ఏదైనా ప్రాణాంతకమైన జబ్బు వస్తే ప్రాణం పోతుంది.కాని ప్రాణం తీసుకోమని చెప్పే ప్రాణాంతకమైన జబ్బు వస్తే?సివియర్ డిప్రెషన్ ప్రాణాంతకం. ఎందుకంటే అది ఆత్మహత్యను ప్రేరేపిస్తుంది. ఆత్మహత్యలను ప్రేరేపించే ఆ తీవ్ర వ్యాకులతకు మందు ఉంది.డాక్టర్‌ను కలవండి. మందులు వాడండి. శత్రువులా మారిన మెదడును మిత్రుడిగా మార్చుకోండి.
‘వీడెప్పుడూ ఇలాగే ఉంటాడెందుకు?’ అంటుంది తల్లి.‘ఆ గడ్డం ఏంట్రా దరిద్రంగా’ అంటాడు తండ్రి.‘అన్నయ్యా... నువ్వెందుకు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటావ్?’ అంటుంది చెల్లెలు.అందరూ అతడితో అతడిపైనే ఫిర్యాదులే చేస్తారు.అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు.‘నువ్వు కావాలనే ఇలా ఉంటున్నావ్’ అంటుంది తల్లి.‘నాకంటూ ఏ ఆశా లేకుండా చేస్తున్నావేంట్రా’ అంటాడు తండ్రి.‘నా ఫ్రెండ్స్‌కు పరిచయం చేసే లెవల్‌లో కూడా ఉండవు నువ్వు’ అంటుంది చెల్లి.22 ఏళ్ల కుర్రాడు.అలా ఎందుకు ఉన్నాడు?‘డిప్రెషన్’ అంటాడు డాక్టర్.‘డిప్రెషన్ అయితే మాత్రం ఇలా ఉండొచ్చా... కావాలని కాకపోతే’ అంటారు కుటుంబ సభ్యులు.‘డిప్రెషన్ ఉంటే ఇలాగే ఉంటారు. అది లోపం కాదు. అలా ఉండటం తప్పూ కాదు. కొందరిలో మెదడులోని కెమికల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్‌తో వాళ్లు తమకు తాము అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ల ద్వారా ఆత్మహత్య లాంటి ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ తప్పు వారిది కాదు. వారిని అర్థం చేసుకోలేకపోయిన మనది. డిప్రెషన్‌ను అధిగమించడం చాలా సులభం. డాక్టర్‌ను కలిస్తే మందులు ఇస్తారు. డిప్రెషన్ చెప్పుకోవడానికి చిన్నది. కాని ఎదుర్కోడానికి పెద్దది కూడా’ అంటారు డాక్టర్లు. డిప్రెషన్ ఎవరికైనా వస్తుంది. అది ఎవరికైనా ఉందంటే చుట్టుపక్కలవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి.‘మై బ్రెయిన్ ఈజ్ మై ఎనిమీ’ అని రాసి ఇటీవల ఒక టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది.సివియర్ డిప్రెషన్ ఈ స్థాయికి మనిషిని ఈడుస్తుంది. దీని నుంచి మన ఆప్తులను బయటపడేయలేమా?
డిప్రెషన్‌కు కారణాలు
డిప్రెషన్‌కు అనేక అంశాలు దోహపడతాయి. అయితే స్థూలంగా వాటిని మూడుగా విభజించవచ్చు. అవి...
బయలాజికల్ కారణాలు: కొందరు వ్యక్తులు ఎంతైనా ఒత్తిడిని తట్టుకునేలా ఉంటారు. మరికొందరు వ్యక్తులు చిన్న చిన్న విషయాలకే అతిగా గాభరా పడతారు. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఇందుకు వాళ్ల జన్యువులే కారణం. జన్యుపరమైన లోపాలు ఉన్నవారిలో లోపభుయిష్టమైన ప్రోటీన్ల కారణంగా మెదడులో లోపభుయిష్టమైన సర్క్యూట్లు ఏర్పడతాయి. అంటే డిఫెక్టివ్ ప్రోటీన్లతో మెదడులోని కొన్ని రసాయనాలు, న్యూరల్ సర్క్యుట్స్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి వారిలో మెదడులోని రసాయనాలు... అందునా మరీ ముఖ్యంగా సెరిటోనిన్ అనే రసాయనం తక్కువగా స్రవిస్తుంది. దాంతో ప్రవర్తనల్లో మార్పులు
(బిహేవియరల్ ఛేంజెస్) వస్తాయి. డిప్రెషన్‌కు గురైనప్పుడు మెదడులోని కణాలకు, వాటి మధ్య నర్వ్ ఫైబర్స్‌కు ఉండే కనెక్షన్స్ తగ్గుతాయి. ఈ చర్యలు మెదడులోని హిప్పోక్యాంపస్, ఫ్రంటల్‌లోబ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి. ఫలితంగా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. ఇలా డిప్రెషన్‌కు గురైనవారు చిన్నపాటి ఒత్తిడికి లోనైనా వెంటనే ఆత్మహత్య గురించి ఆలోచిస్తుంటారు. ఇలాంటి జన్యుపరమైన కారణాలతో ఉన్నవారిలో త్వరితంగా డిప్రెషన్‌కు గురయ్యే ఆరోగ్య చరిత్ర అనువంశీకంగా కనిపిస్తుంది. అందుకే ఆత్మహత్యలతో కూడిన కుటుంబ చరిత్ర ఉన్నవారి కుటుంబ సభ్యులలో ఆత్మహత్యలు ఒకింత ఎక్కువగా ఉంటాయి.
సామాజిక కారణాలు : బయలాజికల్ కారణాలకు... సామాజిక కారణాలూ తోడైతే వ్యక్తులు మరింతగా కుంగుబాటుకు లోనవుతారు. వారిలో చాలా తేలిగ్గా ఆత్మహత్యాధోరణులు (సూసైడల్ టెండెన్సీస్) కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... అప్పటికే లోపభుయిష్టమైన న్యూరల్ సర్క్యూట్స్ ఉన్న ఆ వ్యక్తి... ఒక రైతు లేదా ఒక చేనేత కార్మికుడు అనుకుందాం. వాళ్లది తరతరాలుగా ఆత్మాభిమానంతో బతికే కుటుంబం. ఎన్ని కష్టాలు ఎదురైనా నలుగురిలో బట్టబయలు కాకుండా గుట్టుగా, గౌరవంగా బతికే కుటుంబం అనే సామాజిక అంశం... ఆ తర్వాత ఏర్పడిన ఆర్థికపరంగా తీవ్రంగా దెబ్బతినడమనే పరిస్థితిని ఏర్పరచి తట్టుకోలేనంతగా దెబ్బ తీస్తుంది. దాంతో వారు తేలిగ్గా ఆత్మహత్యలకు మొగ్గుచూపుతారు. ఇందుకే ఇలాంటి ఆత్మహత్యలు మన సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
సైకలాజికల్ కారణాలు : కొందరిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల మానసిక స్థైర్యం స్వతహాగానే ఉంటుంది. వారు తమ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి లాజికల్‌గా ఆలోచిస్తారు. కొన్ని చర్యలకు ఉపక్రమిస్తారు. ఇలాంటి సైకలాజికల్ కండిషన్ ఉన్నవారికి తట్టుకునే తత్వం, సమస్యను ఎదుర్కొనే నైపుణ్యాలు (కోపింగ్ స్కిల్స్) ఎక్కువ. వీరు అంత తేలిగ్గా ఒత్తిళ్లకు లొంగరు. అయితే ఇక్కడ పేర్కొన్న మూడు రకాల అంశాలూ... ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అంటే సైకలాజికల్, బయలాజికల్, సామాజిక విభాగాలు ఓవర్ ల్యాపింగ్‌గా ఉంటాయి. ఎదుర్కొనే తత్వం, అధిగమించే మనస్తత్వం, నేర్పూ (కోపింగ్ స్కిల్స్) ఉన్నవారి మెదడులో సెరిటోనిన్ రసాయనం ఎక్కవగా స్రవిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక విషయం తేటతెల్లమైంది. అదేమిటంటే... ఒకప్పుడు దిగులుతో ఉన్నవారిని చూసి ‘మనోవ్యాధికి మందే లేద’నే సామెత చెప్పేవారు. కానీ... మెదడులోని రసాయనాల సమతుల్యతలో మార్పులు తెచ్చి, స్వభావాన్ని మార్చగలనే అంశం నిరూపితమైన తర్వాత ‘డిప్రెషన్’ను మందులతో తగ్గించవచ్చని తేలింది. అంతేకాదు... ఆత్మహత్యకు దారితీసే సివియర్ డిప్రెషన్‌ను ఎలక్ట్రిక్ షాక్ చికిత్సతో చాలా తేలిగ్గా తగ్గించవచ్చు. పైగా ఆ తర్వాత వారు చురుగ్గా, జీవనోత్సాహంతో ఉంటారు. అందరూ అనుకున్నట్లుగా, అపోహపడుతున్నట్లుగా కరెంట్ షాక్ చికిత్సలో షాక్ వల్ల బాధ వంటివి అస్సలే ఉండవు.
డిప్రెషన్ అవకాశాలు వీరిలో ఎక్కువ
∙విడాకులు తీసుకున్నవారు ∙ఒంటరిగా జీవనం సాగిస్తున్నవారు ∙కుటుంబ సభ్యుల్లో లేదా కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు ∙చిన్నతనంలోనే తల్లి/తండ్రిని కోల్పోయినవారు ∙తీవ్రమైన ఒత్తిడికి గురైనవారు ∙సమాజం నుంచి సహకారం (సోషల్ సపోర్ట్) లేనివారు ∙తమకు అత్యంత ప్రియమైనవారు దూరం కావడం లేదా చనిపోవడం ∙ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం వంటి అంశాలు డిప్రెషన్‌కు కారణమవుతాయి ∙ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు లోనుకావడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటి వారు తమలోని నిరాశ, నిస్పృహ, కుంగుబాటు లక్షణాలను గమనిస్తే... తప్పక డాక్టర్‌ను కలవాలి. తాము మళ్లీ తమ జీవితాన్ని ప్రేమించేలా మారాలి. అది వ్యక్తిగతంగా వారు... తమకు తాము చేసుకోగల సాయం. ఇక ఇలాంటి వారిని గుర్తించినప్పుడు దగ్గరివారు, బంధువులు, స్నేహితులు... వారిని తప్పక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఎందుకంటే... తీవ్రమైన (సివియర్) డిప్రెషన్‌కు లోనైన వారిలో దాదాపు 15% మంది ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది. డిప్రెషన్‌లో ఉన్నవారు ఆత్మహత్య గురించి మాట్లాడుతుంటే తేలిగ్గా తీసుకోకండి. వెంటనే రోగిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి.
డిప్రెషన్ చికిత్స :
డిప్రెషన్‌కు గురైనవారి మెదడులోని సెరిటోనిన్ వంటి రసాయనాల సమతౌల్యత దెబ్బతిని ఆ రుగ్మతకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయన్నది తెలిసిందే. అందుకే ఆ సమతౌల్యతను ఏర్పరిచే మందులు, సైకోథెరపీ వంటి ప్రక్రియలతో సివియర్ డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి. మందులతో పాటు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీగా పేర్కొన షాక్ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది.
డిప్రెషన్ అంటే :
తీవ్రమైన నిరాశ నిస్పృహలతో తన గురించి, తన పొరుగువాళ్ల గురించీ, తన భవిష్యత్తు గురించి అంతా ప్రతికూలంగానే అనుకోవడం. అంతా చెడే జరుగుతుందని భావించడం. తన జీవితమూ, భవిష్యత్తూ ఎప్పటికీ బాగుపడవనే భావన బాగా బలపడిపోవడం. ఆ నెగెటివ్ ఆలోచనలతో మనసూ, మనిషీ పూర్తిగా కుంగిపోవడం. తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను మూడు విభాగాలుగా పేర్కొన్నవచ్చు. సాధారణ నిరాశ, నిస్పృహలు ఉండే డిప్రెషన్‌ను మైల్డ్‌గా పేర్కొంటారు. దీనికంటే ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న స్థాయిని మాడరేట్‌గా చెప్పవచ్చు. ఇక దీన్ని మించిన స్థాయితో అత్యంత తీవ్రమైన నిరాశ నిస్పృహలతో కుంగిపోయే వారిని సివియర్ కేటగిరీకి చెందినవారిగా చెప్పవచ్చు. ఇక తీవ్రస్థాయి (సివియర్) డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం చాలా సాధారణం. అది రోగి తప్పు కాదు. వ్యాధి కారణంగా కలిగే నిస్పృహపూర్వక భావన. అందుకే ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రయత్నించే వారిని మందలించే బదులు వారికి తగిన చికిత్స చేయించడం అవసరం. డిప్రెషన్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ కాబట్టి... దాన్ని నివారించడం కోసం ఉద్దేశించిందే సివియర్ డిప్రెషన్‌పై ఈ ప్రత్యేక కథనం.
మేం జయించాం... మీరూ జయించగలరు!
డిప్రెషన్ ఎవరిలోనైనా చాలా సహజం... సాధారణం. ఫలానావారు సెలిబ్రిటీలు కదా... వాళ్లకు నిరాశా నిస్పృహలు ఏముంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అది సరికాదు. సెలిబ్రిటీలూ, ప్రఖ్యాతి చెందిన ఎంతో మంది రాజనీతిజ్ఞులు, రచయితలు, మరెందరో ప్రముఖులు డిప్రెషన్ బారిన పడ్డారు. అయితే వారు సివియర్ డిప్రెషన్ బారిన పడ్డ కొందరిలా ఆత్మహత్యకు పాల్పడలేదు. తమ కష్టాన్ని తామే అధిగమించారు. మందులు వాడారు. డిప్రెషన్ నుంచి బయటపడి మళ్లీ తమ కెరియర్‌ను కొనసాగించవచ్చని లోకానికి చాటారు. వారిలో దీపికా పదుకొనె చాలా ధైర్యంగా తన కష్టాన్ని లోకానికి చాటిచెప్పి ఎందరికో ఒక ఆశాదీపంలా నిలిచారు. ఆమెతో పాటు డిప్రెషన్ బారినపడ్డ మరికొంతమంది ప్రముఖులు వీళ్లు...
దీపికా పదుకొనె: తన వ్యాధి గురించి అన్న మాటలివి...
‘‘నిజంగా ఆ ఏడాది నాకు చాలా విజయవంతంగా ఉంది. ఎన్నో అవార్డులు కూడా సాధించాను. అయినా ఎందుకో సివియర్ డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఒకరోజు నిద్రలేచిన మొదలు... పొద్దుణ్ణుంచీ అలా ఏడుస్తూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవారు నా గురించి ఆలోచించారు. చేయూత అందించారు. వాళ్లందరి సహకారంతో విషాదాన్ని చెరిపేసి, జీవితాన్ని మళ్లీ కౌగిలించుకున్నాను. కొత్తగా మలచుకున్నాను.’’
షారూఖ్ ఖాన్:
‘‘నా కుడిభుజానికి గాయం అయ్యింది. దానికి సర్జరీ అయ్యింది. అది పనిచేయన్నప్పుడే నాకు దాని విలువ తెలిసింది. జననానుడిలో ‘కుడిభుజం’ అనే వాడుకకు ఉన్న ప్రాచుర్యం ఎందుకో అర్థమైంది. అది పనిచేయని సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌లోకి జారిపోయా. కానీ అధిగమించగలిగా. భుజానికి కొత్త బలం సమకూరింది. కొత్త సామర్థ్యం పుంజుకున్నా. అలా డిప్రెషన్ నుంచి బయటపడ్డా’’ అంటారు షారూఖ్ ఖాన్.
అనుష్కా శర్మ :
‘‘నా స్ట్రెస్, యాంగై్జటీలను త్వరగా వదిలించుకోవాలి. నా కుటుంబంలోనూ ఇలా యాంగై్జటీకి గురై చికిత్స తీసుకున్నవారు కొంతమంది ఉన్నారు. వారిలాగే ప్రపంచంలోనూ చాలామంది ఉండే ఉంటారు. అవును... డిప్రెషన్‌లోకి వెళ్తే ఏమిటి? కడుపునొప్పి, తలనొప్పి లాగే ఇదీ ఒక సమస్య. చాలా సాధారణమైన సమస్య. లాజికల్‌గా ఆలోచిస్తే దీని నుంచి బయటకు రావచ్చు. అలాగే బయటపడతా. అందరూ నాలాగే బయటపడవచ్చని అందరికీ చెబుతా’’ అని అప్పట్లో తన సందేశన్నిచ్చారు అనుష్కా శర్మ.
పైన పేర్కొన్న వీళ్లు మాత్రమే కాదు... బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, హాలివుడ్ నటీనటుల్లో ప్రముఖులైన హరిసన్‌ఫోర్డ్, యాంజిలినా జోలీ, బ్రూక్‌షీల్డ్స్, ‘హారీపోటర్’ రచయిత్రి జె.కె. రౌలింగ్, అమెరికా అధ్యక్షులలో అత్యంత ప్రజాదరణ కలిగిన మానవీయ వ్యక్తి అబ్రహం లింకన్ వంటి వాళ్లంతా డిప్రెషన్ బారినపడి... మళ్లీ కోలుకొని తమ కెరియర్‌ను విజయవంతంగా మలచుకున్నవాళ్లే.
డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై
ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఓడి
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకియాట్రీ కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment