మందుబాబులు రూ.8.2 కోట్లు ‘కట్టారు’
హైదరాబాద్ : వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ అత్యంత ప్రమాదకరంగా పరిణమించే మద్యం తాగి వాహనం నడపటం (డ్రంకన్ డ్రైవింగ్)పై ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించి బుధవారానికి నాలుగేళ్లు పూర్తయింది. ఈ తనిఖీల్లో చిక్కిన మందుబాబులకు న్యాయస్థానం జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్షలు విధిస్తోంది. ఇప్పటి వరకు ‘నిషా’చరులు న్యాయస్థానానికి చెల్లించిన జరిమానా అక్షరాలా రూ.8,29,26,660.
చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములకు మంచి ఆల్కాహాల్ ఉంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీన్ని బ్లెడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. ఇందుకుగాను ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన నిధులతో ఉపకరణాలు సమీకరించుకుని 2011 నవంబర్ 4 నుంచి వారంలో నాలుగు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి గత నెలాఖరు వరకు మొత్తం 54,658 మంది ట్రాఫిక్ పోలీసులకు చిక్కగా, వారిలో 5677 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయి.