మధుమేహం అంటువ్యాధా?
సంక్రమించే అవకాశం ఉందంటున్న టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు
వేళాపాళా లేకుండా తినడం..
కడుపులో చల్ల కదలకుండా గడిపేయడం.. ప్రతి దానికీ టెన్షన్ పడుతుండడం.. అతిగా మద్యం తాగడం.. ఇవన్నీ మధుమేహానికి (టైప్–2) కారణమని మనకు తెలుసు. కానీ మధుమేహం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధి కావొచ్చని టెక్సాస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశువుల నుంచి మనుషులకు సంక్రమించిన గాలికుంటు వ్యాధి తరహాలో మధుమేహం కూడా సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
జనాభాలో ఆరుశాతం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతున్నారు. 1985 సమయంలో కేవలం మూడు కోట్ల మంది మాత్రమే ఉన్న మధుమేహ బాధితులు.. 2015 నాటికి 39 కోట్లకు చేరుకున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు.. జంక్‌ఫుడ్.. వ్యాయామలేమి.. పని ఒత్తిడి కారణంగా మధుమేహం బారిన పడుతున్నట్లుగా గుర్తిం చిన వైద్యులు ఈ అంశాల్లో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వారసత్వంగానూ మధుమేహం వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. కానీ అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఓ పరిశోధన మరో ఆందోళనకరమైన విషయాన్ని బయటపెట్టింది. పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి తరహాలో... మధుమేహం కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశముందని పేర్కొంటోంది.
ఏమిటీ ప్రయోగం?
టైప్–2 మధుమేహుల శరీరంలో కొన్ని ప్రొటీన్ల మోతాదు గణనీయంగా ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. దీనికి కారణమేమిటనే దానిపై టెక్సాస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మధుమేహ బాధితుల్లో ‘అమైలాయిడ్ పాలీపెప్టైడ్ అనే ప్రొటీన్ (ఐఏపీపీ)’కొంచెం భిన్నమైన ఆకారంలో ఉండి, కొన్ని చోట్ల పోగుపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ప్రొటీన్లను సేకరించి కొద్ది మోతాదుల్లో ఎలుకలకు ఎక్కించి పరిశీలించగా.. వాటి క్లోమ గ్రంథుల్లో ఈ ప్రొటీన్ అధికంగా చేరడం మొదలైంది. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ ఎలుకల్లో మధుమేహం లక్షణాలు కనిపించాయి.
క్లోమగ్రంథిలో ఐఏపీపీ మోతాదు ఎక్కువైనప్పుడు అవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలను నాశనం చేస్తుండవచ్చని.. అందువల్లే మధుమేహం తలెత్తిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్ల కింద యూరోపియన్ దేశాల్లో వేలాది పశువుల మృతికి కారణమైన గాలికుంటు వ్యాధి కూడా ఇలాగే ఐఏపీపీల కారణంగానే పశువుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే... మధుమేహ లక్షణాలున్న జంతువుల మాంసాన్ని తిన్నా.. ఏ కారణం చేతనైనా ఐఏపీపీల వంటి ప్రొటీన్లు మన క్లోమగ్రంథిలోకి చేరినా మధుమేహం రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఆందోళన వద్దు
టైప్–2 మధుమేహం సంక్రమిస్తుందనగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రాథమిక పరిశోధన మాత్రమేనని, పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతగానీ కచ్చితమైన నిర్ధారణకు రాలేమని అంటున్నారు. ఇక మధుమేహం ఎలా తీవ్రమవుతుందనేది తమ పరిశోధన ద్వారా తెలుస్తోందని వర్సిటీ శాస్త్రవేత్త క్లాడియో సోటో చెప్పారు. మధుమేహానికి దారితీసే మూల కారణాన్ని కూడా తెలుసుకోవడం ద్వారా మెరుగైన చికిత్స అందించే వీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు.