అమిత్‌షా ‘మ్యాజిక్’ చేస్తారా?
నేడు వరంగల్ సభలో పాల్గొననున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాదిలో విస్తరణే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందుకోసం తెలంగాణను వేదికగా నిర్దేశించుకుంది. ఇక్కడ పార్టీకి కొంత పట్టున్నా ఆ స్థాయికి తగినట్లుగా సీట్లు గెలుచుకోకపోవడంతో.. అసలు సమస్య ఎక్కడుందనే దానిపై దృష్టి సారిం చింది. ఇక ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 (హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు) వరకు బీజేపీ తిరంగా యాత్రను చేపట్టింది. దీని ముగింపు సందర్భంగా శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో 2.30 గంటల సమయంలో బస్సుస్టాప్ వద్ద నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటుతారు. అనంతరం వరంగల్‌కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అక్కడే బసచేస్తారు. ఆదివారం ఉదయం ఢిల్లీకి తిరుగు పయన మవుతారు.
దిశా నిర్దేశం చేసేందుకు..
ఇటీవల ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినా...రాజకీయపరంగా పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశం లభించలేదు. అంతేగాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చే పడుతున్న కార్యక్రమాలు, మిషన్ భగీరథ తదితర పథకాలను మోదీ అభినందించారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పూర్తిస్థాయిలో నడుం బిగించాలనే సందేశాన్ని అమిత్ షా ఇస్తారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వరంగల్ బహిరంగ సభలోనూ అదే తరహా ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో భాగంగా శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యనేతలు కె.లక్ష్మణ్, పి.మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, జి.కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.