ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు | How Italian tomatoes slave labours in italy mafia | Sakshi
Sakshi News home page

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

Published Mon, Jul 15 2019 5:32 PM | Last Updated on Mon, Jul 15 2019 8:34 PM

How Italian tomatoes slave labours in italy mafia - Sakshi

బ్రిటన్‌లోని ప్రతి ఇంటి వంటింటి కంబోర్డుల్లో నిగనిగలాడుతున్న ఎర్రటి ఇటలీ టమోటాలు మెరిసిపోతుంటాయి. వండకుండానే వాటిని అలాగే నమిలి తినేయాలనిపిస్తుంది. వాటి పక్కనే రకరకాల ఫ్లేవర్లు కలిగిన టమోటా సాస్‌లు, పేస్ట్‌లు నోరూరిస్తుంటాయి. కానీ అవన్నీ మానవ రక్తంతో ఎరుపెక్కాయని తెలిస్తే...వాటి వెనకాల బానిస కూలీల ఆకలి కేకలు ఉన్నాయని, వారి ప్రాణ త్యాగంతో అవి ఫలించాయని తెలిస్తే....ఇది ముమ్మాటికి నిజం. ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్న టమోటాల్లో 80 శాతం ఇటిలీ నుంచి ఎగుమతి అవుతున్నవే. ఇక ఎగుమవుతున్న టమోటా ఉత్పత్తుల్లో ఐదోవంతు ఇటలీ నుంచి వస్తున్నవే. 

దక్షణ ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో టమోటాలను ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ పండించే టమోటా పంట కోతకొచ్చినప్పుడు పనిచేసే కార్మికులంతా ఆఫ్రీకా నుంచి వలస వచ్చిన బానిస కూలీలే. ఇటలీ చట్టం ప్రకారం వారికి రోజుకు కనీస వేతనంగా 45 యూరోలు చెల్లించాలి. వారికి చెల్లించేది కేవలం మూడున్నర యూరోలు లేదా 30 కిలోల టమోటాలు మాత్రమే. అందుకు కారణం వారంతా ఇటలీ మాఫియా నెట్‌వర్క్‌ కింద పనిచేయడమే. కాదని ఎదురు తిరిగితే అది కూడా దక్కదు. ఇటలీ బానిస కూలీలను సరఫరా చేసే మాఫియా పేరు ‘ఎన్‌డ్రాంగేటా’. ఇది ఒక్క ఇటలీకే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు కూడా విస్తరించింది. (ఇటలీ నుంచే అమెరికాకు ‘గాడ్‌ ఫాదర్‌’ వ్యవస్థ విస్తరించిన విషయం తెల్సిందే)

ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల నుంచి కూలీలను సరఫరా చేసే కాంట్రాక్టులకు ఎక్కువగా ఈ మాఫియానే రకరకాల పద్ధతిలో కొట్టేస్తుంది. ‘సెపరలాటో’లుగా పిలిచే గ్యాంగ్‌ లీడర్లను బానిస కార్మికులు నివసించే తాత్కాలిక షెడ్లకు పంపిస్తుంది. అక్కడ ఆ గ్యాంగ్‌ లీడర్లు అవసరమైనంత మంది కూలీలను ఎంపిక చేసుకొని సైట్‌కు తీసుకెళతారు. టమోటా తోటల్లో అయితే వారు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేయాలి. ఉదయం ఇంటి వద్దనే తిని రావాలి. సాయంత్రం ఇంటికి వెళ్లాకే తినాలి. మధ్యలో ఆకలి భరించలేకపోతే పండిపోయి పడేయాల్సిన టమోటాలను మాత్రమే తిని కడుపు నింపుకోవాలి. కాస్త కునుకు తీసేందుకు ప్రయత్నిస్తే, కాపలాకాసే గూండా చేతిలో ఉన్న కొరడా వచ్చి వీపును చుర్రుమనిపిస్తుంది. 

మాఫియాకు 300 కోట్ల యూరోలు
ఈ పుంగ్లీ ప్రాంతంలో మాఫియా నెట్‌వర్క్‌ గుప్పిట్లో దాదాపు 90 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. వారు చాలి చాలని కూలీతో పనిచేస్తుంటే వారి మీద మాఫియాకు ఏటా 300 కోట్ల యూరోలు లాభంగా వస్తున్నాయని ఇటలీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారి బోర్గేస్‌ మీడియాకు తెలిపారు. ఈ మాఫియా దేశం మొత్తంగా వ్యవసాయ కూలీల ద్వారా ఏటా 2,200 కోట్ల యూరోల రెవెన్యూను కూడగడుతోందని ‘అబ్జర్వేటరీ ఆఫ్‌ క్రైమ్‌ ఇన్‌ అగ్రికల్చర్, ది ఫుడ్‌ చెయిన్‌’ సంయుక్త అధ్యయనంలో తేలింది. ఇతర వ్యవసాయ రంగాల్లో పనిచేసే కూలీలకు టమోటా కూలీలకన్నా ఈ మాఫియా కొద్దిగా ఎక్కువ చెల్లిస్తోంది. రోజుకు 45 యూరోలు చెల్లించాల్సి ఉండగా, అందులో మూడో వంతును మాత్రమే చెల్లిస్తుంది. వాటిలోనూ రాను, పోను రవాణా చార్జీలను కూడా పట్టుకుంటుంది. వర్క్‌ పర్మిటి వస్తుందన్న ఆశతో కూలీలు ఎదురు తిరిగేందుకు సాహసించలేరు. 

వర్క్‌ పర్మిట్లున్నా లాభం లేదు
వర్క్‌ పర్మిట్లున్న కార్మికులకు కూడా ఈ మాఫియా 35 యూరోలకు మించి చెల్లించడం లేదు. అందులో రవాణా, మంచినీళ్ల చార్జీలను వసూలు చేస్తుంది. వర్క్‌ ప్లేస్‌కు సమీపంలో ఊరవతల కూలీల కోసం చిన్న గుడారాలు వేయిస్తుంది. అందులోనే వారు మగ్గిపోవాలి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఇంతలో అక్కడ అక్రమంగా గుడారాలు వెలిశాయన్న విషయం తెల్సిన వెంటనే స్థానిక ఇటలీ అధికారులు వచ్చి వారి గుడారాలను కూల్చేస్తారు. వారు అక్కడి నుంచి కట్టుబట్టలతో చెట్టూ పుట్టా పట్టుకొని వెళ్లాల్సిందే. 

2016లో కార్మిక చట్టం బలోపేతం
కూలీల నిలువు దోపిడీ, బానిస కూలీల వ్యవస్థ గురించి దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో  ఇటలీ ప్రభుత్వం 2016లో దేశ కార్మిక, వలస కార్మిక చట్టాల నిబంధనలు కఠినతరం చేసింది. దేశం నుంచి టమాటో ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రముఖ బ్రాండులైన సిరియో, టెస్కో, నార్దో లాంటి కార్పొరేట్‌ సంస్థలకే కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యతను  అప్పగించింది. కూలీల వ్యవస్థలో దోపిడీని నిర్మూలించేందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 

ఎంతోమంది కూలీల మృతి
టమాటోలు తెంపుతున్న సమయంలో గుండె పోటుతో చనిపోతున్న వయస్సు మళ్లిన వారు ఎంతో మంది ఉంటున్నారు. వారిని సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు అందుబాటులో అంబులెన్స్‌లను కూడా మాఫియా ఏర్పాటు చేయడం లేదు. టమోటాల ఒవర్‌ లోడ్‌తో వెళుతున్న వాహనాలపైనే కూలీలను ఎక్కించడం వల్ల ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. బ్రిటన్‌కు ఎక్కువగా టమోటాలను, వాటి ఉత్పత్తులను సరఫరా చేస్తున్న ‘నార్దో’ బ్రాండ్‌ పరిధిలో ఇలా ఎక్కువ మంది మరణించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement