పచ్చబంగారు లోకం... మాకు కావాలి సొంతం... | Paccabangaru want us to win the world ... ... | Sakshi
Sakshi News home page

పచ్చబంగారు లోకం... మాకు కావాలి సొంతం...

Published Thu, May 1 2014 10:45 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పచ్చబంగారు లోకం... మాకు కావాలి సొంతం... - Sakshi

పచ్చబంగారు లోకం... మాకు కావాలి సొంతం...

చూసొద్దాం!
 
 ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న గిరులు... అబ్బురపరిచే లోయలు.. వీనుల విందుచేసే జలపాతాల గలగలలు.. మేనిని తాకే చల్లని గాలులు.. వేసవి విహారంలో పచ్చబంగారు లోకాన్ని చుట్టివచ్చేవారికి కనుల పండగ చేస్తుంది కూనూరు.
 
‘క్వీన్ ఆఫ్ హిల్స్’ అని అప్పట్లో ఆంగ్లేయులు ముద్దుగా పిలుచుకునే నీలగిరి పర్వత శ్రేణులవి. వేసవి రాగానే పర్యాటకుల మదిలో తొంగిచూసే ప్రాంతం అది. పేరు కూనూరు. పచ్చని దుప్పటి కప్పుకున్న కొండలు, లోయలను చూస్తూ జలపాతం గలగలలు వింటూ ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి ఆనందంగా విహరించాలంటే ఎంచుకోదగిన హిల్‌స్టేషన్ కూనూరు. తేయాకు పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.
 
ఉదకమండలంగా పేరుగాంచిన ఊటి పచ్చదనం గురించి వినే ఉంటారు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతం కోయంబత్తూరు నుంచి 80 కి.మీ దూరంలో ఉంది. ఊటీ నుంచి 18 కి.మీ.దూరంలో ఉంది కూనూరు.
 
కూనూరులో చూడదగినవి:

సిమ్స్ పార్క్: కూనూరులో తప్పక చూడదగినది సిమ్స్ పార్క్. ఇందులో 1,000 రకాల వృక్షజాతులు ఉన్నాయి. ఇక్కడి బొటానికల్ గార్డెన్‌ను పూర్తిగా జపాన్ స్టైల్‌లో అభివృద్ధి పరిచారు. ఇక్కడే ఏనుగు కాలును పోలిన చెట్టును చూడవచ్చు. ముగ్గురు మనుషులు వలయాకారంగా నిలబడితే ఉండేంత లావు ఉంటుందీ చెట్టు.
 
పొమలాజికల్ స్టేషన్: రాష్ట్ర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఇది. దీనిలో దానిమ్మ, ఆప్రికాట్ తోటల పెంపకంపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి.
 
డాల్ఫిన్ నోస్: కూనూరుకు 10 కి.మీ దూరంలో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గర నిలబడితే నీలగిరి పర్వతశ్రేణుల అందచందాలను, జలపాతాల సొగసును కనులారా వీక్షించవచ్చు.
 
లంబాస్ రాక్: కూనూరుకు అయిదున్నర కి.మీ దూరంలో లంబాస్ రాక్ మరొక వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తే కాఫీ, తేయాకు తోటల పచ్చదనం అద్భుతంగా కనువిందు చేస్తుంటుంది.
 
డ్రూగ్ ఫోర్ట్:
కూనూరుకు 13 కి.మీ దూరంలో ఉంది డ్రూగ్ కోట. 18వ శతాబ్దంలో టిప్పుసుల్తాన్ కాలం నాటి ఈ కోట శిథిలాలు నేటికీ చూడవచ్చు.
 
పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్: పర్యాటకులు అనుమతి తీసుకొని ఈ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించవచ్చు. కుక్కకాటు కారణంగా వచ్చే రేబిస్‌కి వ్యాక్సినేషన్‌ను శాస్త్రవేత్తలు ఇక్కడే అభివృద్ధి పరిచారు.
 
జలపాతాల సొగసు: కూనూరుకు 5 కి.మీ దూరంలో మెట్టుపాలయం వెళ్లే దారిలో కటరి, లాస్ జలపాతాలు ఉన్నాయి.
     
ఇదే ప్రాంతంలోనే ఉన్న సరస్సులో బోటు షికారు చేయవచ్చు. రకరకాల పువ్వుల అందాలను వీక్షించవచ్చు.
     
ఊటీ నుంచి కూనూరుకు వెళ్లటానికి ఒక రైలు బండి ఉంటుంది. ఆంగ్లేయుల కాలంలో వేసిన పట్టాల మీద అంతే పాతదయిన రైలు తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం పర్యాటకుల కోసమే తిరిగే రైలు. మెల్లగా ఒక మనిషి పరిగెత్తేటంత వేగంతో వెళ్తూ 20 కి.మీ దూరాన్ని 2 గంటలలో తీసుకువెళుతుంది. అలా మెల్లగా తీసుకుని వెళ్లటం వలన దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలను తాపీగా హ్యాపీగా ఆస్వాదించవచ్చు. మధ్యలో రెండు సొరంగమార్గాలు, ఇరువైపులా అందమైన లోయలలో ప్రయాణిస్తున్నంతసేపు మంచి అనుభూతిని పొందవచ్చు.
     
చుట్టుపక్కల చూడదగినవి:
ఊటీలో ఉన్న రోజ్ గార్డెన్‌లో  ఎన్నెన్నో రంగురంగుల గులాబీలు. నలుపు, ఆకుపచ్చ, 2-3 రంగులు కలగలిసిన గులాబీలు మరెన్నో.. పిల్లలు ఆడుకోవడానికి చక్కని ప్లేస్ ఇది. వేసవిలో కూడా ఇక్కడ వర్షం పడుతుండటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. డాల్ఫిన్ నోస్, ఊటీ లేక్, బోట్ హౌస్, బొటానికల్ గార్డెన్, దొడ్డబెట్ట..లను తిలకించాక బోట్ రైడింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు. దొడ్డబెట్టకు దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన శిఖరంగా పేరున్నది. ఇక్కడ మేఘాలు తరచుగా కలుస్తూ విశ్రాంతి తీసుకుంటాయా అనిపిస్తుంది. ఇక్కడ తమిళనాడు పర్యాటకశాఖ టెలీస్కోప్‌లు ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి టెలీస్కోప్‌ల ద్వారా చూస్తే కొండలు, లోయలు, ఆకుపచ్చ తివాచీ పరిచినట్టు ఉండే అటవీ ప్రాంతం అందంగా కనిపిస్తుంది.
 
కూనూరు వెళ్లాలంటే...
కోయంబత్తూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి కూనూరు 56 కి.మీ.
     
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజూ తొమ్మిది గంటలకు మెట్టుపాలయం రైలు బయల్దేరుతుంది. ఆ రైలు మరుసటి రోజు ఉదయం ఆరుంబావుకి మెట్టుపాలయం చేరుతుంది.
     
మెట్టుపాలయం నుంచి 28 కి.మీ దూరంలో ఉన్న కూనూరుకు ఊటీ మీదుగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఘాట్‌రోడ్డులో బస్సు మలుపులు తిరుగుతూ కొండలపైకి ఎక్కడం ప్రారంభించాక... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన ప్రదేశం ఇది అనుకుంటా రు. పొడవాటి పైన్ వృక్షాలతో అలరారే ఈ పచ్చ బం గారు లోకం నిలువెల్లా అద్భుత దృశ్యకావ్యం. నవదంప తులు నుంచి వయోవృద్ధుల వరకు అంతా ఇష్టపడే ప్రాంతం ఇది.  ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement