చరిత్ర చెప్పిన... ‘రుద్రమదేవి’కథ | Rudrama devi history | Sakshi
Sakshi News home page

చరిత్ర చెప్పిన... ‘రుద్రమదేవి’కథ

Published Fri, Oct 9 2015 7:34 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

చరిత్ర చెప్పిన... ‘రుద్రమదేవి’కథ

చరిత్ర చెప్పిన... ‘రుద్రమదేవి’కథ

మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పాలించిన ఆమె గురించి చరిత్రలో చాలా వివరాలున్నాయి. దర్శక - నిర్మాత గుణశేఖర్ తన రీసెర్చ్ బృందం సాయంతో, చరిత్రను జాగ్రత్తగా పరిశీలించి ‘రుద్రమదేవి’ సినిమా తీశారు. ప్రముఖ చారిత్రక పరిశోధకులు - పండితులు ముదిగొండ శివప్రసాద్ సారథ్యంలో రచయితలు విపంచి (తోట ప్రసాద్), ఎమ్బీయస్ ప్రసాద్, మధుబాబు తదితరులు పురాతన గ్రంథాలు, శాసనాల ఆధారంగా స్క్రిప్టు రచనకు సహకరించారు. అక్కడక్కడా సినిమాకు కావాల్సిన స్వాతంత్య్రం తీసుకున్నా... ప్రధానంగా చరిత్రకు కట్టుబడే ఈ సినిమాను తీసినట్లు గుణశేఖర్ ప్రకటించారు.

ఇంతకీ  చరిత్రలో ఏముందంటే...
తెలుగుదేశ చరిత్రలోనే కాదు... యావత్ దక్షిణదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ ఘట్టం - కాకతీయ యుగం. మన తెలుగు జాతి చరిత్రను గమనిస్తే - కాకతీయ సామ్రాజ్యం, కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం. శాతవాహనుల తరువాత తెలుగు దేశాన్నీ, జాతినీ ఒక్క తాటి మీదకు తెచ్చిన రాజవంశీయులు కాకతీయులు. సుమారు మూడు శతాబ్దాలు వారు తెలుగునాడు మొత్తాన్నీ ఒకే పరిపాలన కిందకు తెచ్చి, పటిష్ఠమైన పాలన అందించి, ప్రాంతీయ, రాజకీయ అభిమానాల్ని తొలగించారు.

ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల లాగా, దక్షిణ భారతంలో హైందవ సంస్కృతీ పరిరక్షణకు ప్రాణాలొడ్డింది వారే. తమ తరువాత వచ్చిన రెడ్డి రాజులకూ, విజయనగర పాలకులకూ వారే మార్గదర్శకులు. అప్పట్లో ‘ఆంధ్రనగరి’గా పేరొందిన ఓరుగల్లు (ఇప్పటి వరంగల్) రాజధానిగా ఒరిస్సా నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ దాకా కాకతీయుల పాలన విస్తరించింది. అలాంటి కాకతీయ సామ్రాజ్యంలో పేరున్న పరిపాలకురాలు - రుద్రమదేవి.
 
రుద్రమదేవికి ముందు...
రుద్రమదేవికి ముందు ప్రసిద్ధులైన కాకతీయుల్లో మహాప్రరాక్రమశాలి, రాజనీతిజ్ఞుడు రుద్రదేవుడు (క్రీ.శ. 1158 - 1195) మొదటివాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని నిజంగా స్థాపించింది ఆయనే. పల్నాటి యుద్ధంలో నలగామునికి సాయం చేసింది ఈ కాకతి రుద్రుడే. ఆయన విజయయాత్రల వల్లే మొత్తం తెలంగాణ, కోస్తా ఆంధ్ర దేశమంతా కాకతీయుల వశమైంది. రుద్రదేవుడికి పిల్లలు లేకపోవడం వల్ల సోదరుడు మహదేవుడు రాజయ్యాడు. కానీ, నాలుగేళ్ళకే మరణించాడు. అటు తరువాత మహదేవుడి కుమారుడు గణపతి దేవుడు (క్రీ.శ. 1199 - 1262) రాజయ్యాడు.

విపత్కర పరిస్థితుల్లో రాజ్యాధికారం సంక్రమించిన గణపతిదేవుడు మహావీరుడు, రాజనీతిపరుడు. దాయాదుల దండయాత్రతో అధికారం కోల్పోయిన నెల్లూరు తెలుగు చోడరాజ్యాధిపతి మనుమసిద్ధి అప్పట్లో గణపతిదేవుని సాయం కోరాడు. ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజిని రాయబారిగా పంపాడు. అప్పుడు గణపతిదేవుడే స్వయంగా సైన్యంతో వెళ్ళి, శత్రువుల్ని ఓడించి, మనుమసిద్ధిని సింహాసనం ఎక్కించాడు.
 
అధికారం చేపట్టిన తొలి మహిళ
తెలుగు రాజ్య సమైక్యతను సాధించిన గణపతిదేవుడికి కుమారులు లేరు. దాంతో, రెండో కూతురైన రుద్రమదేవికి వీరోచిత విద్యలు నేర్పి, వారసురాలిగా ప్రకటించాడు. ఆ ఏర్పాటు రాజవంశీకులకు నచ్చలేదు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. అయినా, రుద్రమదేవి రాజ్యాధికారం స్వీకరించింది.

మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. ఆమె కష్టాలకు అదే కారణమైంది. ఈ ఆధునిక 21వ శతాబ్దంలోనే మహిళలకు రాజ్యాధికారం ఇవ్వడానికీ, ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కు దిక్కూ దివాణం లేకపోతే, దాదాపు 750 ఏళ్ళ క్రితం పురుషాధిక్యతకు ఎదురే లేని ఆ కాలంలో ఆమె ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె పాలనా కాలమంతా ప్రధానంగా యుద్ధాలతో గడిచిపోయింది. పలువురు సామంతులు తిరుగుబాటు చేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.

రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించడాన్ని దాయాదులైన హరహర, మురారిదేవులు ప్రతిఘటించారు. తిరుగుబాటు చేశారు. కానీ, విశ్వాసపాత్రులైన రేచర్ల ప్రసాదిత్యుడు, కాయస్థ జన్నిగదేవుడు, గోన గన్నారెడ్డి మొదలైన సేనానుల సాయంతో తిరుగుబాటును ఆమె అణచివేసింది. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు (ఆనాటి నిరవద్యప్రోలు) పాలకుడైన చాళుక్య వీరభద్రుడికీ, రుద్రమదేవికీ వివాహం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
 
విదేశీయులూ మెచ్చిన పాలన!
నిరంతరం యుద్ధాల్లో మునిగితేలినా, పరిపాలనను రుద్రమదేవి నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లును శత్రు దుర్భేద్యం చేయడానికి మట్టి కోటకు కందకాలు, బురుజులు నిర్మించింది. రాతికోటను పటిష్ఠం చేసింది. ఇటలీ దేశ నౌకా యాత్రికుడైన మార్కోపోలో ఆమె పాలనా కాలంలోనే తెలుగునాడును సందర్శించాడు. దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందనీ, పరిశ్రమలు - వాణిజ్యం ఉన్నత స్థితిలో ఉన్నాయనీ, దేశం సుభిక్షంగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా, రుద్రమదేవిని గొప్ప వ్యక్తిగా కీర్తించాడు. మహమ్మదీయ చరిత్రకారులైన అమీర్ ఖుస్రూ, బర్నీ రచనలు కూడా కాకతీయుల కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తాయి.
 
రుద్రమదేవితరువాత...
రుద్రమదేవికి కూడా ముగ్గురూ కుమార్తెలే. మూడో కుమార్తె ముమ్మిడమ్మకూ, మహదేవరాజుకూ కలిగిన బిడ్డ - ప్రతాపరుద్రుడు. ఆ బాలుణ్ణి రుద్రమదేవి దత్తత తీసుకుంది. ఆమె అనంతరం యువరాజు ప్రతాపరుద్రుడే రాజయ్యాడు. అతని పాలనలో కాకతీయ రాజ్యం ఉన్నత స్థితికి చేరింది. ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ వంశం అంతరించింది. తెలుగునేల తురుష్కుల పాలనలోకి వచ్చింది. ‘ఆంధ్రనగరి’గా పేరున్న ఓరుగల్లు కాస్తా సుల్తాన్‌పూర్‌గా మారింది.
 
ప్రసిద్ధ నిర్మాణాలు.. ప్రముఖమైన రచనలు...
రాయచూరు, రాచకొండ, గోల్కొండ, దేవరకొండ దుర్గాలు, మూడు రక్షణ శ్రేణులతో కూడిన ఓరుగల్లు కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి నిదర్శనం. హనుమకొండలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు ప్రతిష్ఠితులై, త్రికూటాలయంగా విలసిల్లిన వేయిస్తంభాల గుడి, వివిధ శిల్పాలతో అలంకరించిన స్తంభాలు, (కాకతీయుల) తోరణ స్తంభాలు వారు కట్టించినవే. రామప్ప చెరువుతో సహా వాళ్ళు తవ్వించిన తటాకాలు ఎన్నో.

అలాగే, విజయనగర రాజుల కాలం నాటి తెలుగు సాహిత్య స్వర్ణయుగానికి కాకతీయుల కాలంలోనే పునాది పడింది. మొదట జైన మతం, ఆ తరువాత వీరశైవం, వైష్ణవమతం అభివృద్ధి చెందిన ఆ రోజుల్లోనే శైవ కవులైన పండితారాధ్యుడు, పాల్కురికి సోమన తెలుగులో రచనలు చేశారు. కేతన రాసిన తెలుగు వ్యాకరణ గ్రంథం ‘ఆంధ్ర భాషా భూషణం’, బద్దెన రాసిన సుమతీ శతకం, తిక్కన మహాభారత అనువాదం, వినుకొండ వల్లభరాయుడి ‘క్రీడాభిరామం’ లాంటివన్నీ అప్పుడు వచ్చిన రచనలే. అలా తెలుగుభాషాభివృద్ధికి కాకతీయులు చేసిన సేవ విశిష్టమైనది.  

-రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement