దేవుడు ఆదేశించాడు.. ‘తలైవా’ వస్తున్నాడు
- తమిళరివి మణియన్ ప్రకటన.. రజనీకి ప్రస్తుతం 25 శాతం ఓట్లు
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబో తున్నారని గాంధేయ వక్కల్ ఇయక్కం నేత తమిళరవి మణియన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రజనీకి 25 శాతం ఓటు బ్యాంక్ ఉందని, రాజకీయాల్లోకి రాగానే ఆ సంఖ్య 45 శాతానికి చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తిరుచ్చి వేదికగా ‘రజనీ’ రాజకీయ నినాదంతో మహానాడు తమిళరివిమణియన్ నేతృత్వంలో జరిగింది. ఈ మహానాడుకు రజనీ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఎక్కడ చూసినా మహాత్మాగాంధీ, తమిళనాడు మాజీ సీఎం కామరాజ్ చిత్ర పటాలతోపాటుగా రజనీకాంత్ చిత్ర పటాల్ని హోరెత్తించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో తమిళరవి మణియన్ చేసిన ప్రసంగం రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే సంకేతాలిస్తోంది. రజనీకాంత్‌తో తాను సమావేశమైన సమయంలో ఆయన మాటలు, వ్యాఖ్యలు నిజమైన నాయకుడిని గుర్తు చేసినట్టు మణియన్ తెలిపారు.
ఇది దేవుడు ఇచ్చిన ఆదేశం.. ఇదే సరైన తరుణం.. అని రజనీ తనతో చెప్పినట్టుగా వివరించారు. తమిళుల జీవనాధారం పరిర క్షణ కోసం నదుల అనుసంధానం, అవినీతిరహిత పాలన, పారదర్శక పాలన అనే మూడు నినాదాలతో రజనీ రాజకీయాల్లో రావడం ఖాయం అని స్పష్టం చేశారు.