సినిమాకు గవర్నర్ ప్రశంస
ఈటానగర్: భారత్-చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధం ఆధారంగా తెరకెక్కిన '1962: మై కంట్రీ ల్యాండ్' సినిమాపై అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజఖొవా ప్రశంసలు కురిపించారు. ఆనాటి యుద్ధ పరిస్థితులను, అరుణాచల్ ప్రదేశ్ లోని గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని మెచ్చుకున్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జానపదాలు, ప్రకృతి సౌందర్యాలు ప్రతిబింబించేలా మరిన్ని సినిమాలు తెరకెక్కించాలని చిత్ర రూపకర్తలను ఆయన కోరారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు సినిమా రంగంలో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
'1962: మై కంట్రీ ల్యాండ్' సినిమాను అస్సామీ దర్శకుడు చొ పార్థ బొర్గొహెయిన్ తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బుధవారం ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ కు గవర్నర్ రాజఖొవా అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.