నా భార్య కిడ్నాపయ్యింది.. సీఎంగారూ సాయం చేయండి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ యువకుడు తన భార్య ఆచూకీ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెను అభ్యర్థిస్తున్నాడు. నెల రోజుల నుంచి తన భార్య కనిపించడం లేదంటూ, ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. వివరాలిలా ఉన్నాయి.
బి వినయ్ బాబు (28) హైదరాబాద్లోని ఓ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అతను రాజస్థాన్కు చెందిన మమత (23) అనే యువతిని ప్రేమించాడు. రెండు నెలల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే తమ పెళ్లికి మమత తల్లిదండ్రులు అంగీకరించలేదని చెప్పాడు. పెళ్లయిన తర్వాత మమత తల్లిదండ్రుల నుంచి తమకు ముప్పు ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా మమత కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సిలింగ్కు రావాల్సిందిగా మమత కుటుంబ సభ్యులకు పోలీసులు సమన్లు పంపారు.
ఈ సంఘటన తర్వాత వినయ్, మమత దంపతులు కొత్త ఇంటికి మారారు. నెల రోజుల క్రితం తాను డ్యూటీకి వెళ్లిన సమయంలో మమతను కిడ్నాప్ చేశారని వినయ్ చెప్పాడు. ఆమెను బలవంతంగా తీసుకుపోయినట్టు ఇరుగుపొరుగువారు చెప్పారని వెల్లడించాడు. ఆమె కుటుంబ సభ్యులు సొంతూరు జోధ్పూర్కు తీసుకెళ్లారని ఆరోపించాడు. వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని జోధ్పూర్ బృందాన్ని పంపారు. కాగా మమత ఆచూకీ ఇంకా లభించలేదని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇదిలావుండగా, పెళ్లి అనంతరం మమత 5 కిలోల బంగారం తీసుకుని పారిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు జోధ్పూర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'నా భార్య ఆచూకీ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిని వేడుకుంటున్నా. ఆమె భద్రతపై ఆందోళనగా ఉంది. నా భార్య క్షేమంగా ఉన్నట్టయితే కచ్చితంగా నాకు ఫోన్ చేసేది' అని వినయ్ అన్నాడు.