గొడ్డును బాదినట్లు.. కొడుకును బాదేసింది!
గొడ్డును బాదినట్లు.. కొడుకును బాదేసింది!
Published Wed, Dec 21 2016 11:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
గొడ్డును కూడా అంత దారుణంగా బాదరు.. అలాంటిది కన్న కొడుకును దారుణాతి దారుణంగా కొట్టిన ఓ తల్లి మీద ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఏడాదిన్నర వయసున్న కొడుకును అలా కొట్టిన విషయం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ చంటి పిల్లాడిని కింద పారేసి చేత్తో ఎడాపెడా బాదేయడమే కాక, చివరకు కాళ్లతో కూడా తన్నుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. తర్వాత కాసేపటికి ఒక మహిళ వచ్చి ఆ పిల్లాడిని తీసుకుపోవడం కూడా రికార్డయింది. మూడేళ్ల క్రితం తన కొడుకుతో ఆమెకు పెళ్లయిందని, వాళ్లిద్దరికీ ముగ్గురు పిల్లలున్నారని.. కానీ ఆమె మాత్రం తరచు భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా కొడుతూ ఉంటోందని సదరు మహిళ అత్తగారు షహానా ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది చాలా షాకింగ్ ఘటన అని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తరచు కొడుతున్న ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద సాక్ష్యాలు ఏమీ లేవని, చివరకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చిన తర్వాత ఆమె విషయం బయటపడిందని షహానా తెలిపారు.
గీతా కాలనీకి చెందిన సదరు మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె చేసిన దారుణంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, తూర్పు ఢిల్లీ డీసీపీ ఓంవీర్ సింగ్ చెప్పారు. తన కోడలు తరచు భర్తను, పిల్లలను కొడుతూ ఉంటుందని, తాము ఎంత చెప్పినా వినిపించుకోలేదని షహానా అన్నారు. ఎవరూ గొడ్లను కూడా ఇంత దారుణంగా కొట్టరని, అలాంటిది కన్న కొడుకును.. అది కూడా ఏడాదిన్నర వయసు మాత్రమే ఉన్న కొడుకును కొట్టిందంటే ఆమె మానసిక స్థితి మీద కూడా విచారణ చేయాల్సి ఉందని స్వాతి మలివాల్ అన్నారు. ఒకవేళ ఆమెకు మానసిక పరమైన సమస్య ఏమైనా ఉంటే తప్పకుండా చికిత్స చేయిస్తామన్నారు.
Advertisement
Advertisement