సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌ను అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈ స్కామ్‌పై తాజాగా మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలతో చెలరేగారు. ‘ అవినీతి అంతర్జాతీయీకరించారు..ఈ రాఫెల్ విమానం చాలా వేగంగా..దూరంగా ఎగురుతోంది..ఈ విమానం రానున్న కొద్ది వారాల్లో భారీ బంకర్ బస్టర్ బాంబులను వేయబోతోంద’ని రాహుల్ శుక్రవారం వ్యాఖ్యానించారు.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సమయంలో ఆయన భాగస్వామి, నటుడు జూలీ గయెట్‌తో ఓ మూవీని నిర్మించేందుకు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒప్పందం చేసుకుందనే వార్తల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 2012 నుంచి 2017 వరకూ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా హోలాండ్ వ్యవహరించగా, గయెట్‌తో ఆయన అనుబంధం 2014 జనవరిలో వెలుగులోకి వచ్చింది.
భారత్-ఫ్రాన్స్‌ల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అమలులో భాగంగా దాసాల్ట్‌తో రిలయన్స్ జాయింట్ వెంచర్ హోలాండ్ హయాంలోనే 2016 అక్టోబర్‌లో ఖరారు కావడం గమనార్హమని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఈ క్రమంలో మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ ఆరోపణలు గుప్పించారు. ‘మోదీజీ..ఫ్రాన్స్‌లో పెనుదుమారం రేగుతోందని అనిల్ అంబానీకి చెప్పండంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
రాఫెల్ డీల్‌కు సంబంధించి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని దాసాల్ట్‌తో రిలయన్స్ భాగస్వామ్యానికి ఇరు దేశాల (భారత్, ఫ్రాన్స్) ప్రభుత్వాలకు సంబంధం లేదని అనిల్ అంబానీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అనిల్ వారిపై పరువు నష్టం దావా దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment