151 మంది దుర్మరణానికి.. కొద్ది క్షణాల ముందు
లాహోర్:
పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 151 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ పండుగకు ఒకరోజు ముందు చోటుచేసుకున్న ఈ దుర్ఘటన అందరిని కలిచివేసింది. దీనికి సంబంధించి పేలుడుకు కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియోను పాకిస్తాన్కు చెందిన ఓ ఉన్నతాధికారి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఈ వీడియోలో చూసుకున్న బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల్లో.. ట్యాంకర్ నుంచి లీకైన పెట్రోల్ను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలనే ఆలోచన తప్ప వారికి మరో ధ్యాసలేదు. బకెట్లు, క్యాన్లు, బాటిళ్లతో పెట్రోల్ను తీసుకువెళ్లడం చూడొచ్చు. పడిపోయిన కంటైనర్కు సమీపంలోనే వీరంతా రోడ్డుకు ఇరువైపులా ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అయితే.. ట్యాంకర్ వద్దకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా వచ్చారని, అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఎంత చెప్పినా వారు వినలేదని బహవల్‌పూర్ ప్రాంతీయ పోలీసు అధికారి రాజా రిఫాత్ తెలిపారు.
కరాచీ నుంచి 50 వేల లీటర్ల పెట్రోల్‌తో లాహోర్ వెళ్తున్న ట్యాంకర్ బహవల్‌పూర్ జిల్లా అహ్మద్‌పూర్ వద్ద టైర్ పేలడంతో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లోని పెట్రోల్ లీక్ అయింది. దీన్ని గమనించిన స్థానిక గ్రామాల ప్రజలు పెట్రోల్‌ను తీసుకోవడానికి వందల సంఖ్యలో ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ గుమిగూడిన జనం మంటల్లో చిక్కుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ అంటించడం వల్లే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.