గుర్గాం: దారుణమైన లైంగిక దాడి.... ఆపై చికిత్సకోసం గంటల తరబడి నిరీక్షణ.... మరోవైపు తీవ్రగాయాలతో అయిదు సం.రాల పసిపాప బతుకు పోరాటం.. వెరసి ఒక కుటుంబానికి అంతులేని ఆవేదన....తీవ్ర మానసిక క్షోభ. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో, ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ప్రాంతంలోనో జరగలేదు.. సాక్షాత్తూ దేశరాజధానికి సమీపంలోని పారిశ్రామిక నగరం గుర్గాంలో గత ఆదివారం జరిగింది. ఈ సంఘటనతో దేశంలో పసిపిల్లలు, మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. అత్యాచారానికి గురైన అయిదేళ్ల పాప, చికిత్స కోసం దాదాపు ఆరుగంటలు పాటు నరకాన్ని అనుభవించింది. తీవ్ర గాయాలతో, బాధతో మెలికలు తిరుగుతున్న చిన్నారితో దాదాపు ఆరు గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది ఆ కుటుంబం.
వివరాల్లోకి వెడితే గుర్గాం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబ అయిదేళ్ల చిన్నారితో కలిసి ఫంక్షన్కు వెళ్లింది. తమ పాప అదృశ్యమైన సంగతిని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు శర్మా యాదవ్ అనే దుర్మార్గుడు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతగాణ్ని ఒక మహిళ నిలదీయగా.. మా బంధువులమ్మాయని నమ్మించడానికి ప్రయత్నించాడు. కానీ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను గమనించిన ఆ మహిళ ఆ నీచుణ్ని పోలీసులకు అప్పగించింది. పాపను గుర్గాం లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. . దీంతో తమ పాప ఆసుపత్రిలో ఉన్న విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు తల్లిదండ్రులు.
అయితే ఇక్కడే అసలు ఘోరం జరిగింది. తమ దగ్గర సౌకర్యాలు, డాక్టర్లు లేరంటూ పాపకు చికిత్స చేయడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించుకున్నారు. బాలిక పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో దారిలో మరో ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. చివరికి విధిలేని పరిస్థితిలో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. తరువాత అయిదు గంటల పాటు శస్త్రచికిత్స చేస్తే తప్ప బాలిక ప్రాణాలు దక్కలేదు.
అత్యాచార కేసుల్లో కీలకమైన వైద్య పరీక్షలు, సాక్ష్యాల సేకరణలో చాలా జాప్యం జరిగిపోయిందనీ.. ఆ కిరాతకుడిని చంపేయడమే
సరైన శిక్ష అన్నారు బాలిక తండ్రి .
ఆసుపత్రి బెడ్ మీదనుంచే నిందితుడి ఫోటోను గుర్తించింది పాప. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.