నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి | Shruti Haasan spends time with father Kamal Haasan | Sakshi
Sakshi News home page

నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి

Published Tue, Nov 4 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి

నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి

కమల్‌హాసన్, శ్రుతిహాసన్ ఇద్దరూ సినిమాలతో ఫుల్ బిజీ. ఈ కారణంగా ఇద్దరూ రోజులు తరబడి కలుసుకోలేని పరిస్థితి. అయినా సరే... కూతురి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటారట కమల్. స్వతంత్రభావాలతో పెరిగిన ఆయన... తన బిడ్డలను కూడా అలాగే పెంచారు. తండ్రి సహాయం లేకుండానే శ్రుతి టాప్ హీరోయిన్ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఈ టాపిక్ దేనికి? అనుకుంటున్నారా! విశేషమేంటంటే, చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఈ తండ్రీకూతురూ.. చెన్నయ్ పురవీధుల్లో అర్ధరాత్రి హెల్మెట్లు పెట్టుకొని మరీ షికార్లు చేశారు. ఈ విషయాన్ని శ్రుతీనే తెలియజేశారు. ‘‘నాన్నను కలిసి చాలా రోజులైంది.
 
 ఓ సినిమా వేడుకకు ఇటీవలే చెన్నయ్ వెళ్లాను. పనిలో పనిగా నాన్నను కలిసి సర్‌ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్తే ఆయన లేరు. చాలా బాధేసింది. చేసేది లేక... నాన్నకు ఫోన్ చేశాను. ఆళ్వార్‌పేట ఆఫీస్‌లో ఉన్నానని చెప్పారు. అది నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆఫీస్. అక్కడికెళ్లాను. నన్ను చూడగానే నాన్న కళ్లలో నీళ్లు తిరిగాయి. నాక్కూడా. నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఎత్తుకున్నంత పనిచేశారు. చాలాసేపు ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం. టైమ్ పన్నెండు దాటిపోయింది. సరదాగా బయటకెళ్దామా అన్నారు నాన్న. నేను కూడా ‘ఓకే’ అన్నాను. కారు తీస్తారనుకున్నా. కానీ ఆయన బైక్ తీశారు. ఇద్దరం హెల్మెట్లు పెట్టుకున్నాం. చెన్నయ్ వీధుల్లో సరదాగా తిరిగాం. నాన్నతో ఆ షికారు నా జీవితంలోనే మరచిపోలేని అనుభూతిని పంచింది!’’ అంటూ గుర్తు చేసుకున్నారు శ్రుతీహాసన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement