ఆర్మీకి ప్రేమతో.. : సెహ్వాగ్
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారతీయ ఆర్మీపై తనకు ఉన్న ప్రేమను మరోమారు చాటుకున్నాడు. ఈ నెల 23న జమ్మూకశ్మీర్‌లో జరిగిన మిలిటెంట్ల దాడిలో ముగ్గురు జవానులు అమరులు కాగా మేజర్ అమర్‌దీప్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ ముఖేష్ ఝాలు తీవ్రంగా గాయపడ్డారు. మేజర్ అమర్‌దీప్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్‌లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.
మిలిటెంట్ల దాడిలో మెదడులోకి బుల్లెట్ దూసుకెళ్లిన అమర్‌దీప్ సింగ్ ఫోటోను వెటరన్ మేజర్ ఆర్యా ట్వీట్ చేయగా.. సెహ్వాగ్ రీట్వీట్ చేశాడు. భారతీయ ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చేసిన ట్వీట్లకు కూడా సెహ్వాగ్ రీట్వీట్ చేశాడు. ఈ నెల 21న కొందరు ఆర్మీ వెటరన్ల ట్వీట్లపై 'జవాన్ హమారా భగవాన్' అంటూ స్పందించాడు సెహ్వాగ్. గతంలో కూడా ఆర్మీకి సంబంధించిన విషయాలపై స్పందించిన సెహ్వాగ్.. తన మద్దతును తెలియజేస్తూ వస్తున్నాడు.