అది చాలా బాధాకరం: ఎంపీ కవిత
బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం బాధకరమని, ఈ విషయంలో తాను కూడా ప్రశ్నించే వారిలో ఒకరిగా ఉంటానని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో శుక్రవారం ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో జరిగిన ‘భవిష్యత్తు భారతంలో మహిళల ముందంజ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో మహిళల ప్రాతినిథ్యం లేదంటూ ఓ ఫిక్కీ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు కవిత ఈ విధంగా స్పందించారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న రాష్ర్టంలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని, దీనికితోడు అన్ని సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కలేదని చెప్పారు. అయితే ఇది కొంత బాధించదగ్గ విషయమేనన్నారు. గతంతో పోల్చుకుంటే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. ముఖ్యమైన కార్పొరేట్, రాజకీయ పదవుల్లో మహిళలు కీలకస్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు.
భారత్‌లో మహిళల సంఖ్య అధికంగా ఉందని, అందులో 21 సంవత్సరాలలోపు ఉన్న మహిళల సంఖ్య 20 శాతం ఉందన్నారు. ఇంకా పలువురు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్‌పర్సన్ సామియాఆలంఖాన్‌తోపాటు సభ్యులు పింకీరెడ్డి, పార్వతిరెడ్డి, రేఖారెడ్డి, కామిని షరాఫ్ తదితరులు పాల్గొన్నారు.