సంకల్ప్‌ సైజ్‌కి, విజన్‌కి సంబంధం లేదు: రామ్‌చరణ్ | Happy to proud and jealous of Varun Tej: Ram Charan | Sakshi
Sakshi News home page

అంతరిక్షం ట్రైలర్‌ చూసి జెలసీ అనిపించింది – రామ్‌చరణ్

Published Wed, Dec 19 2018 12:39 AM | Last Updated on Wed, Dec 19 2018 9:19 AM

 Happy to proud and jealous of Varun Tej: Ram Charan - Sakshi

‘‘ఏడాదికి ఓ సినిమా చేస్తే చాలా గొప్ప. రెండు చేస్తే అది ఓ అదృష్టం. ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే కోరిక మా అందరికీ ఉంటుంది. రెండుసార్లు మీ ముందుకు (ఫ్యాన్స్‌) రావాలనే ఆనందం సినిమా కన్నా ఎక్కువ సంతోషం ఇస్తుంది. ‘అంతరిక్షం’ లాంటి మంచి సినిమాతో వరుణ్‌ మీ ముందుకు వస్తున్నాడు’’ అని హీరో రామ్‌చరణ్‌ అన్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌’. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ముఖ్య అతిథి రామ్‌చర ణ్‌ మాట్లాడుతూ– ‘‘వరుణ్‌ పిలవగానే నేనీ ఫంక్షన్‌కి వచ్చా. ఇది కేవలం తనపై ఉన్న ప్రేమ ఒక్కటే కాదు..  మొన్న ‘అంతరిక్షం’ ట్రైలర్‌ చూశా. దానిపై ఉన్న అభిమానం, గౌరవం.. ఇంతమంచి ట్రైలర్‌ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. ఒక విజనరీతో కూడుకున్న ట్రైలర్‌. గ్రేట్‌ టీమ్‌ చాలా ప్యాషనేట్‌గా తీసిన సినిమాలాగా అనిపించింది. క్రిష్‌గారి ‘కంచె’ సినిమా ఫంక్షన్‌కి నేను వచ్చా.



ఆ తర్వాత ఆ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్‌ అయిపోయా. మళ్లీ రాజీవ్‌గారు, క్రిష్‌గారు తీసిన ఈ సినిమా ఫంక్షన్‌కి రావడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు నిర్మాతలుగా ధైర్యంగా మీరు ఇలాంటి సినిమా తీసినందుకు చాలా గర్వపడతున్నా. సంకల్ప్‌ సైజ్‌కి, విజన్‌కి సంబంధం లేదు. మనిషికన్నా గొప్పది వాళ్ల ఆలోచన. అలాంటి గ్రేట్‌ ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పటికీ దిగజారడు.. ఉన్నత స్థాయిలో ఉంటాడు. అది సినిమా ఇండస్ట్రీ అయినా, రాజకీయాలైనా. గ్రేట్‌ ఆలోచనలు ఉన్న మన డైరెక్టర్స్‌లో రాజమౌళిగారు, సుకుమార్‌గారు, క్రిష్‌గారు కావొచ్చు.. వీరికన్నా గొప్ప స్థాయికి సంకల్ప్‌ రావాలని కోరుతున్నా. వరుణ్‌ ఎప్పుడూ మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తూనే వచ్చాడు. తన ఓ సినిమా చూసి ఆనందపడ్డా.. మరికొన్ని చూసి అసూయపడ్డా.. ‘అంతరిక్షం’  ట్రైలర్‌ చూసి జెలసీ ఫీలయ్యా. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు మన వద్దకు రావు. మన డెడికేషన్, ఆలోచన తీరే మనకిష్టమైన 10 సినిమాలని కానీ, 10 మంది వ్యక్తులను కానీ దగ్గరకి చేరుస్తుంది. పాజిటివ్‌ ఆటిట్యూడ్, ఆలోచన ఉన్న వ్యక్తికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడని నేను నమ్ముతున్నా. వరుణ్‌ ఇకపైనా మంచి సినిమాలు చేస్తాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఘాజీ, అంతరిక్షం’ సినిమాలు గమనిస్తే తెలుగు సినిమాలను సంకల్ప్‌ కొత్త గమనంలోకి తీసుకెళ్తున్నాడని అర్థం అవుతోంది. క్రిష్‌–రాజీవ్‌ ఇద్దరూ కృష్ణార్జునులు. ఫ్రెష్‌ సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పానికి అభినందనలు’’ అని పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. 



చిత్ర సమర్పకుడు, డైరెక్టర్‌ క్రిష్‌ మాట్లాడుతూ– ‘‘సంకల్ప్‌ని చూసి ఓ తెలుగు సినిమా దర్శకునిగా గర్వపడుతున్నా. తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న నీ తోటి దర్శకునిగా నేనుండటం చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగు దర్శకునిగా ఎంత గర్వంగా ఫీలవుతున్నానో ‘అంతరిక్షం’ వంటి సినిమాలో భాగస్వామ్యం అయినందుకు నిర్మాతగా కూడా గర్వపడుతున్నా. సినిమా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా చాలా గర్వంగా ఫీలవుతారు. మన తెలుగువాళ్ల సినిమా అని గర్వంగా చెప్పుకునే మరో సినిమా అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత రాత్రి 10గంటలకి వరుణ్‌కి ఫోన్‌ చేశా. వెంటనే కలుసుకుని ఓ అరగంట మాట్లాడుకున్నాం. చరణ్‌ కూడా ‘రంగస్థలం’ వంటి చక్కటి కథ ఎంచుకున్నాడు. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే మీతోటి ఇంకా చాలా చాలా సినిమాలు తీయాలని కథలు రాసుకునేవారికి, డైరెక్టర్స్‌కి అనిపిస్తుంది. బ్రిలియంట్‌ యాక్టింగ్‌.. గ్రేట్‌ డైరెక్షన్‌.. సూపర్బ్‌ సినిమాటోగ్రఫీ... తెలుగు ప్రేక్షకులు, టెక్నీషియన్స్‌ అంతా గర్వంగా చెప్పుకునే సినిమా ‘అంతరిక్షం’ అవుతుంది’’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘అంతరిక్షం’ కథ విన్నాక నేను నిజంగా మోటివేట్‌ అయ్యా.. కొత్త రకం సినిమా చేద్దామని. ప్రతి ఏడాది ప్రతి వారం మన వద్దకు చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ,  ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తొలి సినిమా ‘ఘాజీ’తోనే సంకల్ప్‌ జాతీయ అవార్డు కొట్టాడు. రెండో సినిమాని కూడా అద్భుతమైన పాయింట్‌తో చక్కగా తీశాడు. తర్వాతి సినిమా అయినా నేలపై నిలబడి తీస్తావని కోరుకుంటున్నా (నవ్వుతూ). ఇలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనే డౌట్‌ ఉండేది. చరణ్‌ అన్న వద్దకు వెళ్లి డిస్కస్‌ చేస్తే నువ్వు నమ్ముకున్న కథ, డైరెక్టర్‌ కరెక్ట్‌.. ఇలాంటి సినిమా చేస్తే బావుంటుందని ఎంకరేజ్‌ చేసినందుకు థ్యాంక్స్‌. ఈ సినిమా చూసిన తర్వాత నేనొక భారతీయుడు.. నేనొక తెలుగువాణ్ణి అని మీరందరూ గర్వపడతారు’’ అన్నారు. సంకల్ప్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేను డైరెక్ట్‌ చేసిన సినిమా గురించి నేను మాట్లాడితే బాగుండదు. సినిమా విడుదల తర్వాత మీరు చూసి మాట్లాడితే బాగుంటుంది. ఈ సినిమా మీకు ఎంత తొందరగా చూపించాలా అనే ఆత్రుతగా ఉంది. వీలైతే ఇక్కడే చూపించాలనేంత ఎగై్జట్‌మెంట్‌గా ఉన్నా’’ అన్నారు. కెమెరామేన్‌ జ్ఞానశేఖర్, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ విహారి, లావణ్యా త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ, పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్, నటులు సత్యదేవ్, రాజ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement