మీ మాయలోడిని నేనే.. టోనీ
అంతర్జాతీయ మెజీషియన్: ఆయన గానీ.. ఒక ఈల గానీ వేశాడంటే.. ఉన్నవి అమాంతంగా మాయమైపోతాయి. లేనివి మన ముందుకొచ్చేస్తాయి. అబ్రకదద్ర అంటూ కళ్లు మూసి తెరిచే లోగా మాయాజాలం చేసేస్తాడు. మంత్రదండంతో మతులు పోగొడతాడు. మాయాజాలంతో జనాలను కట్టిపడేస్తాడు..
మహేంద్రజాలికుడు టోని హ స్సిని. టర్కీలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ఈయన ‘ఛూ.. మంతర్’ పేరుతో జరుగుతున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సమ్మేళనం-2014 కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేజిక్ మస్తీ చేస్తున్న టోనీ మహేంద్రజాలం కథాకమామీషు ఆయన మాటల్లోనే..
నాకప్పుడు 16 ఏళ్లుంటాయి. ఉద్యోగాల వేటలో ఉండగా.. లండన్‌లో మెజీషియన్ వస్తువులు అమ్మే దుకాణంలో కొలువు కుదిరింది. అక్కడే మేజిక్ అంటే ఏంటో తెలిసింది. ఆసక్తి పెరగటంతో ఇంద్రజాలం నేర్చుకున్నాను. నాలుగేళ్ల తర్వాత అమెరికా వె ళ్లాను. కొన్నేళ్లు సాధన చేశాను. నమ్మకం కలిగిన తర్వాత ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాను. పలు దేశాల్లో 20 వేల వరకు ప్రదర్శనలిచ్చాను.
కాస్ట్‌లీ కళ..
నా అనుభవంలో తెలిసిందేమిటంటే.. మేజిక్ డబ్బుతో ముడిపడి ఉన్న కళ. ఇందులో వాడే పరిక రాల ధర ఎక్కువగా ఉంటుంది. అవి కొనగలిగినపుడే మేజిక్‌లో అద్భుతాలు సృష్టించగలం. అలాగే వివిధ బుక్స్ చదవాలి. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి. థీమ్ అనుకుని దానికి తగ్గట్టుగా పరికరాలు సమకూర్చుకోవాలి. నిరంతరం సాధన చేస్తేనే మంచి మెజీషియన్‌గా నిలబడగలుగుతారు.
పిల్లలను మేజిక్ వైపు మళ్లించాలి
తల్లిదండ్రులు తమ పిల్లలను మేజిక్ వైపు ప్రోత్సహించాలి. అయితే మంచి మెజీషియన్ అవుతాడు. లేదంటే స్టడీస్‌లో బాగా రాణించగలుగుతాడు. అమెరికాలో మెజిక్ కోసం ప్రయివేట్‌గా స్కూల్స్, అకాడెమీలు నడుస్తున్నాయి. భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మేజిక్ కోర్సును ప్రవేశపెట్టారు.
ఆస్కార అవార్డంత గొప్పది
సినీ పరిశ్రమకు ఆస్కార్ ఎంత గొప్పో.. మెర్లిన్ అవార్డు మెజీషియన్లకు అంతకన్నా గొప్పది. గ్రేట్ మెజీషియన్‌గా పేరొందిన మెర్లిన్ పేరుతో 1968లో ఈ అవార్డు నెలకొల్పాం. ఇరవై ఏళ్ల కిందట పీసీ సర్కార్‌కు ఇచ్చాం. ఈసారి హైదరాబాద్‌కు చెందిన సామల వేణుకు దీన్ని ప్రదానం చేయబోతున్నాం.
ఛూ..మంతర్
సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ తొలిసారిగా అంతర్జాతీయ మెజీషియన్ల సమ్మేళనానికి వేదిక కాబోతోంది. 13 దేశాలకు చెందిన 600 మంది మెజీషియన్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఈ నెల 20(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు షో మొదలవుతుంది. హాజరవ్వాలనుకునేవారు 9014663413 నంబర్‌ను సంప్రదించవచ్చు.
- కోన సుధాకర్‌రెడ్డి., ఫొటో: సతీష్