అంగరంగ వైభవంగా సక్సెస్ పార్టీ
Published Sun, Dec 22 2013 11:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఆనందం అంబరాన్నంటితే పండగ చేసుకోవాలనిపిస్తుంది. ఇటీవల దీపికా పదుకొనేకి అలానే అనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరిలోకెల్లా కెరీర్‌పరంగా ఆనందంగా ఉన్నది దీపికా మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ఈ సొట్ట బుగ్గల సుందరికి 2013 బాగానే కలిసొచ్చింది. ‘ఏ జవానీ హై దివానీ’, ‘రేస్ 2’, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, ‘రామ్‌లీలా’.. ఇలా ఈ ఏడాది దీపికా నాయికగా నటించిన చిత్రాలు బంపర్ హిట్లయ్యాయి. వీటిలో ‘రేస్ 2’ ఒక్కటే మల్టీస్టారర్.
ఇక, అతిథి పాత్రలో దీపికా నటించిన ‘బాంబే టాకీస్’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి.. పండగ చేసుకోవడానికి ఈ కారణం చాలదా? అందుకే, దీపికా తన సన్నిహితులకు, స్నేహితులకు మంచి పార్టీ ఇవ్వాలనుకున్నారు. ఈ పార్టీని ఇంట్లోనే చేయాలనుకున్నారు. బుక్కూ పెన్నూ తీసుకుని లిస్ట్ రాయడం మొదలుపెట్టారు. కట్ చేస్తే.. అతిథుల జాబితా చాంతాడంత అయ్యింది.
ఇల్లయితే కష్టం అనుకుని ఓ ఐదు నక్షత్రాల హోటల్ బుక్ చేసేసింది దీపిక. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ పార్టీకి చీకటి పడిన విషయం కూడా తెలియలేదు. అర్ధరాత్రి దాటేసిందని సమాచారం. ఈ పార్టీకి దీపికా ‘బ్లాక్ అండ్ గోల్డ్’ థీమ్‌ని ఫిక్స్ చేశారు. అంటే అతిథులు నలుపు రంగు లేక స్వర్ణ వర్ణం దుస్తుల్లో రావాల్సి ఉంటుంది. దీపికా ఫిక్స్ చేసిన ఈ థీమ్‌ని ఒకరిద్దరు అతిథులు మినహా మిగతావారందరూ పాటించారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ రణవీర్‌సింగ్ అయితే టాప్ టు బాటమ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ డ్రెస్‌లో హాజరైపోయారు. చివరికి పాదరక్షలు కూడా బ్లాక్ అండ్ గోల్డ్‌లోనే. దాన్నిబట్టి దీపికా మీద ఇతగాడికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
పార్టీలో అందరికన్నా ఎక్కువ హంగామా చేసింది రణవీరేనట. యువనటుడు అర్జున్‌కపూర్‌ని ఆటపట్టించడమే కాకుండా సీనియర్ తారలను జోకులతో నవ్వించారట రణవీర్. ఈ పార్టీలో ఆమిర్‌ఖాన్, ఫారుక్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, సోనూసూద్ సతీసమేతంగా పాల్గొనగా, పతీసమేతంగా శిల్పాశెట్టి హాజరయ్యారు. ఇంకా దీపికా తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’ దర్శకురాలు ఫరాఖాన్, బిపాసా బసు, అమీషాపటేల్, అమృతా అరోరా, మలైకా అరోరా తదితరులు పాల్గొన్నారు. అతిథులందర్నీ దీపికా సాదరంగా ఆహ్వానించి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారట.
Advertisement
Advertisement