ఆ జర్నలిస్ట్‌ను వదిలేయండి | SC orders release of journalist Says right to liberty nonnegotiable | Sakshi
Sakshi News home page

ఆ జర్నలిస్ట్‌ను వదిలేయండి

Published Wed, Jun 12 2019 5:00 AM | Last Updated on Wed, Jun 12 2019 8:52 AM

SC orders release of journalist Says right to liberty nonnegotiable - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ కనోజియాను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కును ప్రభుత్వాలు అడ్డుకోజాలవని, స్వేచ్ఛ హక్కు పవిత్రమైంది, చర్చకు అతీతమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కనోజియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం.. అతనిపై తీసుకున్న చర్య అతిగా ఉన్నట్లు భావించడం వల్లే బెయిల్‌ మంజూరు చేస్తున్నామే తప్ప, ఆ పోస్టులు, ట్వీట్లను తాము సమర్ధించినట్లుగా భావించరాదని స్పష్టం చేసింది. కనోజియాను చట్ట విరుద్ధంగా నిర్బంధించారంటూ అతని భార్య జిగిషా అరోరా పెట్టుకున్న హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది.

ఇదేమైనా హత్యకేసా?
విచారణ సందర్భంగా ధర్మాసనం..‘అతని ట్వీట్లను మేం మెచ్చుకోకపోవచ్చు. కానీ, సామాజిక మాధ్యమాల్లో ఆ పోస్టులకుగాను అతడిని జైలులో ఉంచాలా అనేదే అసలు ప్రశ్న. ఇదేమైనా హత్య కేసా? వాస్తవంగా ఒక వ్యక్తిని 11 రోజుల పాటు జైలులో ఉంచాల్సిన కేసు కాదిది. ఈ అంశమే మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. అతనిని ప్రభుత్వం ఔదార్యంతో విడుదల చేయాలి’ అని ధర్మాసనం తెలిపింది. స్వేచ్ఛ హక్కును ప్రభుత్వం నిరాకరించడానికి తాజా ఉదాహరణ ఇది అంటూ ధర్మాసనం.. చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ విధించిన షరతులకు లోబడి కనోజియాను వెంటనే విడుదల చేసి, చట్ట ప్రకారం అతడిపై తదుపరి చర్యలు తీసుకోవచ్చు’ అని పేర్కొంది.

‘సామాజిక మాధ్యమాల దాడిని కోర్టులు కూడా ఒక్కోసారి భరించాల్సి వస్తోంది. పోస్టులు, ట్వీటులు ఒక్కోసారి న్యాయంగా అనిపించినప్పటికీ కొన్నిసార్లు అన్యాయంగా కూడా ఉంటున్నాయి. అయినప్పటికీ మా విధులను మేం నిర్వర్తిస్తున్నాం’అని పేర్కొంది.  ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, స్వేచ్ఛ హక్కు నిరాకరణకు గురైనప్పుడు న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోలేదని పేర్కొంది. ఆర్టికల్‌ 142 ప్రకారం స్పందించే బాధ్యత తమకుందని తెలిపింది.

యూపీ సర్కారుపై రాహుల్‌ మండిపాటు
జర్నలిస్ట్‌ కనోజియా, నేషన్‌ లైవ్‌ టీవీ చానల్‌ అధిపతి, ఎడిటర్‌ల అరెస్టును కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ మూర్ఖంగా వ్యవహరించడం మాని అరెస్టయిన జర్నలిస్టును విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తరఫున ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల ప్రచారానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని జైళ్లలో పెడుతూ పోతూ వార్తా పత్రికలు, వార్తా చానళ్లలో పనిచేసేందుకు సిబ్బందే దొరకరని ట్విట్టర్‌లో రాహుల్‌ పేర్కొన్నారు.æ మీడియాను అణచి వేసేందుకు పోలీసులు చట్టాన్ని వినియోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎడిటర్స్‌ గిల్డ్‌  ఆరోపించింది.

ఏం జరిగింది?
లక్నోలోని ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల ఒక మహిళ మీడియాతో తాను సీఎంకు పెళ్లి ప్రతిపాదన చేసినట్లుగా చెబుతున్న వీడియోను జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ కనోజియా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీంతో సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారంటూ కనోజియాతోపాటు అతడు పనిచేస్తున్న నేషన్‌ లైవ్‌ టీవీ చానల్‌ ఎడిటర్‌ అనూజ్‌ శుక్లా, అధిపతి ఇషికా సింగ్‌లపై లక్నోలోని హజరత్‌ గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదయింది. ఈ కేసు విచారించిన జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌.. పై ముగ్గురికీ దాదాపు రెండు వారాల పాటు అంటే ఈనెల 22 వరకు రిమాండ్‌లో ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అనూజ్‌ శుక్లా, ఇషికా సింగ్‌లకు మాత్రమే బెయిల్‌ మంజూరయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement