అమెరికాకు రష్యా సీరియస్ వార్నింగ్
సిరియా వైమానిక స్థావరం మీద క్షిపణి దాడులు చేసినందుకు అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా సీరియస్‌గా హెచ్చరించింది. విదేశాంగ విధానంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయమే అమెరికా – రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన యూఎస్‌ఎస్ పోర్టర్, యూఎస్‌ఎస్ రాస్ అనే రెండు యుద్ధనౌకల నుంచి సుదూరంగా ఉన్న సిరియాలోని షైరత్ వైమానిక స్థావరం మీద దాదాపు 60 వరకు తోమహాక్ క్షిపణులను ప్రయోగించి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో సిరియా సైన్యం రసాయన దాడులకు పాల్పడి, 70 మంది అమాయకులను మట్టుబెట్టడంతో తాము ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా చెబుతున్నా, అంతర్జాతీయ సమాజం మాత్రం దాన్ని అంతగా ఆమోదించడం లేదు. బ్రిటన్ లాంటి ఒకటి రెండు దేశాలు మాత్రం అమెరికాను సమర్థించాయి. మిగిలిన వాళ్లంతా అమెరికా దుందుడుకు చర్యను ఖండించారు. గత ఆరేళ్లుగా సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ఇది రెండోసారి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదేశాలతోనే రసాయన దాడులు జరిగాయని, వాటిలో కనీసం 70 మంది మరణించారని చెబుతుండగా... సిరియా ప్రభుత్వం మాత్రం ఆ దాడులు చేసింది తాము కాదని అంటోంది.
ఈ రసాయన దాడి అనంతరం అమెరికా చేసిన క్షిపణి దాడులతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రష్యా ఎప్పటినుంచో సిరియాకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అమెరికా అక్రమంగా తీసుకున్న ఈ ఏకపక్ష చర్యలను తాము గట్టిగా ఖండిస్తున్నామని, దీనికి ప్రాంతీయంగాను, అంతర్జాతీయంగాను వచ్చే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితిలో రష్యా ఉప రాయబారి వ్లాదిమిర్ సాఫ్రన్‌కొవ్ తెలిపారు.
మాకు ఒక్క అడుగే దూరం: మెద్వదెవ్
రష్యా సైన్యంతో నేరుగా తలపడేందుకు ఒక్క అడుగు దూరంలో మాత్రమే అమెరికా ఉందన్న విషయాన్ని ఈ దాడులు నిరూపిస్తున్నాయని రష్యా ప్రధానమంత్రి డిమిట్రీ మెద్వదెవ్ వ్యాఖ్యానించారు. అమెరికా క్షిపణి దాడుల్లో ధ్వంసమైన వైమానిక స్థావరంలో రష్యాకు చెందిన ప్రత్యేక బలగాలు, హెలికాప్టర్లు అన్నీ ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మీద సిరియా చేస్తున్న పోరాటానికి అండగానే ఇవి అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికా అనాలోచితంగా చేసిన ఈ దాడి ఫలితంగా రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేకమైన హాట్‌లైన్ మూతపడుతుందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెబుతోంది.
మరిన్ని చర్యలు: అమెరికా
ఒబామా హయాంలో రష్యాతో తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాలను తాను మెరుగు పరుస్తానని ట్రంప్ చాలా సందర్భాలలో తెలిపారు. సమీప భవిష్యత్తులో తాము సిరియా మీద మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవ్ నుచిన్ తెలిపారు. సిరియా విషయంలో మాత్రం అవసరమైతే తాము మరిన్ని చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. అయితే అది అవసరం అవుతుందని తాను భావించడం లేదన్నారు. ఒకవైపు రసాయన ఆయుధాలు ఉపయోగిస్తుంటే మరోవైపు అమెరికా మాత్రం చూస్తూ ఊరుకోబోదని ఆమె తెలిపారు. రసాయన ఆయుధాల ఉపయోగాన్ని నిరోధించడం తమ కీలక జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమని ఆమె అన్నారు.