గగనపు వీధి వీధిలో!
‘‘మేం నేల మీద ప్రమోట్ చేస్తాం.. అవసరమైతే నింగిలోనూ ప్రమోట్ చేస్తాం... రజనీరా... ఇక్కడ రజనీరా చూడరా...’’ అని సూపర్ స్టార్ అభిమానులు కొత్త డైలాగ్ చెబుతున్నారు. అవును మరి.. రజనీ తాజా చిత్రం ‘2.0’ (‘రోబో’ సీక్వెల్) ప్రమోషన్‌ని ఆకాశానికెత్తేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.
దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పబ్లిసిటీని కూడా అదిరిపోయేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ఏకంగా వంద అడుగుల హాట్ ఎయిర్ బెలూన్‌ని తయారు చేయించారు. బాసూ... ఈ బెలూన్ ఇండియాకే పరిమితం కాదు. విదేశాలు వెళుతుంది తెలుసా! ‘‘మేం మా ‘2.0’ని హాలీవుడ్ సినిమాలా చూస్తున్నాం. అందుకే విదేశాల్లోనూ ఈ బెలూన్‌ని ప్రదర్శించాలనుకుంటున్నాం. ప్రపంచంవ్యాప్తంగా జరిగే బెలూన్ ఫెస్టివల్స్‌కీ మా ‘2.0’ బెలూన్‌ని పంపిస్తాం. బెలూన్ టెస్టింగ్ కూడా అయిపోయింది.
ఇక వాతావరణం అనుకూలించాలి’’ అని లైకా సంస్థ ప్రతినిధి రాజు మహాలింగం పేర్కొన్నారు. విదేశాల్లో లండన్, దుబాయ్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్‌కోల్లో ఈ బెలూన్ కనువిందు చేయనుంది. ప్రమోషన్ విషయంలో ఈ టీమ్ రాజీపడాలనుకోవడంలేదు. దుబాయ్‌లో 25 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రం ఆడియో వేడుకను జరపాలనుకుంటున్నారట. రజనీకాంత్, అమీజాక్సన్ జంటగా అక్షయ్‌కుమార్ విలన్‌గా శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.