ప్రియుడే కడతేర్చాడు..
*వీడిన యువతి హత్య కేసు మిస్టరీ
*వేరే యువకుడితో చనువుగా ఉంటుందనే...
*ఇద్దరు నిందితుల అరెస్టు
హయత్‌నగర : బాటసింగారంలో గత డిసెంబర్ 29న జరిగిన యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. మరో యువకుడితో చనువుగా ఉండటం సహించలేక ప్రియుడే ఆమెను హత్య చేసినట్టు తేలింది. ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తినీ హయత్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ ఆనంద్‌భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం...
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని గంజుగాపూర్ గ్రామానికి చెందిన ఎస్‌కే ఇమామ్‌సాబ్ కూతురు షబానాబేగం (20) రాంకోఠిలో నివసించే గీత ఇంట్లో పని చేస్తోంది. పక్కనే కాచిగూడలోని రైస్ డిపోలో పనిచేసే మహ్మద్‌హుస్సేన్ (23)తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, షబానాబేగం మరో యువకునితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. ఇది సహించలేని హుస్సేన్.. షబానాను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. వట్టేపల్లికి చెందిన అతని అన్న కొడుకు ఆటో డ్రైవర్ అబ్దుల్ఫ్రీక్‌ను పిలిచి ‘విషయం’ చెప్పాడు. ఇద్దరూ కలిసి షబానా హత్యకు పథకం వేశారు.
ఇందులో భాగంగా షబానాను ఆటో(ఏపీ12వీ8358)లో వట్టేపల్లికి తీసుకెళ్లారు. అక్కడ భోజనం చేశాక రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంతం చూపిస్తామని నమ్మించి బాటసింగారం దేశ్‌ముఖి రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటో చెడిపోయిందని చెప్పి రఫీక్ మరమ్మతు చేస్తున్నట్టు నటించగా.. హుస్సేన్ షబానాను కొద్ది దూరం తీసుకెళ్లి, కత్తి, స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడు. కిందపడిపోగానే తలపై బండరాయితో మోది ఆమెను చంపేశాడు. తర్వాత హుస్సేన్, రఫీక్‌లు అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు.
స్థానికులు సోమవారం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో పడి ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా మృతురాలు షబానాగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ప్రియుడు హుస్సేన్ హత్య చేసినట్టు గుర్తించారు. ఇతనితో పాటు హత్యకు సహకరించిన రఫీక్‌నూ అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్టు చేశారు. హత్యకు వినియోగించిన ఆటోను కూడా సీజ్ చేశారు.