నా ప్రపంచంలోకి ఇతరులకు నో ఎంట్రీ
నా ప్రపంచంలోకి ఇతరులకు ప్రవేశం ఉండదంటున్నారు నటి మీరాజాస్మిన్. బహు భాషానటిగా గుర్తింపు పొందిన ఈ కేరళ భామ నటిగా తానేమిటో పలు చిత్రాల్లో నిరూపించుకున్నారు. అలాగే పలు చర్చనీయాంశాలకు కేంద్రబిందువుగా మారారు. దీని గురించి మీరాజాస్మిన్ స్పందిస్తూ తన గురించి చర్చ అధికంగానే జరుగుతోందని తనకు తెలుసన్నారు. అయినా అలాంటివేవీ తనను బాధించవని దృఢవిశ్వాసంతో అన్నారు. కారణం తన చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నానన్నారు. అందులోకి ఇతరులెవరికీ ప్రవేశం ఉండదని తెలిపారు.
వాస్తవం ఏమిటంటే వదంతులాంటివి ఏ కళాకారుల ఎదుగుదలను అడ్డుకోలేవన్నారు. ఇకపోతే వివాహానంతరం హీరోయిన్లు నటనకు దూరం అవుతున్నారేమిటని చాలా మంది అడుగుతున్నారన్నారు. మహిళలపై సమాజం దృష్టే కారణం అన్నారు. సంఘం స్త్రీలను షోకేస్ బొమ్మలుగానే చూస్తోందని అన్నారు. సినిమాలో కథానాయికలు కథానాయకులతో కలిసి చెట్లు,పుట్టలు తిరుగుతూ పాడడం,వారిని ప్రేమించడం మినహా వేరే పనే ఉండదన్నారు.
కథానాయకుల పరిస్థితి అలా ఉండదు. వారికి పెళ్లి అయినా, పిల్లలు పుట్టినా, వయసు మళ్లినా హీరోలుగా ఎదుగుతూనే ఉంటారని అన్నారు. హీరోయిన్లను మాత్రం పెళ్లి కాగానే పక్కన పెట్టేస్తారని, ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఒక కారణం కావచ్చునని పేర్కొన్నారు. అయితే తన వరకూ కుటుంబ సహకారం పూర్తిగా ఉందని చెప్పారు. మారుతున్న కాలంతో పాటు సినిమా, కళాకారులే కాదు సమాజం మారాల్సిన అవసరం ఉందన్నారు. కాలానుగుణంగా స్త్రీల గురించి సమాజం దృష్టి మారినప్పుడే హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు రూపొందుతాయని మీరాజాస్మిన్ అంటున్నారు.