కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలు | big shots in corporate spy | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలు

Published Sat, Feb 21 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలు

కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలు

న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యంలో తీగలాగితే  డొంక కదిలింది. ప్రభుత్వ రహస్య పత్రాలు అంగట్లో సరుకులైన వైనం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ శాఖల కీలక విధాన పత్రాలు అధికార పరిధులు దాటి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిన దారుణం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. చివరకు ఈ నెల 28న ఆర్థికమంత్రి ఇవ్వనున్న బడ్జెట్ ప్రసంగంలోని అంశాలు సైతం ముందే బహిర్గతమవ్వడం కార్పొరేట్ గూఢచర్యపు లోతులను కళ్లకు కడ్తోంది. సంచలనం సృష్టించిన కార్పొరేట్ గూఢచర్యం కేసులో పెద్దతలకాయలు బయటపడుతున్నాయి.

ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఉన్న పెట్రోలియం శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కీలక రహస్య పత్రాలు తస్కరణకు గురైన కేసులో శుక్రవారం పోలీసులు ఇద్దరు పెట్రో కన్సల్టెంట్లు, ఐదు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురు సీనియర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. గురువారం అరెస్ట్ చేసిన ఐదుగురితో కలుపుకుని ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘శైలేశ్ సక్సేనా(రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మేనేజర్, కార్పొరేట్ అఫైర్స్), వినయ్ కుమార్(ఎస్సార్-డీజీఎం), కేకే నాయక్(కెయిర్న్స్ ఇండియా-జీఎం), సుభాశ్ చంద్ర(జూబిలెంట్ ఎనర్జీ-సీనియర్ ఎగ్జిక్యూటివ్), రిషి ఆనంద్(రిలయన్స్ అనిల్‌ధీరూభాయి అంబానీ గ్రూప్-అడాగ్-డీజీఎం)లను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు.

పెట్రోలియం శాఖ ఆఫీసులో తస్కరణకు గురైన రహస్య పత్రాలు కొన్ని వారి వద్ద లభించాయని ఏసీపీ అశోక్ చంద్ తెలిపారు. అంతకుముందు, పెట్రోలియం శాఖ నుంచి డాక్యుమెంట్లను దొంగలించిన వారికి.. కార్పొరేట్లకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించిన ఇద్దరు పెట్రో కన్సల్టెంట్లు శంతను సైకియా, ప్రయాస్ జైన్‌లనూ పోలీసులు అరెస్ట్ చేశారు. సైకియా మాజీ జర్నలిస్టు. ప్రస్తుతం పెట్రో వెబ్ పోర్టల్ నిర్వహిస్తున్నారు. ప్రయాస్‌కు పెట్రో కన్సల్టెన్సీ ఉంది. వారి నుంచి పెద్ద ఎత్తున కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద నిందితులందరి నుంచి  రెండు బస్తాల డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం విశేషం.


 డొంక కదిలిందిలా.. పెట్రోలియం శాఖకు చెందిన కీలక పత్రాలను ఆ శాఖ కేంద్ర కార్యాలయం ఉన్న శాస్త్రిభవన్ నుంచి దొంగతనంగా తీసుకువెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడంతో ఈ  కార్పొరేట్ స్కామ్ డొంక కదిలింది. అయితే, పోలీసుల దర్యాప్తులో పెట్రోలియం శాఖతో పాటు ఆర్థిక, బొగ్గు, విద్యుత్ శాఖలకు చెందిన రహస్య సమాచారం కూడా లీక్ అయినట్లు తేలింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో శాస్త్రి భవన్ వద్ద బుధవారం రాత్రి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాటు వేశారు.

అర్ధరాత్రి దాటాక ఒక కారులో ముగ్గురు శాస్త్రి భవన్ వద్దకు వచ్చారు. కారులోంచి ఇద్దరు దిగి పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆఫీసులోకి వెళ్లారు. రెండు గంటలయ్యాక డాక్యుమెంట్ల కట్టలతో తిరిగి కారు వద్దకొచ్చారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని లలితాప్రసాద్(36), రాకేశ్ కుమార్(30)లుగా, కారులో ఉన్న వ్యక్తిని మధ్యవర్తి రాజ్‌కుమార్ దూబే(39)గా గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో ఇంకో ఇద్దరిని గురువారం, మరో ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.


 డాక్యుమెంట్ల సేకరణ ఎలా..?
 పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. శాస్త్రి భవన్‌లో చిరుద్యోగస్తులుగా ఉన్న ఆశారాం, ఈశ్వర్‌సింగ్‌లు అధికారుల ఆఫీసు గదుల, కీలక విభాగాల ఫైళ్లున్న బీరువాల తాళం చెవులకు నకిలీ తాళం చెవులను తయారుచేయించేవారు. ఉద్యోగస్తుల డూప్లికేట్ ఐడీ కార్డులను రూపొందించేవారు. సాధ్యమైనంత వరకు నైట్ డ్యూటీలు వేయించుకునేవారు. ఆ సమయంలో ఆఫీసులోని సీసీ కెమెరాలను ఆపేసేవారు. అర్ధరాత్రి దాటాక ఆశారాం కుమారులు లలితాప్రసాద్, రాకేశ్‌కుమార్(వీరు కూడా గతంలో శాస్త్రి భవన్‌లో ఉద్యోగాలు చేశారు) నకిలీ ఐడీలతో ఆఫీసు లోపలకి వెళ్లేవారు.

నకిలీ తాళంచెవులతో ఆఫీసర్ల గదుల తాళాలు తీసి డాక్యుమెంట్లను ఫొటోకాపీలు తీసి బయటకు తీసుకెళ్లేవారు. ప్రత్యేకంగా ఇది, అదని కాకుండా కనిపించిన ప్రతీ ఫైలునూ జీరాక్స్ తీసి తరలించేవారు. వాటిని మధ్యవర్తులకు అందజేసేవారు. మధ్యవర్తుల నుంచి అవి ‘అవసరమైన’ వారి వద్దకు చేరేవి. వారు పెట్రోలియం శాఖలో పెట్రో, సహజవాయు ధరల నిర్ణయం, పెట్రో, గ్యాస్ వెలికితీత విధానం.. వంటి కీలక విభాగాలను నిర్వహిస్తున్న స్పెషల్ సెక్రటరీ రాజీవ్ కుమార్, జాయింట్ సెక్రటరీ(రిఫైనరీస్) సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ(ఎక్స్‌ప్లొరేషన్) యూపీ సింగ్, డెరైక్టర్(ఎక్స్‌ప్లొరేషన్1) నళిన్ కుమార్ శ్రీవాస్తవ సహా పలువురు ఇతర డెరైక్టర్ల కార్యాలయాల నుంచి ఫైళ్లు తస్కరించారు. వాటిలో జాతీయ గ్యాస్‌గ్రిడ్‌కు సంబంధించి రానున్న బడ్జెట్లో ఆర్థికమంత్రి జైట్లీ వెల్లడించనున్న సమాచారమూఉంది. అలాగే, ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర నుంచి వచ్చిన లేఖ సైతం వారి వద్ద లభించింది.


 నెలల క్రితమే.. కొన్ని కీలక ఫైళ్లు కనిపించకుండా పోయిన విషయాన్ని కొన్ని నెలల క్రితమే పెట్రోలియం శాఖ అధికారులు గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జాయింట్ సెక్రటరీ గిరిధర్ ఆర్మానే వద్ద ఉండాల్సిన పత్రాలు ఒకరోజు ఉదయం ఫొటో కాపీ యంత్రంలో కనిపించడం, కొన్ని గదులు తెరచి ఉండటంతో అధికారులు అప్రమత్తమై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారని తెలిపాయి. ఆఫీస్‌లో సీసీ కెమెరాలను, గదులకు కొత్త తాళాలను ఏర్పాటు చేసుకున్నారన్నాయి. కాగా ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.  


 ఎవరిని అరెస్ట్ చేశారు?
 పెట్రోలియం శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆశారాం(58), ఈశ్వర్‌సింగ్(56), ఆశారాం కుమారులు లలితా ప్రసాద్, రాకేశ్‌కుమార్‌లతో పాటు మధ్యవర్తి రాజ్‌కుమార్ దూబేని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో దొంగిలించిన ఫైళ్లను కొనుగోలు చేశారని భావిస్తున్న పెట్రో కన్సెల్టెంట్లు సంతను సైకియా, ప్రయాస్ జైన్‌లను అరెస్ట్ చేశారు. లలితా ప్రసాద్, రాకేశ్ కుమార్, ప్రయాస్ జైన్, శంతను సైకియాలను కోర్టు ఫిబ్రవరి 23 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

మిగతా ముగ్గురు ఆశారాం, ఈశ్వర్‌సింగ్, రాజ్‌కుమార్ దూబేలను జూడీషియల్ కస్టడీకి పంపించింది. లలితప్రసాద్‌కు రూ. 70 వేలు, రాకేశ్‌కు రూ. 40 వేలు ప్రయాస్ జైన్ నెలవారీగా చెల్లించేవాడని పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిచ్చిన డాక్యుమెంట్లలోని సమాచారాన్ని జైన్ తన క్లయింట్లకు అమ్ముకునేవాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పలువురు జర్నలిస్టులు, పెట్రో కన్సల్టెంట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులను కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement