ఈ మధ్యకాలంలో తరచుగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకూ, గతి తప్పుతున్న రుతువులకూ, విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధులకూ పర్యావరణ విధ్వంసమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో గత వారం జరిగిన రెండు పరిణామాలు సాంత్వన కలిగిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కాలుష్యకారక దేశం అమెరికా...మరో కాలుష్యకారక దేశం చైనాతో భూతాపోన్నతికి కారణమవుతున్న బొగ్గుపులుసు వాయువులను అరికట్టే విషయంలో ఒక ఒప్పందానికి వచ్చింది.
అలాగే, ఐక్యరాజ్యసమితి హరిత వాతావరణ నిధి(జీసీఎఫ్)కి 300 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఈ నెల 19, 20 తేదీల్లో బెర్లిన్‌లో జీసీఎఫ్‌పై సదస్సు జరగబోతున్న నేపథ్యంలోనే ఈ రెండు పరిణామాలూ చోటుచేసుకున్నాయి. పెరుగుతున్న కాలుష్యంవల్ల అనేకానేక ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి భిన్న సందర్భాల్లో ప్రకటించాయి. కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో రెండు దశాబ్దాలక్రితమే ప్రపంచ దేశాలు అంగీకారానికొచ్చాయి. అయితే, అదంతా హామీలుగా తప్ప ఆచరించి తీరాల్సిన ఒప్పందం రూపంలో లేకపోవడంతో అమెరికాతో సహా పారిశ్రామిక దేశాలు అనంతరకాలంలో బేఖాతరు చేశాయి.
కర్బన ఉద్గారాలను పాతిక శాతం తగ్గించుకుంటానని గతంలో హామీ ఇచ్చిన జపాన్ అది తమకు సాధ్యంకాదని నిరుడు ప్రకటించింది. ఇక వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా నష్టపోతున్న పేద దేశాలను ఆదుకోవడానికి ఏర్పాటుచేసిన జీసీఎఫ్‌కి నిధులు సమకూరుస్తామని 2010నాటి కాన్‌కున్ సదస్సులో హామీ ఇచ్చిన దేశాలు దాదాపు ముఖం చాటేశాయి.
ఆ నిధికి 2020 మొదలుకొని తాము సమష్టిగా ఏడాదికి పదివేల కోట్ల డాలర్ల చొప్పున అందజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చాయి. అయితే, ఇంతవరకూ సమకూరింది 230 కోట్ల డాలర్లు మాత్రమే. అందులో 130 కోట్ల డాలర్లు రెండు నెలలక్రితం మాత్రమే వచ్చాయి. ఇంతవరకూ వివిధ పారిశ్రామిక దేశాలు 600 కోట్ల డాలర్లమేర హామీలిచ్చాయి. అందులో జర్మనీ, ఫ్రాన్స్‌లు వందేసి కోట్ల డాలర్ల చొప్పున ఇస్తామని చెప్పగా స్వీడన్ వాటా 50 కోట్ల డాలర్లు. ఈ హామీలు కూడా వాస్తవరూపం దాల్చేసరికి ఏమవుతాయో తెలియదు.
పారిశ్రామిక దేశాలు కాలుష్యాన్ని అరికట్టకపోతే 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల మేర పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే సముద్ర మట్టాలు ఇప్పటికన్నా 25 మీటర్లు ఎత్తు పెరుగుతాయని, చాలా దేశాలు ప్రపంచ చిత్రపటంనుంచే అదృశ్యమవుతాయని వారంటున్నారు. ఇలా ఒక పక్క ముప్పు ముంచుకొస్తుంటే ముందుకు కదలడానికి సంపన్న దేశాలు మొరాయిస్తున్నాయి.
ఇప్పుడు అమెరికా, చైనాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ద్వైపాక్షిక అంగీకారానికి రావడం హర్షించదగ్గదే అయినా తరచి చూస్తే అందులో ఎన్ని లొసుగులున్నాయో అర్థమవుతుంది. ఇప్పటికీ ప్రపంచంలో అతి పెద్ద కాలుష్యకారక దేశంగా పేరు తెచ్చుకున్న అమెరికా 2025 నాటికి ఉద్గారాలను 2005 స్థాయిలో 26 నుంచి 28 శాతం తగ్గించుకుంటానని హామీ ఇచ్చింది. 1990నాటి స్థాయితో పోలిస్తే ఇది నిజానికి 15 శాతం మించదు. ఒకపక్క 1990 నాటి ఉద్గారాల్లో తాము 2030కల్లా 40 శాతం తగ్గించుకోగలమన్న యూరోప్ దేశాల హామీతో పోలిస్తే ఇది చాలా స్వల్పం.
చైనా చెబుతున్నది ఇంతకన్నా నైరూప్యంగా ఉన్నది. తాము 2030 వరకూ ఇప్పటికంటే ఉద్గారాలను పెంచుతామని, అటు తర్వాత దాన్ని క్రమేపీ తగ్గించుకుంటామని హామీ ఇస్తున్నది. ఆ తగ్గించుకోవడం ఎంత శాతమో అంకెల్లో చెప్పడంలేదు. ప్రపంచంలో అత్యధికంగా బొగ్గును వినియోగిస్తున్న దేశంగా ముద్రపడిన చైనా ఇంతకంటే మెరుగ్గా చెప్పివుండాల్సింది. కర్బన ఉద్గారాలతో ప్రపంచానికి పెను ముప్పు పొంచివున్నదని గుర్తించి, ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇంత స్వల్ప పురోగతి ఉన్నదంటే అగ్రదేశాల బాధ్యతారాహిత్యం ఏమేరకు ఉన్నదో అర్థంచేసుకోవచ్చు.
అమెరికా-చైనా ద్వైపాక్షిక ఒప్పందం పర్యవసానాలు ఇతరత్రా ఎలా ఉన్నా మన దేశంపై దాని ప్రభావం ఉండకతప్పదు. వచ్చే అయిదేళ్లలో బొగ్గు ఉత్పత్తిని రె ట్టింపుచేసి, విద్యుదుత్పత్తిని పెంచుతామని ఈమధ్యే కేంద్ర ఇంధన వనరుల మంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. ఇంతకాలమూ మన దేశమూ, చైనా సంపన్న దేశాలపై పర్యావరణం విషయంలో సమష్టిగా పోరాడుతున్నాయి. 2009 కోపెన్‌హాగన్ పర్యావరణ సదస్సులోగానీ, అటు తర్వాతగానీ రెండు దేశాలూ కలిసిపనిచేశాయి. ఇటీవల తమ దేశ పర్యటనకొచ్చిన ఒబామాతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా చైనా తన దోవ తాను వెతుక్కున్నట్టయింది.
ఇక జీసీఎఫ్‌కు తాము 300 కోట్ల డాలర్లు అందజేయగలమన్న ఒబామా హామీ ఎంతవరకూ నెరవేరుతుందన్నది కూడా అనుమానమే. ఇటీవలి ఎన్నికల తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌లో, సెనేట్‌లో ఆయన సారథ్యంవహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది. రెండుచోట్లా ఆధిపత్యం సంపాదించిన రిపబ్లికన్లు ఆదినుంచీ పర్యావరణం నాశనమైపోతున్నదన్న వాదన నిరాధారమైనదని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒబామా తన వాగ్దానాన్ని నెరవేర్చడం అంత సులభం కాదు.
వచ్చే ఏడాది నవంబర్‌లో పారిస్‌లో జరగబోయే వాతావరణ సదస్సు నాటికి ఎంతో కొంత చేసినట్టు చూపాలన్న తొందరతో ఎవరికి వారు ఇప్పుడే నిద్రలేచినట్టు హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడిలో అసలు అంశాలు మరుగున పడకుండా చూడాల్సిన బాధ్యత... ప్రపంచ దేశాల ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత పర్యావరణవేత్తలపై, శాస్త్రవేత్తలపై ఉన్నది. ప్రజలనుంచి వచ్చే ఒత్తిడే దేశదేశాల్లోని పాలకులనూ సరైన దారిలో పెట్టగలదు.
పర్యావరణంపై హడావుడి
Published Tue, Nov 18 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement