ప్రేక్షకులతో సెల్ఫీ కోసం...
‘‘సెల్ఫీల వలన మంచి, చెడు రెండూ జరుగుతాయి. మా హీరోకి సెల్ఫీ అంటే వీక్‌నెస్. నోటి దురుసు వలన అతనికి వచ్చిన సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించాడు? అనేది చిత్రం ఇతివృత్తం. టైటిల్‌కి తగ్గట్టు నరేశ్ పాత్ర, చిత్రం కొత్తగా ఉంటాయి’’ అని దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్ఫీ రాజా’. సాక్షీ చౌదరి, కామ్నా రానావత్ కథానాయి కలు. రామబ్రహ్మం సుంకర సమర్పణలో చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించారు. సాయికార్తీక్ స్వరకర్త. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ చిత్రంలోని మొదటి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ -‘‘సమస్యల నుంచి గట్టెక్కడానికి సెల్ఫీరాజా రకరకాల వేషాలు వేస్తుంటాడు. ఈ చిత్రంలో స్పూఫ్‌లు లేవు. నాన్నగారితో ‘నేటిగాంధి’ తీసిన గోపీఆర్ట్స్ సంస్థలో హిట్ సాధించాలని ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేశారు’’ అన్నారు. ‘‘ఈ నెల 8న విశాఖలో రెండో పాటను, 9న విజయవాడలో మూడో పాటను, 10న వరంగల్‌లో నాల్గవ పాటను విడుదల చేస్తున్నాం. చిత్ర బృందం ప్రేక్షకులతో సెల్ఫీలు తీసుకుంటారు’’ అని నిర్మాతలు అన్నారు. సాక్షీ చౌదరి, నాగినీడు, సాయికార్తీక్, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు, వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.