పలకరింపే పులకరింపై....
‘రమ్మని నిను పిలవాలా... వీలేదో కుదరాలా... అమ్మనే మరిచే పనులేలా... కమ్మని పండుగ వేళ... నలుగురితో కలిసేలా.... నిన్ను ఇంకెవరో దిద్దాలా...’దీన్ని ఆధారంగా చేసుకుని చక్కని పాట తయారయింది. సినిమా కథ అంతా ఈ వాక్యాలలో వచ్చింది.
శతమానం భవతి చిత్రంలోని ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా’ పాటకు మంచి ప్రశంసలు అందుకున్నాను. డైరెక్టరు వేగేశ్న, నేను పాటలలోని భావం గురించి చర్చిస్తుండేవాళ్లం. ఆయనతో కలిసి ‘శతమానం భవతి’ చిత్రానికి పనిచేయమన్నారు. అలా ఆ చిత్రంలో పాట రాసే అవకాశం వచ్చింది. ‘చాలారోజుల తర్వాత మన పల్లెకు వెళుతున్నప్పుడు మనసులోని ఆలోచన, అనుభూతి ఎలా ఉంటాయనేది సందర్భం. మనలోనే కాదు మనం వస్తున్నందుకు మన పల్లె ఎలా అనుభూతి చెందుతుందో కూడా ఈ పాటలో పొందుపరచాలి.
పాట వినగానే అందరికీ పల్లెకు వెళ్లాలనే కోరిక కలగాలి’ అని చెప్పారు. విదేశాల్లో ఉన్న పిల్లలు తెల్లవారితే వస్తారనగా, అన్ని సంవత్సరాలుగా నిరీక్షించిన తల్లి, ఆ ఒక్కరాత్రి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని తొందరపడుతుంటుంది. ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా... వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా...’ అంటూ ప్రారంభించాను.
చేదతో బావులలో గలగల... చెరువులో బాతుల ఈతల కళ... / చేదుగా ఉన్న వేపను నమిలే వేళ / చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో/ మాటలే కలిపేస్తూ...మనసారా మమతల్ని పండించు అందించు హృదయంలా/ చలిమంటలు ఆరేలా... గుడిగంటలు మోగేలా... సుప్రభాతాలే వినవేలా... / గువ్వలు వచ్చే వేళ... నవ్వులు తెచ్చే వేళ... స్వాగతాలవిగో కనవేలా...
పల్లెల్లో తెల్లవారుజామున కనువిందు చేసే మధురానుభూతులు జీవితాంతం నిలిచిపోతాయి. అటువంటి భావాలను పల్లవిలో చూపించాను. చేదల సహాయంతో బావులలో నీళ్లు తోడటం, పక్కనే ఉన్న చెరువులో బాతులన్నీ ఈత కొడుతూ కళకళలాడుతూ కనిపించడం...ఇటువంటి అనుభూతులన్నీ పల్లెల్లో మాత్రమే కనిపిస్తాయి.
పక్షులు ఉదయాన్నే గూటి నుంచి బయలుదేరుతాయి. సాయంత్రానికి గూటికి చేరుతాయి. కాని ‘గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ... స్వాగతాలవిగో కనవేలా...’ అంటూ పక్షులు వస్తున్నట్లు రాశాను. ఎక్కడికో ఎగిరిపోయిన గువ్వలు అనే కొడుకులు, కూతుళ్లు చాలా కాలం తరువాత వస్తున్నారు కనుక, గువ్వలు వచ్చేవేళ , అనే ప్రయోగం చేశాను.
చాలా కాలం తరువాత వస్తున్న కూతురికి, తను మర్చిపోయిన ప్రదేశాలను గుర్తు చేయాలి. అది సాధారణంగా ఉంటుంది. ఈవిడకు గుర్తు వచ్చింది అని చెప్పడం కంటే, ఆవిడను ఆ గ్రామం తలచుకుంటోంది అనే భావనలో చెప్పాలి అనుకున్నాను.
పొలమారే పొలమంతా... ఎన్నాళ్లో నువు తలచి/ కళమారే ఊరంతా ... ఎన్నేళ్లో నువ్వు విడిచి /మొదట అందని దేవుడి గంట... మొదటి బహుమతి పొందిన పాట / తాయిలాలకు తహతహలాడిన పసితనమే గురుతొస్తోందా/ ఇంతకన్నా తీయనైన జ్ఞాపకాలే... దాచగల ఋజువులు ఎన్నో ఈ నిలయాన / నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాలా... నువ్వెదిగిన ఎత్తే కన బడక / నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా... తన్నెవరూ వెతికే వీల్లేక / కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే... సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్లే...
అంటూ... ఆమెను తలచుకుంటున్న పొలానికే పొలమారింది అని చమత్కరించాను. బాల్యంలో తాను చూసినవన్నీ మారిపోయాయి. తను ఆడుకున్నవి, ఆప్యాయంగా ఆడి వదిలేసినవన్నీ గుర్తు వస్తాయి. తాను ఊగిన ఊయల తను ఎంత ఎత్తు ఎదిగిందో చూడాలనే ఉద్దేశంతో ఒంటరిగా ఊగుతోందని... చెప్పాను.
ఇక తరవాత వచ్చేది మనవరాలు... హీరోయిన్... ఆమెను పరిచయం చేయాలి...
అది కూడా హృద్యంగా సాగాలి. పల్లెటూరి అందాలు అనే చిన్న భాషలో మాట్లాడితే ఎవ్వరికైనా అర్థం అవుతుంది. అందం మాట్లాడే భాష అర్థం కాని వారు ఉండరు. మనసుతో చూస్తే అన్నీ మనతో మాట్లాడతాయి. అంటూ...
పూల చెట్టుకి ఉందో భాష... అలల మెట్టుకి ఉందో భాష... / అర్థమవ్వని వాళ్లే లేరే అందం మాటాడే భాష/ పలకరింపే పులకరింపై పిలుపునిస్తే / పరవశించడమే మనసుకు తెలిసిన భాష / మమతలు పంచే ఊరు... ఏమిటి దానికి పేరు... పల్లెటూరేగా ఇంకెవరూ / ప్రేమలు పుట్టిన ఊరు... అనురాగానికి పేరు ... కాదనేవారే లేరెవరూ
మన అమ్మ సిటీలో ఉండవచ్చు, కాని అమ్మ వండే వంట పల్లెటూరిదే. నాన్న నగరంలో ఉద్యోగం చేస్తుండచ్చు, కాని నాన్న తాలూకు పెంకుటింటి భావాలు పల్లెటూరు నుంచి వచ్చినవే. వాళ్ల ద్వారానే ప్రేమలు, ఆప్యాయతలు, మమతలు వస్తాయి. ఎన్ని తరాలైనా స్వచ్ఛమైన మమతను రుచి చూడాలంటే పల్లెటూరికి వెళ్లి తీరాల్సిందే.
– సంభాషణ: డా. వైజయంతి