బాలీవుడ్‌పై దృష్టి: సంగీత దర్శకుడు
మహానంది(కర్నూలు): తెలుగు సినిమా రంగంపై కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధానిలు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు.
దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 60 తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించానని, ఏడాది వరకు ఖాళీ లేదన్నారు. తెలుగులో నటించిన శీను..వాసంతి..లక్ష్మి, బ్రోకర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించిందన్నారు. అలాగే మనలో ఒకడు చిత్రంలో వేసిన పాత్రకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి మృతి చిత్రరంగానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.