మాస్టర్ వేణు... మాస్టర్ మూర్తి చందర్... | master murthy chander interview | Sakshi
Sakshi News home page

మాస్టర్ వేణు... మాస్టర్ మూర్తి చందర్...

Published Thu, Jun 4 2015 2:17 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

మాస్టర్ వేణు... మాస్టర్ మూర్తి చందర్...

మాస్టర్ వేణు... మాస్టర్ మూర్తి చందర్...

రోజులు మారాయి చిత్రానికి ఈ సంవత్సరం 60 వసంతాలు నిండాయి. ఆ చిత్రంలో ‘ఏరువాకా సాగాలోరన్నో చిన్నన్నా’ పాటను కేవలం డప్పు మీద స్వరపరిచారు మాస్టర్ వేణు. వారి పెద్ద కుమారుడు మూర్తి చందర్, తండ్రిగారికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు.

నేను పుట్టింది మచిలీపట్టణంలో. కాని పెరిగిందంతా మద్రాసులోనే. నేను పుట్టే సమయానికి నాన్నగారు సినిమాలలో చాలా బిజీగా ఉండేవారు. 1950 - 1960 మధ్య సినీ పరిశ్రమకు స్వర్ణయుగం. దర్శకులు, నటులు, సాహిత్యం, సంగీతం... ఒకటేమిటి అన్ని రంగాలకూ పట్టాభిషేకం జరిగిన రోజులు. సంగీత దర్శకులంతా ఎవరి శైలిలో వారు కళామతల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చారు. అందులో నాన్న కూడా. తనదైన శైలిలో పాటలు చేస్తూ పూర్తిగా పాటల రికార్డింగులో బిజీగా ఉండేవారు. ఆ పది పదిహేను సంవత్సరాలు సంగీత కళామతల్లికి స్వరార్చన నిత్యం చేశారు నాన్న.

ఆ తరవాత సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో 1965 తర్వాత ఆయనకు సినిమాలు బాగా తగ్గాయి. మూడేళ్లకో సినిమా వచ్చేది విశ్రాంతి సమయం ఎక్కువ దొరికింది. ఇంట్లోనే ఎక్కువసేపు ఉండేవారు. మాతో చక్కగా ఆడేవారు. నాన్నతో ఆడుకోవడమే మాకు మధురానుభూతి. నాన్నది పసిపిల్లవాడి తత్త్వం. ఎక్కువగా మాతో గాలిపటాలు, క్రికెట్, బొంగరాలు, కర్రబిళ్ల ఆడేవారు. ఆయనతో కలిసి ఇంగ్లీషు సినిమాలు చూసేవాళ్లం. నాన్నకి సంగీతం తప్పించి ఇంకే విషయాలూ తెలియవు. అందువల్ల మా చదువు బాధ్యత అంతా మా అమ్మగారే తీసుకున్నారు. చదువుకోమని అమ్మ చెబుతుంటే అమ్మ మీద కోపం వస్తుండేది. నాన్న మాతో సమానంగా ఆడుతుండేవారు. అందుకని నాన్నమీద ఇష్టంగా ఉండేది. కాని పెద్దయిన తర్వాత అమ్మ ఎందుకలా కేకలేసిందో అర్థమైంది.

స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీ చదువులో చేరాం. నాన్న మమ్మల్ని మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ప్రోత్సహించలేదు. నేను, తమ్ముడు భానుచందర్ ఇద్దరం బి. ఏ పూర్తి చేశాం. భాను గిటార్, నేను పియానో వాయించేవాళ్లం. నాన్నగారికి బహూకరించిన పియానో నా దగ్గరే ఉంది. దాని మీద ఇప్పటికీ నేను వాయిస్తూనే ఉంటాను. అమ్మ నన్ను మెడిసిన్ చదివించాలనుకుంది. కాని నాకు సంగీతం మీద శ్రద్ధ ఏర్పడి, మ్యూజిక్ డిప్లమా చేశాను. నాకు సహజంగా సిగ్గు బిడియం ఎక్కువ. అందువల్ల నాన్నతో స్టూడియోలకి వెళ్లేవాడిని కాను. కాని భాను మాత్రం నాన్నతో వెళ్లి, ఆయన పాటలకు గిటార్ వాయిస్తుండేవాడు. అలాగే రెండు సినిమాలకు సంగీతం కూడా చేశాడు.

నేను హోలీ ఏంజెల్స్ స్కూల్‌లో మ్యూజిక్ టీచర్‌గా  పది సంవత్సరాలు పనిచేశాను. రాజ్ కోటి ఇద్దరూ విడివిడిగా ట్యూన్‌లు చేయడం మొదలుపెట్టాక, నేను రాజ్ దగ్గర అసోసియేట్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. తమ్ముడు యాక్టింగ్ స్కూల్‌లో చేరాడు. అది కూడా అమ్మ అనుమతితోనే. నాన్నగారు వద్దని పట్టుబట్టినప్పటికీ అమ్మ పూర్తిగా ప్రోత్సహించింది. 1980లలో భానుచందర్ సినిమాల వైపు వెళ్లిపోయాడు. తరంగిణితో హిట్ అయ్యాడు. అది చూసి నాన్న సంతోషించారు. బ్రేక్ వచ్చిందని ఆనందపడ్డారు. నా గురించి ఆయనకి ఎప్పుడూ బాధగా ఉండేది. నేను ఫిలాసఫీ వైపు మొగ్గుచూపాను. వివాహం చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉండిపోయాను. జిడ్డు కృష్ణమూర్తి షౌండేషన్‌లో వలంటీర్‌గా పనిచేస్తున్నాను. ఆయన ఆంగ్లంలో ఇచ్చిన ప్రసంగాలను నేను తెలుగులో రికార్డు చేస్తున్నాను. 1981లో నాన్నగారు గతించారు. అమ్మ చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం వల్లే ఇల్లు కొనుక్కోగలిగాం.

విజయావాహినీ సంస్థలో మ్యూజిక్ ఆరేంజర్‌గా, మ్యూజిక్ కండక్టర్‌గా పనిచేశారు మాస్టర్ వేణు. ఘంటసాల సంగీతం స్వరపరచిన ‘పాతాళభైరవి’ సినిమాకి రీరికార్డింగ్ పని మాస్టర్ వేణు చేశారు. అప్పట్లో విజయా వాహినీ వారు హ్యామండ్ ఆర్గాన్ తెప్పించారు. అయితే దానిని వాడటం ఎవ్వరికీ తెలియలేదు. మా నాన్నగారు దానితో ఎక్స్‌పరిమెంట్ చేసి, పాతాళభైరవి సినిమా అంతా ఆ వాద్యంతోనే రీరికార్డింగ్ చేశారు. అదే ప్రధానమైన వాద్యపరికరం. విజయవాహినీ స్టూడియోలో మానేసి బయటకు వస్తున్న సందర్భంలో వారు, నాన్నగారికి బహుమతిగా పియానో బహూకరించారు. ఇది విజయవాహినీ వారు బహూకరించిన వాద్యం. దానిని నేను అపూరూపంగా చూసుకుంటాను. నేటికీ దాని మీద వాయిస్తుంటాను.

- మూర్తి చందర్ (మాస్టర్ వేణు పెద్ద కుమారుడు, ఫోన్ 09952926552)
- సంభాషణ, ఫొటోలు: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement