చీకటి వైద్యం | Web series special on lakho me ek | Sakshi
Sakshi News home page

చీకటి వైద్యం

Published Sat, May 4 2019 12:25 AM | Last Updated on Sat, May 4 2019 12:25 AM

Web series special on lakho me ek - Sakshi

కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.కన్ను విప్పార్చి చూసినా కనపడని వెలుతురు.ఈ దేశంలో ఏ మూల అయినా ఇప్పుడు వెతక్కుండానే దొరికే నలుపు.మనిషి తన అవినీతికి దేన్నైనా పునాది చేసుకోవచ్చుగాని ఎదుటి మనిషి ఆరోగ్యాన్ని కాదు.స్టెతస్కోప్‌ ఒక విషపురుగు. ఆపరేషన్‌ గదే యమపురి.దీనిని అడ్డుకోవాలి.  దీనిపై నిఘా ఉంచాలి. దీని నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకు దీనిని ఎదిరించేవారికి తోడుగా నిలవాలి.వెబ్‌ మూవీ ‘లాఖో మే ఏక్‌’ చెప్తున్న కథ అదే.

2016, జూన్‌.. హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో పదమూడు కాటరాక్ట్‌ ఆపరేషన్స్‌ జరిగాయి గుర్తుందా? అందులో ఆరుగురికి చూపు పోయింది. ఆపరేషన్‌ జరిగిన వెంటనే తలెత్తిన ఇన్ఫెక్షన్‌వల్ల. ఈ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుబులు పుట్టించింది. ప్రభుత్వాసుపత్రుల పనివిధానం మీద మరోసారి చర్చపెట్టింది. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తలో లక్షరూపాయలు పరిహారం ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సిఫారసు చేసింది. ఈ సంఘటనే ‘‘లాఖో మే ఏక్‌’’ అనే వెబ్‌సిరీస్‌ సెకండ్‌ సీజన్‌కు  లైన్‌.. ప్లాట్‌.. థీమ్‌ అన్నీ!

ఆ కథలోకి.. 
శ్రేయా పథారే.. గ్రామీణ సేవలను ఇష్టంగా ఎంచుకున్న జూనియర్‌ డాక్టర్‌. ఓ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తూంటుంది. ఆ ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌.. డాక్టర్‌ గోపాల్‌ పట్వర్థన్‌. ఆ హాస్పిటల్‌కు మందులు సప్లయ్‌ చేసే ఫార్మాకాంట్రాక్టర్‌కు కొన్ని నెలల పాతబకాయీలు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం. పాత బకాయీలు చెల్లించే వరకు కొత్త ఇండెంట్ల డెలివరీ ఆపమని, మిగతా ఫార్మా కాంట్రాక్టర్స్‌ ఎవరూ సప్లయ్‌ చేయకుండా సమ్మెకు దిగమని ఆ కాంట్రాక్టర్‌ను బలవంతపెడ్తాడు స్థానిక (ప్రతిపక్ష) ఎమ్మెల్యే. లాభాపేక్షతో  సమ్మెకు దిగుతారు ఆ ప్రాంతంలోని ఫార్మా కాంట్రాక్టర్లు. ఆ జిల్లాలో కాటరాక్ట్‌ ఆపరేషన్ల టార్గెట్‌ మిగిలిపోవడంతో ఎలక్షన్ల తేదీ ప్రకటించేలోపు పూర్తిచేయమని సీఎమ్‌ఓ డాక్టర్‌ గోపాల్‌ పట్వర్థన్‌కు ఆర్డర్‌ అందుతుంది. ఆ క్యాంప్‌ నిర్వహణ  బాధ్యతను డాక్టర్‌ శ్రేయా పథారేకు అప్పజెప్తాడు సీఎమ్‌ఓ.  

అన్నిటికీ దూరం..
 మారుమూల పల్లె సీత్లాపూర్‌లో క్యాంప్‌. ఆ ఊళ్లో పేరుకే  నాలుగు పడకల సర్కారు దవాఖానా.  శ్రేయా కన్నా సీనియర్‌ డాక్టర్, ఇద్దరు కంపౌండర్లు, ఇద్దరు నర్సులూ ఉంటారు. ఆ సీనియర్‌  మూడేళ్ల కిందటే ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌ పెట్టుకుని... ఎప్పుడొస్తే అప్పుడు బదిలీపై వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆసుపత్రికి సంబంధించిన ఒక్క కన్సల్టేషన్‌ గది తప్ప మిగిలినవేవీ వాడకంలో ఉండవు. వెళ్లిన రోజు నుంచే క్యాంప్‌ కోసం కసరత్తు మొదలుపెడ్తుంది శ్రేయ. అక్కడున్న వైద్య సిబ్బంది ఎవరూ సహకరించరు. అయినా పట్టువదలదు ఆమె. వైద్యం కోసం ఆ ఆసుపత్రికి ఎవరూ రారు. అంతా గందరగోళంగా అనిపిస్తుంది శ్రేయకు.  
ప్రైవేట్‌ వైద్యం
కంపౌండర్‌ భోలా సహాయంతో క్యాంప్‌ గురించి పాంఫ్లెట్స్‌ పంచుతుంది శ్రేయ. ఎవరూ పట్టించుకోరు. బాధేస్తుంది ఆమెకు. ఆ ఊరి ప్రజలు అమితంగా గౌరవించే జానపద వృద్ధ కళాకారుడిని కలుస్తుంది. కాటరాక్ట్‌ క్యాంప్‌ గురించి చెప్తుంది. అప్పటిదాకా సాదరంగా మాట్లాడిన అతను ఆమె ఈ విషయం చెప్పగానే నమస్కారం పెడ్తాడు ఇక దయచేయమన్నట్టు. అవమానంతో వెనుదిరుగుతుంది. దార్లో ఓ క్లినిక్‌ కనపడితే వెళ్లి.. అందులో డాక్టర్‌గా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని కలుస్తుంది. మెడికల్‌ సైన్స్‌ మీద అవగాహన లేమి, మూఢనమ్మకాల మీద విపరీతమైన భక్తిశ్రద్ధలున్న ఆ ఊరి ప్రజల అజ్ఞానం, అమాయకత్వం ఆసరాతో తనకు వచ్చీరాని వైద్యం చేస్తుంటాడు ఆ వ్యక్తి. అతని టేబుల్‌మీదున్న మందుల సీసాలను చూసి బెదిరిపోతుంది శ్రేయ. ‘‘ఇదేంటి? స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు? ఇవి ఇవ్వకూడదు’’ అంటూ అతనితో వాదనకు దిగుతుంది. పోలీసులకు ఫిర్యాదూ చేస్తుంది. ఆ వ్యక్తిని తమ దైవంగా కొలుస్తున్న ఆ ఊరి జనమంతా ఒక్కటై శ్రేయ మీద దాడికి వస్తారు. సర్కార్‌ దవాఖానాలోని సీనియర్‌ డాక్టర్‌.. ఆమెను కాపాడుతాడు. తమ డాక్టర్‌కు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తారు జనం. చెప్తుంది శ్రేయ. అప్పుడు  ఆమెకు ఆ ఊరి చిత్రం పూర్తిగా అర్థమవుతుంది. ఇంకోవైపు క్యాంప్‌ ఆర్గనైజేషన్‌ గురించి సీఎమ్‌వో ఒత్తిడీ పెరుగుతుంది. ఇక తనవల్ల కాదని.. ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది శ్రేయ. నర్సులు, కంపౌండర్లు సహా సీనియర్‌ డాక్టర్‌ కూడా ఆమెకు అదే సలహా ఇస్తుంటారు మొదటినుంచీ. 

ఆ రాత్రి..
 తెల్లవారి ప్రయాణానికి సర్దుకుంటూండగా.. తన బస ముందే పెళ్లి బారాత్‌ సందడి వినిపిస్తుంది. కిటికీలోంచి చూస్తూంది శ్రేయ.  ఒకతను డ్యాన్స్‌ చేస్తూ చేస్తూ పడిపోతాడు. కాలికి ఏదో గుచ్చుకుని గాయం అవుతుంది. ఒకటే రక్తస్రావం. ఆ బారాత్‌లో ఆ ఊరు వాళ్లు నమ్మే డాక్టర్‌ ఉంటాడు. అతను ఆ గాయాన్ని చూసి బెంబేలెత్తుతాడు. ఆ రక్తస్రావాన్ని ఎలా ఆపాలో తెలియక పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు. అవేవీ ఫలించక  రక్త స్రావం ఎక్కువవుతుందే తప్ప తగ్గదు. కిటికీలోంచి ఇదంతా చూసి ‘‘నాకెందుకులే’’ అని తొలుత పట్టించుకోదు. కాని పరిస్థితి సీరియస్‌ అవుతుంటే పరిగెడ్తుంది. భోలా.. నర్సుల సహాయంతో గాయం అయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుంది. దవాఖానాలోని సీనియర్‌ డాక్టర్‌తో కలిసి చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి గట్టెక్కిస్తారు ఆ వ్యక్తిని. ఆ క్షణం నుంచే శ్రేయ మీద గౌరవం, ఆ ఆసుపత్రి మీద నమ్మకం కలుగుతుంది ఆ ప్రజలకు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయాణాన్ని రద్దు చేసుకుంటుంది శ్రేయ. తెల్లవారినప్పటి నుంచి సర్కారు దవాఖాన ముందు జనాల క్యూ స్టార్ట్‌ అవుతుంది. 

క్యాంప్‌.. 
క్యాంప్‌ కోసం మళ్లీ క్యాంపెయిన్‌ ప్రారంభిస్తుంది. ఈసారి పేషంట్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు పేర్లు నమోదు చేసుకోవడానికి. అప్పుడే అక్కడున్న సీనియర్‌ డాక్టర్‌కు ట్రాన్స్‌ఫర్‌ వస్తుంది. ఓ విషాదమూ జరుగుతుంది. జానపద వృద్ధ కళాకారుడి మనవడికి ఆ ఊరి డాక్టర్‌ (అని పిలిపించుకునే) చేసే వైద్యం వల్ల జ్వరం తగ్గకపోగా  ప్రాణంమీదకు వస్తుంది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు డాక్టర్‌ శ్రేయను ఆశ్రయిస్తారు. ఫార్మా కాంట్రాక్టర్ల సమ్మె వల్ల ఊరి డిస్పెన్సరీలో మందులు ఉండవు. వెంటనే ట్రీట్మెంట్‌ అందకపోతే పిల్లాడు బతకడని.. గత్యంతరంలేక బ్లాక్‌లో అమ్ముతున్న మెడిసిన్‌ తెప్పిస్తుంది శ్రేయ. దాంతో ఫస్ట్‌ఎయిడ్‌ చేసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా  జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో  మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతాడు ఆ పిల్లాడు. దాంతో ప్రజలకు తమ ఊరి వైద్యుడి మీద పూర్తిగా విశ్వాసం పోతుంది. సర్కారు డాక్టర్లను దైవంగా కొలవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే క్యాంప్‌ ఏర్పాట్ల వేగం పెంచుతుంది శ్రేయ. కంటి ఆపరేషన్లకు అంతా సిద్ధమవుతుంది. మందులు తప్ప. ఆ విషయమే సీఎమ్‌వోకి తెలియజేస్తుంది శ్రేయ. ఈలోపు సమ్మె విజయవంతం కాకపోగా స్టాక్‌ అంతా ఎక్స్‌పైర్‌ అవుతుంది. కంగారుపడ్డ ఫార్మా కాంట్రాక్టర్‌... సీఎమ్‌వోతో రాజీ కుదుర్చుకుంటాడు. ఎక్స్‌పైరీ డేట్‌ కనపడకుండా కొత్త లేబుల్‌ అతికించి స్టాక్‌నంతా క్లియర్‌ చేసుకుంటాడు ఫార్మాకాంట్రాక్టర్‌. వాటిల్లోంచే సీత్లాపూర్‌ గవర్నమెంట్‌ డిస్పెన్సరీకి సప్లై అవుతాయి. అందులో కాటరాక్ట్‌ ఆపరేషన్స్‌కు వాడిన సెలైన్‌ బాటిల్సూ ఉంటాయి. క్యాంప్‌ సక్సెస్‌ అయినందుకు ఆ రాత్రి శ్రేయ అండ్‌ టీమ్‌ పార్టీ కూడా చేసుకుంటారు. 

అయితే.. 
అర్ధరాత్రి దాటాక ఆపరేషన్‌ అయిన ఓ వ్యక్తికి కన్ను ఎర్రబడి.. నొప్పి మొదలువుతుంది. తెల్లవారే సరికి మరో పదిహేనుమంది పరిస్థితీ అలాగే ఉంటుంది. హుటాహుటిన వాళ్లను జిల్లా ఆసుపత్రికి తరలిస్తారు శ్రేయ, కంటి డాక్టర్‌. ఈ సంగతి ఊర్లో తెలిసి సర్కారు దవాఖాన మీదకు దాడికి వస్తారు రాళ్లతో. మందుల బ్లాక్‌ మార్కెటింగ్‌లో ఆ దవాఖానాకు చెందిన కంపౌండర్లూ ఉంటారు. వాళ్లు రిజిష్టర్‌ను మాయం చేస్తారు. కాటరాక్ట్‌ క్యాంప్‌ ఫెయిల్‌ అయిందనే వార్త మీడియాకు అంది క్షణాల్లో సెన్సేషన్‌ అవుతుంది. దీనికంతటికీ డాక్టర్‌ శ్రేయా పథారే కారణమనీ వార్తలు అల్లుతారు. మంత్రికి తెలిసి అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తాడు. కమిటీ ముందు జవాబు చెప్పేందుకు టెస్టిమోనీ తయారు చేస్తాడు సీఎమ్‌వో ఆధారాలేవీ దొరక్కుండా. శ్రేయాతో బలవంతంగా సైన్‌ చేయిస్తారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ లేకపోవడంతో అందులో వైద్యసిబ్బంది తప్పేమీలేదని తేలుస్తుంది కమిటీ. పదహారు మంది కంటి చూపు కోల్పోతారు. ఆ తప్పిదానికి ఎవరూ బాధ్యత తీసుకోకపోవడం శ్రేయాను కలిచివేస్తుంది. ఎంత కష్టపడి వాళ్ల నమ్మకాన్ని సాధించింది తను? అంతా గంగలో కలిసిపోయింది. మళ్లీ ఆ స్టెరాయిడ్స్‌ ఇచ్చే వ్యక్తులే డాక్టర్లుగా ఊళ్లేలుతుంటారు. సర్కారు దవాఖానా అంటేనే జనాలు జడుసుకుని పారిపోతారు. ఇలా జరగడానికి వీల్లేదు. బాధ్యత తీసుకోవాలి.. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ రోజు ఆపరేషన్‌కు ఉపయోగించిన మెడిసిన్‌ లిస్ట్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది.. గడువు అయిపోయినవి వాడినట్టు, అవి జిల్లా ఆసుపత్రి నుంచే క్యాంప్‌కి సప్లయ్‌ అయినట్టు. తెల్లవారి కమిటీ ముందు చెప్తుంది. మందుల బ్లాక్‌ మార్కెటింగ్‌ గురించి కూడా. వెంటనే సీఎమ్‌వో.. సీత్లాపూర్‌లో చనిపోయిన పిల్లాడి విషయంలో డాక్టర్‌ శ్రేయా కూడా బ్లాక్‌లో మందులు కొన్న విషయాన్ని గుర్తుచేసి ఆ రిసీట్‌ కూడా కమిటీ ముందు పెడ్తాడు. గవర్నమెంట్‌ డాక్టర్‌ అయ్యుండీ బ్లాక్‌ మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం నేరమని.. ఈ ప్రవృత్తే ఆ పేషంట్ల అంధత్వానికి కారణమైందని.. డాక్టర్‌ శ్రేయ పథారేను  దోషిగా నిలబెడ్తుంది కమిటీ. ఇదీ లాఖో మే ఏక్‌ .. కహానీ. అమేజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. లాఖ్‌ మే ఏక్‌ ఫస్ట్‌ సీజన్‌..  అస్తవ్యస్తమెన విద్యావిధానానికి చురకలు పెడితే సెకండ్‌ సీజన్‌.. వైద్యవిధానంలోని అవినీతిని బయట పెడుతుంది. 
– సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement