న్యూఢిల్లీ/బెర్న్: విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు భారత్ తన దర్యాప్తును విస్తరించిన నేపథ్యంలో కొత్త ప్రాంతాల్లోనూ నల్లధన జాడలు వెలుగు చూస్తున్నాయి. భారత్ దృష్టి సారించిన స్విట్జర్లాండ్‌లోనే కాకుండా వివిధ ద్వీప దేశాలు, దుబాయ్, సింగపూర్, లక్సెంబర్గ్, సైప్రస్ వంటి ప్రపంచ ఆర్థిక కేంద్రాల్లోనూ నల్లధనం ఉందని దర్యాప్తులో ఆధారాలు లభించాయి. స్విస్, భారత్‌లు కొనసాగిస్తున్న సహకారం ఫలితంగా కొత్త అంశాలు వె లుగు చూస్తున్నాయని, స్విస్ అవతల అక్రమ లావాదేవీలు సాగినట్లు తెలుస్తోందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. భారత్‌లోని 15 నుంచి 20 కంపెనీల నల్లధనానికి సంబంధించిన వాటి తరఫున స్విస్‌కు బయటున్న కొన్ని బ్యాంకులు వ్యవహారాలు నడుపుతున్నట్లు తేలిందని వెల్లడించాయి.
భారత్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంకుల ఉన్నతాధికారుల్లో కొందరు తమ ఖాతాదార్ల నల్లడబ్బును పెట్టుబడుల సాకుతో తిరిగి భారత్‌కు చేరవేయడానికి సాయపడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. స్విస్‌లోని నల్లధనాన్ని షేర్ మార్కెట్లు, ఎగుమతులు-దిగుమతులు తదితర మార్గాల్లో భారత్, ఇతర ప్రాంతాలకు తరలించాలని ఈ బ్యాంకులు తమ ఖాతాదారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే నల్లధనంపై దర్యాప్తు నేపథ్యంలో కొన్ని బ్యాంకు లు భారతీయుల ఖాతాలకు వారు బాధ్యత వహించేలా వారి నుంచి హామీలు తీసుకుంటున్నాయి. స్విస్ జాతీయ బ్యాంకుల తాజా సమాచారం ప్రకారం 2013 నాటికి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు రూ.14 వేల కోట్లు.