పీకే పోస్టర్ లో అసభ్యతా.. ఎక్కడా?
జోథ్ పూర్: తాను విడుదల చేసిన పీకే(ప్యార్కే) పోస్టర్ లో అశ్లీలత ఏమీ లేదని ఆ సినిమా హీరో అమీర్ ఖాన్ తెలిపాడు. ఈ మధ్య విడుదల చేసిన ఆ సినిమా పోస్టర్ లో అమీర్ నగ్నంగా ఫోజులివ్వడంతో అది వివాదాలకు దారి తీసింది. దీనిపై శనివారం మాట్లాడిన అమీర్.. ఆ పోస్టర్ లో అశ్లీలత అనేది ఏమీ లేదని పేర్కొన్నాడు. 'నేను నటించిన ఈ సినిమాను ప్రజలు చూస్తారు. అందులో ఉన్న వాస్తవాన్ని వారే గ్రహిస్తారు' అని అమీర్ స్పష్టం చేశాడు. ముందుగానే పీకే చిత్రంపై తాను అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని తెలిపాడు. అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తన కెరీర్ కే ఒక సవాల్ వంటిందని అమీర్ అన్నాడు. పీకే సినిమా తన భవిష్యత్తుపైనే కాకుండా తాను చేసే పనిపై కూడా కచ్చితంగా ప్రభావం చూపుతుందన్నాడు.
ఈ సినిమా వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు ఈ మధ్యనే తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ సగ్నత్వం ప్రదర్శించారని సినిమా నిర్మాతపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలలో జోక్యం పనికిరాదని కోర్టు పేర్కొంది. ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు సలహా ఇచ్చింది.