ఎక్కడైనా ‘ఆరే’స్కో..
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ‘6’ అంకెపై విస్తృత చర్చ నడుస్తోంది. యంత్రాంగం ఏ పని చేసినా అంకెల మొత్తం కూడితే 6 అవుతుండటమే దీనికి కారణం. వివిధ పథకాల లబ్ధిదారుల సంఖ్య... రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల సంఖ్యల మొత్తం ‘6’ కావడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం ద్వారా మొదటి విడతలో 105 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులోని అంకెల మొత్తం కలిపితే 6. రెండో దశలో 303 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ అంకెల మొత్తం ‘ఆరే’. అంతేకాదు.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ముసాయిదా బడ్జెట్ ను సైతం అన్ని అంకెలు కలిపితే అంతిమంగా ‘6’ వచ్చేలా రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇంతకీ.. 6పై అంత మోజెందుకోనని ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లక్కీనెంబర్ 6గా తెలుస్తోంది. అందుకే ఆ అంకె వచ్చేలా చేపట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందనే నమ్మకంతో...ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారులకు కార్లను పంపిణీ చేసే సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.