న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు అందాల్సిన పరిహారంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బాధితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి పరిహారం అందాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ సంస్థలు బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై వేసిన పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది.
‘బాధితుడు పర్మినెంట్ ఉద్యోగి అయి అతని వయసు 40 ఏళ్ల లోపు ఉన్నట్లయితే.. అతడి భవిష్యత్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ వేతనం (యాక్చువల్ శాలరీ) లో 50 శాతం అదనంగా చెల్లించాలి. బాధితుడి వయసు 40–50 ఏళ్లలోపున్నట్లయితే 30 శాతం అదనంగా, 50–60 ఏళ్ల లోపుంటే 15 శాతం అదనంగా చెల్లించాలి’ అని స్పష్టం చేసింది. బాధితుడు స్వయం ఉపాధి లేదా నిర్ణీత వేతన జీవి అయి 40 ఏళ్ల లోపు వాడైతే.. ఎస్టాబ్లిష్డ్ ఆదాయానికి అదనంగా 40 శాతం చెల్లించాల్సిందేనని ఆదేశించింది.
ఈ కేసులో బాధితుడి వయసు 40–50 ఏళ్ల మధ్యన ఉంటే 25 శాతం, 50–60 మధ్యన ఉంటే 10 శాతం అదనంగా ఇవ్వాలని పేర్కొంది. ఆదాయం నుంచి పన్నులను తొలగించగా వచ్చేదే ఎస్టాబ్లిష్డ్ ఆదాయం. ‘రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితుడు చనిపోయిన పక్షంలో.. అతని అంత్యక్రియలకు రూ.15వేలు చెల్లించాలి. ఇది కూడా ప్రతీ మూడేళ్లకోసారి 10 శాతం పెరుగుతుంది. ఆస్తినష్టం జరిగితే రూ.15వేలు, వ్యాపార నష్టానికి రూ.40వేలు చెల్లించాల్సిందే’ అని ధర్మాసనం ఆదేశించింది.
‘రాజకీయ’ నేరాల వివరాలివ్వండి
రాజకీయ నేతలపై క్రిమినల్ కేసుల రేటుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ నేతలపై విచారణను ఏడాదిలో పూర్తిచేయాలన్న తమ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో తెలపాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ నవీన్ సిన్హాల ధర్మాసనం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment