వ్యక్తిగతం: అలా చేయడం మంచిది కాదు! | question time for personal issues | Sakshi
Sakshi News home page

వ్యక్తిగతం: అలా చేయడం మంచిది కాదు!

Published Sun, Mar 9 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

వ్యక్తిగతం:  అలా చేయడం మంచిది కాదు!

వ్యక్తిగతం: అలా చేయడం మంచిది కాదు!

 సమస్య గురించి
  అదే పనిగా అలోచిస్తుంటే... ఆలోచన ఔషధమైపోదు.
 ప్రతి సమస్యకూ తప్పకుండా పరిష్కారం ఉంటుందని మరచిపోకండి.
 
 నా వయసు 42 ఏళ్లు. కొన్ని నెలల కిందట వరిబీజం వస్తే, నాకు తెలిసిన ఆర్‌ఎంపీ సిరంజీతో వృషణాల్లో నీరు తీసేశాడు. ఇప్పుడు మళ్లీ అక్కడ వాపుగా ఉంది. తగు సలహా ఇవ్వగలరు.
 - ఎం.ఎస్., శ్రీకాకుళం జిల్లా

 
 వృషణాల చుట్టూ నీరు చేరితే దాన్ని హైడ్రోసిల్ అంటారు. ఈ సవుస్య వచ్చినప్పుడు వైద్యుడు శస్త్రచికిత్స చేసి అక్కడి నీటిని తొలగిస్తాడు. అలాగే, నీరు మాటిమాటికీ వచ్చే సంబంధిత పొరను తీసి దాన్ని వెనక్కి మడతపెట్టడం కూడా చేస్తాడు. మీరు చేయించుకున్నట్టుగా సిరంజీతో నీటిని తీసేస్తే తాత్కాలికంగానే ఫలితం ఉంటుంది. అప్పటికి వృషణాల పరిమాణం తగ్గినట్టు అనిపించినా, మళ్లీ నీరు చేరుతుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి సిరంజీ విధానం ఎంతమాత్రమూ సురక్షితం కాదు. వరిబీజానికి చేసే ఆపరేషన్ చాలా చిన్నది. భయపడకుండా వెంటనే చేయించుకోండి.
 
 నాకు అరవై ఏళ్ల వయసు. రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలేమీ లేవు. ఇప్పటికీ మా లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉంది. కాకపోతే ఇటీవల రాత్రి పూట మూత్రం ఎక్కువగా వస్తోంది. డాక్టర్‌ని కలిస్తే ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందన్నారు. శృంగారానికీ దీనికీ ఏమైనా సంబంధం ఉందా? దీనికి వయసు పరమైన హద్దులు ఏమైనా ఉంటాయా?
 - కె.ఎస్.కె., హైదరాబాద్

 
 శృంగారానికి ఎలాంటి వయోపరిమితీ లేదు. మీరు ఇప్పటికీ సంభోగించగలగడం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ప్రోస్టేట్ గ్రంధి పెరగడానికి, శృంగారానికీ ఎటువంటి సంబంధమూ లేదు. జన్యుపరంగా కొందరిలో ఈ గ్రంథి వయసు పైబడిన వారిలో పెరిగి, మూత్ర సమస్యలు వస్తూంటాయి. దానికి ఎక్కువమందికి మందులతోనే నయం చేయవచ్చు. మూత్రం అసలు రానివాళ్లకు ఆపరేషన్ లేకుండానే ప్రోస్టేట్ గ్రంధిని లేజర్‌తో తొలగించినా,  శృంగారపరమైన ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే వీర్యం తక్కువగా వస్తుంది. ఇది మినహా సమస్యేమీ ఉండదు. కాబట్టి, మీ అపోహలన్నీ వదిలేసుకుని మీ లైంగిక జీవితాన్ని ఆనందించండి. ప్రోస్టేట్ విషయంలో మాత్రం యూరాలజిస్టు దగ్గర చికిత్స తీసుకోండి.
 
 నాకు వివాహమై పదేళ్లు దాటింది. శృంగారం తర్వాత ఒకటే నీరసంగా ఉంటోంది. సంభోగానికీ సంభోగానికీ మధ్య గ్యాప్ కూడా బాగా పెరుగుతోంది. ఇంతకుముందు రోజుకు ఒక్కసారి పాల్గొనేది, ఇప్పుడు వారానికి రెండుసార్లు కూడా పాల్గొనడం లేదు. నాకు మధుమేహం ఉందని ఇటీవలే తెలిసింది. దానివల్లే ఇలా జరుగుతోందా?
 - బి.బి.కె., హైదరాబాద్

 
 శృంగారపరమైన కోరికలు సాధారణంగా 20- 30 ఏళ్ల మధ్య ఎక్కువగా ఉంటాయి. పెళ్లయి పదేళ్లు అవుతోంది కాబట్టి, మునుపటి ఉత్సాహం ఉండకపోవడం సహజమే. మధుమేహం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట అదేపనిగా కూర్చుని పనిచేసేవాళ్లలో లైంగిక సామర్థ్యం కొంచెం తగ్గుతుంది. అలాగే వయసుతో పాటు వచ్చే బాధ్యతలు, మానసిక ఇబ్బందులు కూడా లైంగిక జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. దీనికి కొన్నిసార్లు కౌన్సిలింగ్‌గానీ, మరికొన్నిసార్లు మందులుగానీ అవసరం అవుతాయి. మధుమేహాన్ని నియంత్రించుకోండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడం ద్వారా మీరు మునుపటి శృంగార జీవితాన్ని పొందగలరు.
 
 మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.
vyaktigatam.sakshi@gmail.com
 
 డా. వి.చంద్రమోహన్,
 యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ -
 కిడ్నీ హాస్పిటల్,
 కెపిహెచ్‌బి, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement