోండి. బెలూన్ అంతా ఒక్క రీతిలో కాకుండా... ఆ బలహీనమైన చోట చిన్న బుడగలాగా పొడుచుకువస్తుంది. మనం బలంగా గాలి ఊదితే... ఆ బలహీనమైన చోట పిగిలిపోయినట్లుగా అయి బెలూన్ ‘టప్’ అని పేలిపోవచ్చు. అచ్చం ఇలాంటి చర్యే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లోనూ జరగవచ్చు. మెదడుకు రక్తం చేరవేసే రక్తనాళాల్లో బలహీనమైన చోట చిన్న బుడగలా ఏర్పడి... కాలక్రమేణా అది బలహీనమవుతూ ఒక్కోసారి అది అకస్మాత్తుగా చిట్లిపోతే మెదడులో రక్తస్రావం అవుతుంది. ఇలా మెదడులో రక్తనాళాల్లో ఎక్కడైనా బలహీనమైన ప్రాంతం ఉండి, అక్కడ రక్తం బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అంతా బాగున్నట్లే కనిపిస్తూ అకస్మాత్తుగా ప్రాణాంతకంగా మారే అన్యురిజమ్ కండిషన్‌పై అవగాహన కోసం ఈ కథనం. 
 
 మెదడు తాలూకు రక్తనాళాల్లోని బలహీనమైన ప్రదేశాలు చిన్న బుడగల్లా ఉబ్బిపోయే అన్యురిజమ్ కండిషన్స్ మన దేశంలో ఇప్పుడు సాధారణంగా చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా సంభవించే ఈ పరిణామం ప్రాణాంతకంగా మారితే పెద్దగా తెలిసేదే కాదు. రోగి అకస్మాత్తుగా మరణించేవాడు. మూడు దశాబ్దాల క్రితం ప్రతి లక్షమందిలో 5 నుంచి 10 మంది దీనితో మరణించేవారు. కానీ ఆ మరణాలు దాని వల్ల అని తెలిసేది కాదు. ఎందుకంటే కారణం తెలిసేలోపే ప్రమాదం జరిగిపోయేది. అయితే అప్పట్లో పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఈ కేసులు ఎక్కువగా కనిపించేవి. అప్పుడు మన వద్ద కూడా ఈ కేసులు అత్యధికంగానే ఉంటున్నాయి. కారణం... ఇప్పుడు మన వద్ద కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షల రంగంలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకోవడమే. 
 
 అన్యురిజమ్ మెదడుకే పరిమితమా...? 
 అన్యురిజమ్ అన్నది కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాదు. నిజానికి రక్తనాళాలు ఉన్న ప్రతిచోటా అది పలుచబారి, చిట్లిపోయే ఈ ప్రమాదం ఉండనే ఉంటుంది. కానీ మిగతాచోట్ల అలా జరిగితే ఆ పరిణామం... మెదడు విషయంలో జరిగేంత ప్రమాదకరంగా ఉండదు. రక్తస్రావం మెదడులో జరిగితే అక్కడ శరీరంలోని అన్ని కీలకమైన అవయవాలను నియంత్రించే భాగాలుంటాయి. కాబట్టి అవన్నీ ప్రభావితమైపోయి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మెదడులో సంభవించే అన్యురిజమ్‌కు అంతటి ప్రాధాన్యం. 
 
 అన్యురిజమ్ తీవ్రత! 
 మన దేశంలో ఏటా ప్రతి లక్షమందిలో ఎనిమిది నుంచి పదిమంది అన్యురిజమ్ బారిన పడుతున్నారు. ఇందులో 40 శాతం మంది మరణానికి గురవుతుంటారు. బతికి బయటపడ్డ మిగతావారిలోనూ మూడింట రెండు వంతుల మంది మెదడులో రక్తస్రావం జరిగిన కారణాన ఏదో ఒక రకమైన నరాల కారణంగా వచ్చే ఏదో ఒక వైకల్యం (న్యూరలాజికల్ డెఫిసిట్)తో బాధపడాల్సిన పరిస్థితి. అన్యురిజమ్‌కు గురైన రోగుల్లో 20 శాతం నుంచి 30 శాతం మంది ‘అన్యురిజమల్ సబార్కనాయిడ్ హేమరేజ్ (ఎస్‌ఏహెచ్)తో ఆసుపత్రికి వచ్చేలోపే మరణిస్తుండటం ఈ రుగ్మతలోని విషాదం. ఎందుకంటే మెదడులోని సబార్కనాయిడ్ ప్రాంతంలో రక్తస్రావం జరిగాక మెదడు కు సంభవించే నష్టాన్ని అటు మందులతోనూ, ఇటు శస్త్రచికిత్స ద్వారానూ సరిచేసేందుకు వీలుకాదు. ఇక అన్యురిజమ్ కారణంగా రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురు శాశ్వతంగా ఏదో ఒకరకమైన అంగవైకల్యానికి గురవుతుంటారు. పైగా దీనిబారిన పడేవారు చాలా సందర్భాల్లో చిన్న వయసువారై ఉంటారు. (35 నుంచి 60 లోపువారు ఎక్కువ). ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏమిటంటే... మెదడులోని ఈ రక్తనాళాలలోని బలహీనత పైకి కనిపించేందుకు ఆస్కారం ఉండదు. ఫలితంగా ఎలాంటి లక్షణాలూ లేకుండా అకస్మాత్తుగా ఈ రుగ్మత విరుచుకుపడి చేయాల్సినంత నష్టం మిగుల్చుతుంది. 
 
 చిట్లనివీ ఉంటాయి... 
 చాలామందిలో మెదడులో రక్తనాళాలు ఇలా బలహీనంగా ఉండవచ్చు. కానీ అదృష్టవశాత్తు జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. ఉదాహరణకు ఒక రక్తనాళంలో అంగుళంలో ఎనిమిదో వంతు ఉండే అన్యురిజమ్స్‌లో 50 శాతం నుంచి 80 శాతం ఎప్పటికీ చిట్లకపోవచ్చు. ఇక కొందరిలో ఈ రక్తనాళాల్లోని ఉబ్బు అంగుళం కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. వీటినే ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఈ జెయింట్  అన్యురిజమ్స్ అకస్మాత్తుగా చిట్లడానికి ఆస్కారం ఉంది. ఇవి చిట్లాక రోగికి ఎటువంటి సూచనలూ లేకుండానే అకస్మాత్తుగా పక్షవాతం వచ్చేందుకు ఆస్కారం ఉంది. 
 
 
 గుండెపోటులాంటిదే అన్యురిజమ్... 
 దీన్నీ మనం గుండెజబ్బుతో పోల్చవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం అకస్మాత్తుగా ఉన్నట్లే అన్యురిజమ్స్ సైతం అకస్మాత్తుగా వస్తాయి. అక్కడ గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకుల వల్ల గుండెపోటు వస్తే... ఇక్కడ మెదడుకు చేరవేసే రక్తనాళాలు చిట్లడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెపోటుకు పొగాకు వాడకం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుల చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) రిస్క్ ఫ్యాక్టర్లు అయినట్లుగానే... దీనికీ పొగాకు, ఫ్యామిలీ హిస్టరీలు రిస్క్ ఫ్యాకర్లే. 
 
 మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు... 
 శరీర నిర్మాణానికి దోహదపడే కొన్ని ప్రోటీన్లకు సంబంధించిన జబ్బులు (ఉదాహరణకు ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్, మార్ఫన్స్ సిండ్రోమ్), కండరాల జబ్బు అయిన ఫైబ్రోమస్క్యులార్ డిస్‌ప్లేసియా, దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు, కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరివారికి అన్యురిజమ్స్ ఉండటం, కొకెయిన్ వంటి మాదకద్రవ్యాలు తీసుకునే దురలవాటు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండటం... అన్యురిజమ్‌కు రిస్క్‌ఫ్యాక్టర్లు. 
 
 ముందుగా కనిపెడితే కొంతలో కొంత మేలు... 
 అన్యురిజమ్స్ వల్ల వచ్చే ముప్పు చాలా ప్రమాదకరమైనదే అయినా దీన్ని ముందుగా కనిపెడితే ఎంతో కొంత మేలు చేకూరుతుంది. దీన్ని ఇప్పుడు ముందుగానే కనిపెట్టడానికి అవసరమైన వైద్యపరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి. సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాల తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా దీన్ని రేడియాలజిస్టులు కనుగొనవచ్చు. ఒకవేళ కుటుంబ చరిత్రలో అన్యురిజమ్స్ ఉన్నవారు ముందుగానే సీటీ స్కానింగ్ పరీక్ష ద్వారా అన్యురిజమ్ కండిషన్ ఉన్నట్లు తేలితే... దానికి తగినట్లుగా ముందుగానే శస్త్రచికిత్స చేసి, రక్తస్రావానికి అవకాశం ఉన్నచోట్ల శస్త్రచికిత్స నిర్వహించి, రక్తస్రావాన్ని నివారించి అన్యురిజమ్‌నుంచి రక్షణ పొందవచ్చు. ఒకవేళ సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలి... ఇలా అన్యురిజమ్స్ వచ్చేందుకు అవకాశం ఉన్నవారికి ముందుగానే సీటీ యాంజియో అనే పరీక్ష ద్వారా అన్యురిజమ్‌ను గుర్తిస్తే చేయాల్సిన వైద్యచికిత్సను ముందుగానే నిర్ణయించడం ద్వారా అకస్మాత్తుగా కలిగే  ప్రాణాపాయాలను చాలావరకు నివారించవచ్చు. 
 
 సెరిబ్రల్ యాంజియోగ్రామ్ ఇలా... 
 గుండెపోటు వచ్చిన వారిలో నిర్ధారణ కోసం చేసే యాంజియోగ్రామ్ పరీక్షలాగే మెదడు విషయంలోనూ యాంజియోగ్రామ్ చేస్తారు. ఇందులో న్యూరోఇంటర్వెన్షనల్ సర్జన్ ఒక ట్యూబ్ ద్వారా మెదడు రక్తనాళాల వరకు చేరి... అక్కడ ఒక రంగు పదార్థాన్ని మెదడులోని రక్తనాళాల్లో వదులుతారు. దాంతో ఆ రంగు పదార్థం రక్తనాళాల్లో ఉబ్బినట్లుగా ఉన్న ప్రాంతాలను (అన్యురిజమ్స్‌ను) ఫ్లోరోస్కోప్ అనే చిత్రాల సహాయంతో చూపుతుంది. వీటి ద్వారా అన్యురిజమ్స్ మెదడులోని ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి, వాటి పరిమాణం, ఆకృతి వంటి అనేక కీలకమైన అంశాలను తెలుసుకోగలుగుతారు. వాటి తీవ్రత ఆధారంగా అవసరమైన చికిత్సను డాక్టర్లు సూచిస్తారు.
 
 గ్లాస్‌గో కోమా స్కేల్‌పై తీవ్రత కొలతతో గ్రేడింగ్... 
 ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు దాని తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే  స్కేల్‌ను గ్లాస్‌గో కోమా స్కేల్‌గా అంటారు. ఇందులో ఒక్కోరకమైన స్పందనకు ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు పేషెంట్ కంటి కదలికలకూ, డాక్టర్ నోటిమాటగా ఇచ్చిన ఆదేశాలకు రోగి స్పందించే తీరుకూ, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ రోగి నుంచి స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అదే ఆదేశాలకు రోగి స్పందిస్తున్న కొద్దీ గ్లాస్‌గో కోమా స్కేల్‌పై స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది రోగి నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అన్నమాట. అదే స్కోర్ పెరిగి అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. ఈ స్కోర్‌ను బట్టి అన్యురిజమ్స్ కారణంగా సబర్కనాయిడ్ హామరేజ్ జరిగినప్పుడు రోగిలో దాని తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. (వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ ఆమోదించిన గ్రేడింగ్ ప్రక్రియ ఇది). అది ఈ కింది విధంగా ఉంటుంది. 
 
 హేమరేజ్ జరిగిన వారిలో గ్లాస్‌గో కోమా స్కేల్‌పై కొలతల గ్రేడ్‌ను బట్టి...
  స్కోరు 15 ఉంటే రోగి కోలుకోవడానికి పూర్తిగా అవకాశాలుంటాయి. 
  స్కోరు 3 ఉంటే రోగి కోలుకోడానికి అవకాశాలు ఉండవు. 
  స్కోరు 8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రోగి కోలుకోవడానికి మంచి అవకాశాలుంటాయి. స్కోరు 3 - 5 ఉంటే అది ప్రమాదకరమైన స్థితి.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement