మూడు నెలల్లో ఆర్టీసీ బంకులు..! | RTC bunks in three months | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో ఆర్టీసీ బంకులు..!

Published Mon, Apr 10 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

మూడు నెలల్లో ఆర్టీసీ బంకులు..!

మూడు నెలల్లో ఆర్టీసీ బంకులు..!

తొలి విడతలో 69 చోట్ల.. ఆ తర్వాత మరో 42 చోట్ల ఏర్పాటు
- తొలుత హెచ్‌పీసీఎల్‌.. ఆ తర్వాత ఐఓసీఎల్‌ ఆధ్వర్యంలో బంకులు
- స్థలాల లీజు, డీలర్‌షిప్‌ కమీషన్‌ పొందనున్న సంస్థ
- రూ.10 కోట్ల వార్షికాదాయం వస్తుందంటున్న అధికారులు


సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ పెట్రోల్‌ బంకులు మరో మూడు నెలల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. పెట్రోల్‌ బంకులకు సంబంధించి ఆర్టీసీ ఇటీవలే హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌)తో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సొంత స్థలాల్లో 111 చోట్ల పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. తొలి దశలో 69 బంకులను.. ఆ తర్వాత మరో 42 బంకులను ఏర్పాటు చేయనుంది. తొలుత హెచ్‌పీసీఎల్‌ ఆధ్వర్యంలో 41, ఐఓసీఎల్‌ ఆధ్వర్యంలో 28 బంకులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆ రెండు సంస్థలు పెట్రోల్‌ బంకులకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాయి. మరో మూడు నెలల్లో హెచ్‌పీసీఎల్‌ బంకులు సిద్ధం కానున్నాయి. ఆ తర్వాత ఐఓసీఎల్‌ బంకులు అందుబాటులోకి వస్తాయి.

రూ.10 కోట్లకుపైనే ఆదాయం..
ఈ బంకుల నిర్వహణ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అయితే బంకు ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీకి లీజు మొత్తం చెల్లించాలి. దీంతోపాటు అమ్మినందుకు లీటర్‌ పెట్రోల్‌కు రూ.2.56, డీజిల్‌కు రూ.1.66 చొప్పున హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్‌.. ఆర్టీసీకి డీలర్‌షిప్‌ కమీషన్‌ చెల్లిస్తాయి. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో ఆర్టీసీ ఈ బంకులను నిర్వహిస్తుంది. భవిష్యత్తులో వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించి పర్మనెంట్‌ చేయాలనే డిమాండ్‌ వచ్చే అవకాశం ఉంటుందని ఊహిస్తున్న ఆర్టీసీ.. సొంతంగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా, నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని భావిస్తోంది. ఇందుకోసం త్వరలో టెండర్లు పిలవబోతోంది. చమురు సంస్థలు ఆర్టీసీకి చెల్లించే డీలర్‌షిప్‌ మొత్తం నుంచే ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఎవరు తక్కువ మొత్తం కోట్‌ చేస్తారో వారికి నిర్వహణ బాధ్యతను అప్పగిస్తుంది. వారు కోట్‌ చేసే మొత్తం పోను మిగితాది ఆర్టీసీకి ఆదాయంగా మారుతుంది. వెరసి రూ.10 కోట్ల వరకు వార్షికాదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.

ప్రత్యామ్నాయ ఆదాయ బాటలో..
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఆదాయం కోసం అధికారులు బంకుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. జైళ్ల శాఖ సొంతంగా పెట్రోల్‌ బంకులు నిర్వహిస్తూ లాభాలు ఆర్జిస్తున్న తరహాలోనే ఆర్టీసీ కూడా బంకుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. నగరం సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆర్టీసీకి విలువైన స్థలాలున్నాయి. అవన్నీ దాదాపు ప్రధాన రహదారులపైనే ఉండటంతో పెట్రోల్‌ బంకులు లాభదాయకంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు బస్టాండ్లలో మినీ సినిమా థియేటర్ల ఏర్పాటుకు కూడా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. టెండర్లు పిలవగా దాదాపు 300కుపైగా థియేటర్ల నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ రెండు ప్రయత్నాలు ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు దోహదం చేస్తాయని సంస్థ గంపెడాశతో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement