స్టార్ క్యాంపెయినర్ జానారెడ్డి!
♦ జీహెచ్‌ఎంసీ రూ. 5 భోజనాన్ని పొగుడుతూ ప్రెస్‌మీట్
♦ కష్టపడకుండా ప్రచారం వచ్చిందంటూ సంబరపడుతున్న టీఆర్‌ఎస్
♦ అధికార పార్టీకి లాభం చేకూర్చే చేష్టలేమిటని కాంగ్రెస్ నేతల మండిపాటు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ ఎవరో తెలుసా...? టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను నెత్తినెత్తుకున్న మంత్రి కేటీఆరో, వచ్చీరాని భాషలో ప్రచారం చేస్తూ జనానికి హాస్యం పంచుతున్న నారా లోకేశో అనుకుంటున్నారా.. కాదు. మరి ఏపీకి సీఏంగా ఉంటూ ఇక్కడ ప్రచారం చేస్తున్న చంద్రబాబో, ఇన్ని రోజులు ప్రచారానికి దూరంగా ఉండి గురువారం ఏకంగా రెండు గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టిన సీఎం కేసీఆరో అనుకుంటున్నారా.. వారు కూడా కాదు.
ప్రతిపక్ష నేతగా ఉంటూ అధికార పార్టీకి లాభం చేకూర్చేలా వ్యవహరించిన జానారెడ్డే స్టార్ క్యాంపెయినర్ అని అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్‌లో ప్రచారానికి వెళ్లకుండా కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో కూర్చుని జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5 భోజన పథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించడమే దీనికి కారణం. అసలు ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ భోజన కేంద్రం నుంచి పార్సిల్ తెప్పించడమే కాదు, దానిని తింటూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి, ఆ భోజనం బాగుందని కూడా జానారెడ్డి కితాబిచ్చారు.
అయితే జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ఈ రూ. 5కే భోజనం కార్యక్రమం పేదలు, చిరుద్యోగులకు వరమంటూ అధికార టీఆర్‌ఎస్ జంట నగరాల్లో హోర్డింగ్‌ల ద్వారా ఊదరగొట్టింది. అది తమ పథకమేనని ప్రచారం చేసింది. తాజాగా జీహెచ్‌ఎంసీ భోజనం సూపర్ అంటూ ప్రతిపక్ష నేత కితాబు ఇవ్వడంతో టీఆర్‌ఎస్ నేతలు సంబరపడుతున్నారు. తాము చేసిన ప్రచారం కంటే ప్రతిపక్ష నేత చెప్పిందానినే ప్రజలు ఎక్కువగా నమ్ముతారన్నది వారి అభిప్రాయం. ఇదే సమయంలో జానారెడ్డి వ్యాఖ్యలతో ఇబ్బందిపడిన కాంగ్రెస్ నేతలు మింగలేక కక్కలేక మౌనంగా ఉండిపోయారు.
కొందరైతే జానాపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. జానారెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌కు నష్టం కలిగించేదంటూ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి బహిరంగంగానే మండిపడ్డారు. అయితే తీరా ఎన్నికలకు మూడు రోజుల ముందు దీనిని మరింతగా ప్రచారం చేసి పార్టీ పరువు పోగొట్టుకోవడమెందుకని మెజారిటీ నేతలు మిన్నకుండిపోయారు. ‘‘రూ.5 కే భోజనం అని అధికార పార్టీ ప్రచారంతో ఊదరగొడుతుంటే మా నాయకుడు దానికి క్రెడిట్ తెచ్చిపెట్టారు. మా కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినదా, దీని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’’ అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
జానాపై అధిష్టానానికి ఫిర్యాదు: పాల్వాయి
జీహెచ్‌ఎంసీ అందిస్తున్న రూ.5 భోజనపథకం బాగుందని పొగిడిన కె.జానారెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. రూ.5 భోజన పథకాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిందేనన్నారు. రూ.5ల భోజనంపై ప్రభుత్వానికి కితాబివ్వడం దురదృష్టకరమన్నారు. దీనిపై జానారెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీయే పెట్టింది
ఎవరేమనుకున్నా జానారెడ్డి మాత్రం రూ. 5 భోజనాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. దానిని ప్రజలకు వివరించడం కోసమే ప్రతిపక్ష నేత ఆచరణలో పెట్టి చూపించారని జానాను సమర్థించే నేతలు చెబుతున్నారు. అదే విషయాన్ని క్షేత్రస్థాయిలో జానారెడ్డి ఎందుకు ప్రచారం చేయడం లేదని, పార్టీ మేనిఫెస్టోలో దానిని ఎందుకు ప్రస్తావించలేదని మరికొందరు నేతలు అంటున్నారు. ఎవరేమనుకున్నా జీహెచ్‌ఎంసీ రూ. 5 భోజన పథకం టీఆర్‌ఎస్‌దేనని ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగామని, జానారెడ్డి కూడా ఎండార్స్ చేయడంతో మాకు మంచి మేలే జరిగిందని రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.