జనసభతో జనంలోకి ఆప్
న్యూఢిల్లీ: ఒకప్పుడు సంచలనాలకు కేంద్రంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు నానాఅస్థలు పడుతోంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలనాథులు పాలువు కదుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన ఆప్, బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవాలని యోచిస్తోంది. అందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తీసుకురావాలని ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఢిల్లీలో అసెంబ్లీని రద్దుచేసి, ఎన్నికలు వెంటనే జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆప్ నేతలు ఇప్పటికే రాష్ట్రపతి కలిశారు.
అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఎన్నికలు జరిపించేలా సిఫారసు చేయాలని కోరారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వచ్చేనెల 3న నగరంలోని జంతర్‌మంతర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌తోపాటు సీనియర్ నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకే ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నాయి.
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు...
లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందంటూ అనేక సర్వేలు, మీడియా స్పష్టం చేస్తుండడంతో ఈ సభ ద్వారా సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అందుకే జంతర్‌మంతర్ వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను ఆప్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే సమాచారం అందించారు. పార్టీకి జనాదరణ బాగా ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని జంతర్‌మంతర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు రెండుమూడు రోజుల ముందు రేడియో, టీవీ, సోషల్ మీడియా ద్వారా కూడా సభ గురించి ప్రచారం చేయాలని కూడా భావిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు.
ఉనికిని చాటుకునేందుకేనా?
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ ప్రభావం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు వస్తాయని భావించినా అనుకున్నది జరగలేదు. పైగా రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో ఢిల్లీపైన దృష్టిని కాసేపు పక్కనబెట్టి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు కేజ్రీవాల్. వారణాసి నియోజకవర్గం నుంచి నరేంద్ర మోడీ ప్రత్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కేజ్రీవాల్‌కు చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా కాస్త పరువు దక్కించుకునే రీతిలో ఓటమిపాలయ్యారు. దీంతో కేవలం కేజ్రీవాల్ ఇమేజే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ కూడా ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది.
ఈ దశలో పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలని భావించిన కేజ్రీవాల్ మళ్లీ ఢిల్లీపై దృష్టిసారించారు. అయితే ఇక్కడ కూడా కేజ్రీవాల్ ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అప్పటిదాకా ఎన్నికలకు వెళ్దామన్న బీజేపీ అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుండడంతో ఏం చేయాలో తోచని కేజ్రీవాల్ రాష్ట్రపతి, లెఫ్టినెంట్ గవర్నర్ చుట్టూ తిరిగారు. ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అయితే వారి నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో చివరకు జనంలోకి రావాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా పార్టీ ఉనికిని కాపాడుకోవడంతోపాటు ఎన్నికలు జరిగేలా ప్రత్యర్థిపై ఒత్తిడి కూడా పెంచినట్లు అవుతుందని కేజ్రీవాల్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.