విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల కొనసాగుతోంది. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కేవలం రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఎండల తీవ్రత నామమాత్రంగానే ఉంటోంది. మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతోపాటు దక్షిణ, ఆగ్నేయ గాలులు కూడా వీస్తున్నాయి.
వీటి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకట్రెండు చోట్ల వచ్చే రెండ్రోజులు తేలికపాటి వర్షం గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, నిజామాబాద్‌లలో అత్యధికంగా 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, రామగుండం, హైదరాబాద్‌లలో 40 డిగ్రీలు చొప్పున రికార్డయింది. కోస్తాంధ్రలో పలుచోట్ల 39 డిగ్రీల లోపే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.